కృష్ణా నదిలో దొంగలు పడ్డారు..!

–నది మధ్య భాగాన్ని ఆక్రమించుకున్న వైనం
–150 ఎకరాల విస్తీర్ణం నీటి మధ్యలో హద్దులు ఏర్పాటు
–నీటిలోపల బలమైన రోప్‌... పై భాగంలో ప్లాస్టిట్‌ డబ్బాలు
–జెండాలు ఏర్పాటు చేసి... మత్స్యకారులకు హెచ్చరికలు
–ప్రభుత్వం మాదే... సీఎంకీ వాటా ఉందని చెప్పిన అక్రమార్కులు
–మత్స్యకారులు ఫిర్యాదు చేసినా స్పందించని అధికారులు
–ఇద్దరు మంత్రుల కనుసన్నల్లో కృష్ణా నదిలో ఆక్రమణలు
–రిసార్ట్స్, మల్టీప్లెక్స్‌ల నిర్మాణాల కోసం రెచ్చిపోతున్న కబ్జారాయుళ్లు

అమరావతిః టీడీపీ నేతల అక్రమాలకు భూములు.. కొండలు.. చెరువులే కాదు, నదులు కూడా మాయమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో ఏకంగా కృష్ణా నదినే ఆక్రమించుకున్న సంఘటన బయటపడింది. నీటి మధ్యలో రిసార్ట్స్, మల్టీప్లెక్స్‌లు నిర్మించుకునేందుకు సుమారు 150 ఎకరాల విస్తీర్ణం చుట్టూ హద్దులు ఏర్పాటు చేసి జెండాలు ఏర్పాటు చేశారు. ఎర్రజెండాలు ఏర్పాటు చేసిన ప్రాంతంలోకి మత్స్యకారులు ప్రవేశించరాదని హుకుం జారీ చేశారు. అలా కాదని అందులోకి అడుగుపెడితే అంతుచూస్తామని హెచ్చరించినట్లు మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేశారు. 

కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు ప్రధాన సాగు, త్రాగునీటి ఆదరువు కృష్ణానది. లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించటంతో పాటు విజయవాడ, గుంటూరు, తెనాలి మున్సిపాలిటీ పరిధిలోని జనాభాకు సరఫరా అయ్యే తాగునీరు కూడా కృష్ణానది నుంచే తీసుకుంటారు. అటువంటి కృష్ణా నది నేడు అక్రమార్కుల చేష్టలకు రోజు రోజుకు కుంచించుకుపోతోంది. ఏపీ నూతన రాజధానిగా అమరాతిని ప్రకటించిన కొన్నాళ్లకే టీడీపీ నేతలు కృష్ణానదిలోని విలువైన ఇసుకను భారీ యంత్రాల సాయంతో కొల్లగొట్టారు. లారీల ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలించి కోట్ల రూపాయలు సొమ్ముచేసుకున్నారు. అంతటితో విడిచిపెట్టకుండా అధికారపార్టీ నేతలు ఏకంగా కృష్ణానదినే చెరబట్టేందుకు సిద్దమయ్యారు.

ఆక్రమణల పర్వం
ఉద్దండరాయునిపాలెం లంకకు అతిసమీపంలో విస్తరించిన కృష్ణానది మధ్య భాగం సుమారు 150 ఎకరాలు ఆక్రమణకు గురైంది. కృష్ణానదీ పరివాహక ప్రాంతమైన తాళ్లాయపాలెం, ఉద్దండరాయునిపాలెం, తుమ్మలపాలెం, గుంటుపల్లి మధ్య కృష్ణానదిలో కి.మీ దూరం మేర బ్లూ డబ్బాలకు ఎర్రని జెండాలు ఏర్పాటు చేసి ఉన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రుల ఆధ్వర్యంలో ఈ ఆక్రమణలకు తెరలేపారు. సుమారు 25 అడుగుల లోతు ఉన్న నదిలో నెల రోజుల క్రితం పనులు ప్రారంభించినట్లు మత్స్యకారులు చెబుతున్నారు. ప్రతి రోజూ సుమారు 20 మంది గజ ఈతగాళ్లు పడవల్లో వచ్చి నదిలో దిగి ఇనుముతో తయారుచేసిన రోప్‌ను నీటిలో విడిచిపెట్టినట్లు తెలిపారు. నీటిలో విడిచిపెట్టిన ఆ రోప్‌కు విస్తీర్ణం కనిపించేలా ప్లాస్టిక్‌తో ప్రత్యేకంగా తయారుచేసిన బ్లూ డబ్బాలను ఏర్పాటు చేశారు. ఆ డబ్బాలకే ఎర్రని జెండాలు ఏర్పాటు చేశారు. సుమారు 30 రోజులపాటు జరిగిన కృష్ణానది ఆక్రమణ పనులు నాలుగురోజుల క్రితం పూర్తి చేసినట్లు మత్స్యకారులు వెల్లడించారు. ఆ నెల రోజుల పాటు మత్స్యకారులెవ్వరినీ అటువైపు వేటకు వెళ్లకుండా అడ్డుకున్నట్లు తెలిసింది. ఏం జరుగుతోందని మత్స్యకారులు అక్రమార్కులను ప్రశ్నిస్తే... ‘ప్రభుత్వం మాదే. మేము ఏం చేస్తే మీకెందుకు’ అని బెదిరించారని,  ఈ పనిలో సీఎం చంద్రబాబుకు వాటా ఉందని చెప్పారని వారు వెల్లడించారు. 

నయా దోపిడీ..!
ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించిన తరువాత కృష్ణా, గుంటూరు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు భూములకు మంచి డిమాండ్‌ ఏర్పడింది. ముఖ్యంగా కృష్ణా నదీ తీర ప్రాంతంపై టీడీపీ పెద్దలు కన్నేశారు.  అందులో భాగంగా లంక, నదీ తీర ప్రాంతంలో ఉన్న భూములను సొంతం చేసుకునేందుకు పథకం వేశారు.  నాలుగు నెలల క్రితం గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి అనుచరుడు కొందరు గూండాలతో ఉద్దండరాయునిపాలెం సమీపంలోని లంకలోకి ప్రవేశించారు. సుమారు రూ.300 కోట్లు విలువచేసే లంక భూములను ఆక్రమించునే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న స్థానికులు అడ్డుకోవటం... ఈ ఆక్రమణ పర్వాన్నిఓ పత్రిక వెలుగులోకి తీసుకురావటంతో లంక భూముల ఆక్రమణకు అడ్డుకట్టపడిన విషయం తెలిసిందే. అదే తరహాలో కృష్ణానదిలో ప్రస్తుతం ఆక్రమించుకున్న 150 ఎకరాల విషయం గురించి స్థానికులకు తీవ్ర హెచ్చరికలు చేశారు. నదీ తీర ప్రాంతంలో ఆక్రమణలకు గురవుతున్న లంక, నదీ తీర ప్రాంతాల్లో రిసార్ట్స్, మల్టీఫ్లెక్స్‌లు, పబ్‌లు, క్లబ్‌లు నిర్మించి తద్వారా భారీ డబ్బు సంపాదించాలనేది టీడీపీ నేతల లక్ష్యంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆక్రమించుకున్న ప్రాంతంలో గతంలో ఓ బడా కంపెనీ వారు నది మధ్యలో ఆక్రమించుకుని మట్టితో దీవిలా ఏర్పాటు చేసి ఉన్నారు. అదే తరహాలో ప్రస్తుతం ఆక్రమించుకున్న ప్రాంతాన్ని మట్టి, ఇసుకతో గట్టుగా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. అందులో భాగంగా తుమ్మలపాలెం ఘాట్‌వద్దకు మూడు భారీ పడవలు తెప్పించారు. అదే విధంగా భారీ పైపులు కూడా తీసుకొచ్చారు. పడవల్లో పైపులు, ఇసుక, మట్టిని తీసుకెళ్లి జెండాలు పాతిన ప్రాంతం చుట్టూ నదిని పూడ్చివేసేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు.

పట్టించుకోని అధికారులు
కృష్ణానదిని ఆక్రమించుకుంటున్న విషయం మత్సకారులు, స్థానికులు తుళ్లూరు తహశీల్దార్‌ సుధీర్‌బాబుకు ఫిర్యాదు చేశారు.  ఈ విషయాన్ని ఎమ్మార్వో సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌బాబు దృష్టికి తీసుకెళ్లగా...ఆయన  దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. సీఎం చంద్రబాబు భద్రత కోసం పోలీసులు ఏర్పాటు చేసినట్లున్నారని సీఆర్‌డీఏ కమిషనర్‌ చెప్పడంపై స్థానికులు ఆగ్రహం వెలిబుచ్చారు.  గుంటూరు రూరల్‌ ఎస్పీ నారాయణ నాయక్‌ కమిషనర్‌ చెప్పిన విషయాన్ని కొట్టిపారేశారు. నదిలో జెండాలు పాతాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. మొత్తంగా కృష్ణానదిని పక్కా పథకంతోనే ప్రభుత్వ పెద్దలు కొందరు ఆక్రమించుకుంటున్నట్లు స్పష్టమవుతోంది.

నదినే ఆక్రమించుకోవటం ఏమిటి?
–మత్స్యకారుడు, అబ్రహాం, గుంటుపల్లి.
ఎక్కడైనా భూములు, కొండులు ఆక్రమించుకున్న విషయాలను విన్నాం. కానీ ఇక్కడ నదినే ఆక్రమించుకోవటం నేనెక్కడా చూడలేదు. ఈ విషయం గురించి అడిగితే... ఇందులో చంద్రబాబుక్కూడా వాటా ఉందంటున్నారు. పట్టా కూడా పుట్టించుకున్నారంట. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి జెండాలు పాతి వెళ్లాక మమ్మల్నెవర్నీ అవతలకు పంపలేదు. 500 కుటుంబాలకుపైగా చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నాం. అటువంటిది మాకు చేపల వేట కూడా దూరం చేయాలని చూస్తున్నారు. సింగపూర్, జపాన్‌ మిషన్లు తీసుకొచ్చి నదిని పూడ్చివేస్తారంట. 

మేమెలా బతకాలి.
పంటను నాశనం చేశారు... ఇప్పుడు నదినే లేకుండా చేస్తున్నారుః
–నందిగామ సురేష్, ఉద్దండరాయునిపాలెం రైతు.
రాజధాని పేరుతో పంటలను నాశనం చేశారు. ఇప్పుడు రిసార్ట్స్‌ల కోసం అంటూ ఏకంగా నదినే పూడ్చివేయటానికి సిద్దమవుతున్నారు. నాలుగు నెలల క్రితం 250 ఎకరాలను కొందరు లంక భూములను ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు. మా ఊరి వాళ్లం అంతా ఏకమై అడ్డుకుంటే భయపడ్డారు. ఆ తరువాత ప్రముఖ పత్రికలో వార్తలు రావటంతో అక్రమార్కులు భయపడి అటువైపు రాలేదు. అయినా ఆ భూముల కోసం ప్రయత్నాలు మాత్రం విడిచిపెట్టలేదు. అదే తరహాలో ఈ రోజు నదిని కూడా ఆక్రమించున్నారు. ఇదెక్కడి న్యాయం.
Back to Top