ఇసుకను పట్టు కోట్లు కొల్లగొట్టు

-రెచ్చిపోతున్న ఇసుక దందా
-చంద్రబాబు అండ చూసుకుని దాడులకు తెగబడుతున్న మాఫియా
-రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తినా పట్టించుకోని బాబు ప్రభుత్వం
-అధికారులు, పోలీసు యంత్రాంగం ప్రభుత్వానికి సలాం
-గూండాల రాజ్యంలో అవినీతిని ప్రశ్నిస్తే ప్రాణాలకు రక్షణ లేని వైనం
-నిరంతరం అన్యాయాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేత వైయస్ జగన్

అంతులేని అవినీతి, ఆగని ధన దాహం, అధికారం ఉందనే అహంకారం, చట్టాలను సైతం లెక్కచేయని తత్వం…ఇవన్నీ చంద్రబాబు టిడిపి ప్రభుత్వానికున్న సవాలక్ష లక్షణాలు. చంద్ర బాబు 2014లో అధికారం చేప్పటిన నాటి నుండి రాష్ట్రంలో భూదందా, ఇసుక అక్రమ రవాణా ఎన్నడూ కనీ వినీ ఎరుగని స్థాయిలో జరుగుతున్నాయి. ఏడాదికి వేలకోట్ల రూపాయిలు టిడిపి నేతల జేబుల్లోకి చేరుతున్నాయి. స్వయంగా చంద్రబాబే వీరికి అండగా ఉంటున్నారని, అందుకే బరితెగించి దేశం నేతలు ఈ దోపిడీలకు పాల్పడుతున్నారని, ప్రతిపక్షం, ప్రజలు అంటున్నారు. 

గోదావరి పరివాహక ప్రాంతాలు, కృష్ణా నది పరిసరప్రాంతాలే కాకుండా అనంతపురం, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల్లోనూ భారీగా ఇసుకు దందా జరుగుతోంది. ఇది సాదాసీదా దొంగ వ్యాపారంలా కాక ఒక పెద్ద ముఠాలా, మాఫియాలా తయారయ్యింది. స్వయంగా స్థానిక టిడిపి నేతలే తమ అనుయాయులతో నిర్వహిస్తుండటం, వీరికి పెద్దలనుంచి సహకారాలుండటంతో ప్రజలు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. తెగించి ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేసినా, ప్రతిపక్ష పార్టీ వారు ఇసుక అక్రమరవణాదారులను పట్టి అప్పగించినా, పోలీసులు వారిపై కనీసం కేసు కూడా నమోదు చేయకపోవడం చూస్తే అధికార పార్టీ ఎంతగా దిగజారి ప్రవర్తిస్తోందో అర్థం అవుతోంది. పోలీసు వ్యవస్థను కూడా గుప్పెట్లో పెట్టుకుని, అవినీతిని పెంచి పోషిస్తున్న చంద్రబాబు సర్కార్ ప్రజాధనాన్ని బాహాటంగా కొల్లగొడుతోంది. 

అడ్డుపడ్డ అధికారులకు అవమానాలు
ఇసుక మాఫియా ఆగడాలు జరిగే ప్రతి చోటా అధికారులు చాలావరకూ కిమ్మనకుండా ఉండిపోతున్నారు. కాని వారిని ప్రశ్నించిన అధికారులను ఇసుక మాఫియాను దగ్గరుండి నడిపించే నేతలే నేరుగా అడ్డుకుని, దాడులకు పాల్పడ్డారు. కృష్ణాజిల్లాలో ముసునూరు తాసిల్దార్ వనజాక్షికి ఇసుక అక్రమ తవ్వకాల గురించి సమాచారం అందింది. తనిఖీ కోసం రంగంపేట ఇసుక రీచ్ దగ్గరకు ఆమె చేరుకున్నారు. అక్కడ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అతని అనుచరులు, కొందరు డ్వాక్రామహిళలు ఉన్నారు. రెండు జిల్లాల సరిహద్దులు నిర్థారించుకున్న తర్వాత ఇసుక తవ్వకాలు జరుపుకోవాలని వనజాక్షి వారితో చెప్పారు. ఆగ్రహంతో ఊగిపోయిన ఎమ్మెల్యే చింతమనేని, ఆమెను నానా దుర్బాషలాడాడు. అతడి అనుచరులు తహసిల్దార్ పై దాడి చేసారు. కొందరు మహిళలను కూడా ఆమెపైకి ఉసిగొల్పారు. దాడిలో గాయపడిన తహసిల్దార్ విషయాన్ని ఉద్యోగుల సంఘం దృష్టికి, కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. టిడిపి ఎమ్మెల్యేను కాపాడటానికి స్వయంగా చంద్రబాబే రంగంలో దిగారు. ఘటనపై విచారణకు ద్విసభ్య కమిటీని వేసారు. అందులో ఎమ్మెల్యే తీరు తప్పని నివేదిక వచ్చింది. కాని బాబు జోక్యంతో వనజాక్షి కేసు నీరుగారి పోయింది. వృత్తి ధర్మాన్ని నిర్వర్తించినందుకు ఒక ఎమ్మెల్యే దాడి చేస్తే, అతడిని కొమ్ముకాసి ప్రభుత్వం ఆ అధికారిణి నోరు మూయించింది. 

మాఫియాను బయటపెట్టిన మీడియాపై దాడులు
తమ ప్రాంతంలో టిడిపి నేతల ఇసుక మాఫియా గురించి న్యూస్ ఇచ్చినందుకు ఒక జర్నలిస్ట్ చావు వరకూ వెళ్లొచ్చాడు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో  రిపోర్టర్ రామారెడ్డిపై మారణాయుధాలతో దాడి జరిగింది. రెండు రోజుల క్రితం ఆయన స్థానిక టిడిపి నేతలు, వారి అనుచరులు సాగిస్తున్న అక్రమ ఇసుక రవాణా గురించి ఒక కథనం ప్రసారం చేయడమే అందుకు కారణం అని జర్నలిస్టులు అంటున్నారు. ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా వార్త కథనం ఇవ్వడాన్ని సహించలేక పోయిన కొందరు, అర్థరాత్రి రామా రెడ్డి ఇంట్లోకి చొరబడి కత్తులతో భీభత్సం సృష్టించారు. జర్నలిస్టు తలపై తీవ్రంగా గాయపరిచారు. రెండు రోజులు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడి, ప్రాణాలతో బైటపడ్డారు రామా రెడ్డి. నిజాలను ప్రజలముందుకు తెచ్చే మీడియాపై కూడా టిడిపి నేతలు దాడులకు తెగబడటం చూస్తే వారి అధికార దుర్వినియోగం ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుంది.

ప్రజలకూ ప్రాణ హాని
ఇసుక మాఫియాను ఎదిరించినందుకు చిత్తూరుజిల్లా వాసులు ప్రాణాలనే కోల్పోవాల్సి వచ్చింది. టిడిపి దురహంకార హత్యాకాండకు మునగాలపాలెం రక్తసిక్తమైంది. స్వర్ణముఖీ నది నుంచి ఉచితంగా తీస్తున్న ఇసుకను చుట్టుపక్కల గ్రామాలకు తరలించి, నిల్వచేసి, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అధిక మెత్తంలో అమ్ముకుంటున్నారు. దీన్ని వ్యతిరేకించిన రైతులు, కూలీలపై ఎస్సీ ఎస్టీలతో కేసులు పెట్టించారు. తమ గ్రామాల్లో ఇసుక నిల్వలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ, మాఫియా ఆగడాలపై నిరస వ్యక్తం చేస్తూ ఎస్పీకి ఫిర్యాదు చేయడానికి పెద్దయెత్తున గ్రామస్తులు పోలీస్ స్టేషన్ కు తరలి వచ్చారు. ఏర్పేడు రూరల్ ఎస్పీ వారిని లోనికి రానీకుండా రహదారిపైనే నిలబెట్టారు. మైనింగ్, ఇసుక మాఫియాను అరికట్టమని ధర్నా చేస్తున్న ప్రజలపైకి ఉన్నట్టుండి ఒక లారీ దూసుకొచ్చింది. అమాయకులైన గ్రామీణులతోపాటు, వార్తలు సేకరించడానికి అక్కడకు వచ్చిన విలేఖరి సైతం ఆ ఘటలో దుర్మరణం పాలయ్యారు. ఇది యాక్సిడెంట్ కాదని, మాఫియాను వ్యతిరేకించినందుకు గ్రామస్థులను హత్యచేస్తామని బెదిరించడమే అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసారు. న్యాయం కోసం పోలీస్టేషన్ ముందుకు వస్తే చివరకు ప్రాణాలే పోయాయంటూ బాధితులు కన్నీరు మున్నీరయ్యారు. చట్టం కనుసన్నల్లో, ప్రభుత్వం అండదడలతో జరిగే అరాచకాలకు ఏర్పేడు ఘటన ఒక ఉదాహరణ. ఈ ఘటనపై న్యాయ విచారణ కోరినా ఇంత వరకూ అతీ గతీ లేదు. ప్రతిపక్ష నేత వైయస్ జగన్ బాధితులను పరామర్శించడానికి వచ్చినప్పుడు మాఫియా మా కుటుంబాలను వీధిపాలు చేసిందంటూ వారు కన్నీరుమున్నీరయ్యారు. 
ఏర్పేడు ఘటనపై ఇంటిలిజెన్స్ సమాచారం అందుకున్న చంద్రబాబు అందులో కారకులైన తమ నేతలను పార్టీ నించి బహిష్కరించి, అరెస్టు చేయమని ఆదేశాలిచ్చారు. విషయం బైటకు పొక్కిన తర్వాత పార్టీకి చెడ్డపేరు రాకూడదని చేసిన ఈ చర్య, బాధితలుకు కంటితుడపు మాత్రమే. ఇసుక మాఫియాతో సంబంధం ఉందని చిరంజీవుల నాయుడు, దనుంజయ నాయుడులపై కేసు నమోదైనా, అవి కొన్నాళ్లకు మట్టికొట్టుకుపోతాయి. ఈ కేసుల నుంచి వారు బైటపడటం భవిష్యత్ లో మనకళ్లతో మనమే చూస్తాం. కాని ఏర్పేడు ఘటనతో ఇంటిపెద్దలను కోల్పోయిన కుటుంబాలకు దిక్కు లేకుండా పోయింది. 

భారీగా పెరిగిన ఇసుక ధరలు
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు రాష్ట్రంలో ఇసుక క్యూబిక్ మీటర్ 40రూ.కు దొరికేది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక క్యూబిక్ మీటరు ఇసుక 550 నుంచి 700పలుకుతోంది. సగటున 600రూ. ఉంటోంది. ఇసుక వ్యాపారం ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం 4,480కోట్లు. వచ్చిన ఆదాయం 964కోట్లు. అక్రమార్కులు మింగేసింది 3,516కోట్లు. ఇది బాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని నెలల లెక్కమాత్రమే. 2016ఫిబ్రవరి 15నుంచి ఉచిత ఇసుక విధానం ప్రకటించిన నాటి నుండి తెలుగు తమ్ముళ్లు వేలకోట్లు దోచుకుంటూనే ఉన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఈ మాఫియాల నుంచి నేరుగా లోకేష్ కి కమీషన్లు అందుతాయన్న విమర్శ ఉంది. ఇంత జరుగుతున్నా చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. 

మంత్రి వర్గ ఉపసంఘం వెల్లడించిన వాస్తవాలు
ఉచిత ఇసుక విధానం వచ్చిన దగ్గర నుంచి కాలవలు, నదులు, కుంటలు ఇలా అన్ని చోట్లా ఇసుక దందా నడుస్తోందని మంత్రి వర్గ ఉపసంఘమే వెల్లడించింది. భారీ యంత్రాలతో పెద్దపెద్ద వాహనాల్లో ఇసుక తరలింపులు జరుగుతున్నాయని పేర్కొంది. ఇసుక వాహనాలు సరిహద్దులు దాటి పోతున్నా పట్టించుకునే నాథుడు ఉండటం లేదు. అధికార యంత్రాంగం ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడంలో ఘోరంగా విఫలం అయ్యిందని మంత్రి వర్గ ఉపసంఘం అంగీకరించింది. దీన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటాం అని చెప్పిన మంత్రులు ఇంతవరకూ అలాంటి విధి విధానాలనేవీ నిర్ణయించనేలేదు. అసలు రాష్ట్రంలో ఇసుక మాఫియా లేదని లోకేష్, ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటాం, ఉపేక్షించం అంటూ చంద్రబాబు రివర్స్ స్టేట్ మెంట్స్ తో కాలం వెళ్లదీస్తున్నారు. భారీ కుంభకోణాలు, అంతుపట్టని అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబు ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారు. Back to Top