రైతుల‌కు చంద్ర‌బాబు టెక్నో షాక్‌

హైద‌రాబాద్) టెక్నాలజీ మోజుతో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం రైతుల్ని ముంచేసేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తోంది. పాస్ బుక్‌, టైటిల్ డీడ్ పుస్త‌కాల ర‌ద్దు ని రైతుల పాలిట శాపంగా అంతా అభివ‌ర్ణిస్తున్నారు. జూలై 1వ తేదీ నుంచి పట్టాదారు, టైటిల్ డీడ్‌లు రద్దవుతాయని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.  ఆన్‌లైన్ ద్వారానే భూమికి సంబంధించి క్రయవిక్రయాలు, రుణాలు పొందడం తదితర పనులు జరుగుతాయని చెప్పడంపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన కార్యక్రమాన్ని రద్దు చేసేందుకు టీడీపీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని రైతులు ఆరోపిస్తున్నారు. పట్టాదారు పాస్ పుస్తకం చేతిలో ఉంటే పిల్లల చదువులకు, పెళ్లిళ్లకు దానిని ఆధారంగా ఎక్కడైనా అప్పు లభించే అవకాశం ఉండేదని, ప్రభుత్వ నిర్ణయంతో ఆ భరోసా కోల్పోతున్నామని రైతులు అంటున్నారు.
 
ఆన్‌లైన్ మోజు.
జూలై 1 నుంచి పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ రద్దు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తాతలు, తండ్రుల నాటి నుంచి వచ్చిన అనువంశిక ఆస్తులు తమ పేరుతో లేకున్నా భూమి వారి వారసుల వద్దే ఉంది. ఈ తరహా భూములు కొన్నింటికి పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇచ్చినా టైటిల్ డీడ్‌లో (ఆర్‌వోఆర్)లో నమోదు చేయలేదు. ప్రస్తుతం ఈ రెండింటిని రద్దుచేసి ఆన్‌లైన్‌లో ఉన్న వివరాల ఆధారంగా భూమి క్రయవిక్రయాలు తదితర వ్యవహారాలను చూసుకోవాలని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటివరకు పట్టాదారు పాస్ పుస్తకం చేతిలో ఉంటే నేరుగా బ్యాంకుకు వెళ్లి పంట రుణం తీసుకునే వారమని రైతులు అంటున్నారు. వీటిని రద్దుచేస్తే పంట రుణం తీసుకునే ప్రతిసారీ రెవెన్యూ కార్యాలయంలోని వీఆర్వో, ఆర్‌ఐ, డెప్యూటీ తహశీల్దార్ చుట్టూ తిరగాల్సిందేనని రైతులు అంటున్నారు. 

నిరక్ష రాస్యుల ప‌రిస్థితి
నిర‌క్ష రాస్యుల‌కు ఇది గొడ్డ‌లి పెట్టువంటి నిర్ణ‌యం. దీన్ని అడ్డు పెట్టుకొని ఆన్ లైన్ లో యాజ‌మాన్య‌పు వివ‌రాలు మార్చేస్తే ఎవ‌రికి చెప్పుకోవాలో అని ఆవేద‌న చెందుతున్నారు. పైగా బ్యాంకుల నుంచి లోన్ లు తీసుకొంటే చెప్పుకొనే దిక్కు ఉండ‌ద‌ని వాపోతున్నారు. రెవెన్యూ సెటిల్‌మెంట్ రిజిస్ట్రేషన్ (ఆర్‌ఎస్‌ఆర్), అడంగల్‌లో సర్వే నంబర్లను, రైతుల పేర్లను మార్చడానికి ఆన్‌లైన్‌లో సులువుగానే ఉందని, ఎవరైనా అసలు రైతు కాకుండా వేరే రైతుల పేర్లతో భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే పరిస్థితి ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు.
Back to Top