టీడీపీ నిండా అసహనం, అభద్రత


– బీజేపీ, వైయస్‌ఆర్‌సీపీ నాయకులు కలిసినా ఓర్వలేనితనం
– చంద్రబాబు నుంచి కార్యకర్తల దాకా అదే తీరు
– వైయస్‌ఆర్‌సీపీని బీజేపీతో కలిపి చూపెట్టి లాభపడాలని తపన 
– అసత్య ప్రచారంలో కీలక పాత్ర పచ్చ మీడియాదే 

దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయండి అన్నట్టుగా తయారైంది చంద్రబాబు సహా టీడీపీ నాయకుల పరిస్థితి. నాలుగేళ్లు అంటకాగిన బీజేపీతో వైయస్‌ఆర్‌సీపీకి బంధం కలిపి ప్రచారం చేసి లబ్ధిపొందేందుకు ఆపసోపాలు పడుతున్నారు. ఏ చిన్న సందర్భం దొరికినా అనుకూలంగా మార్చుకునేందుకు అనుకూల మీడియా సాయంతో ప్రయాసపడిపోతున్నారు. ఈ నాలుగేళ్లలో టీడీపీ అధికారంలో ఉన్నా.. బీజేపీతో కలిసున్నా వైయస్‌ఆర్‌సీపీ ఏనాడూ భయపడలేదు. చంద్రబాబు ప్రభుత్వం మీద పోరాడుతూనే ఉన్నారు. ఎక్కడ వెనకడుగు వేసిన దాఖలాలు లేనే లేవు. నిజానికి అప్పుడు కూడా వైయస్‌ జగన్‌ ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోరినా.. విజయసాయిరెడ్డి బీజేపీ నాయకులను కలిసినా.. వైయస్‌ఆర్‌సీపీ బీజేపీ ప్రతిపాదించిన రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మద్ధతుగా నిలిచినా టీడీపీ కంట్లో రక్తపు కన్నీళ్లు వచ్చాయి. ఆనాడు టీడీపీ, బీజేపీ కలిసున్నప్పుడు కానీ.. ఎన్‌డీఏ నుంచి టీడీపీ బయటకొచ్చిందని కానీ వైయస్‌ఆర్‌సీపీ తీరులో మార్పు రాలేదు. అయితే టీడీపీ నాయకులు మాత్రం బీజేపీ, వైయస్‌ఆర్‌సీపీ నాయకులు ఎదురుపడినా సహించలేకపోతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో అయిష్టంగానే పదవులు వదులుకుని బయటకొచ్చినా వారిలో త్యాగం చేశామన్న ధైర్యం కనిపించడం లేదు. రాబోయే రోజుల్లో ఏదో జరగబోతుందన్న ఒకరకమైన ఆత్మన్యూనతా భావంతో అనుక్షణం అభద్రతగా ఉంటున్నారు. చంద్రబాబు పాత కేసులన్నీ కేంద్రం బయటకు తోడి ఆయన్ను జైలుకు పంపుతుందేమోనన్న భయంతో కనిపిస్తున్నారు. వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఢిల్లీలో బీజేపీ ఎమ్మెల్యేతో కలిసి భోజనం చేయడాన్ని కూడా వారు వక్రబుద్ధితోనే చూడటమే వారి కంగారును తెలియజేస్తుంది. గతంలోనూ ఎన్‌డీఏ నుంచి బయటకొచ్చిన తర్వాత చంద్రబాబు పలు సందర్భాల్లో ప్రజల ముందు ఆవేదనాభరితంగా మాట్లాడి దొరికిపోయారు. నన్ను అరెస్టు చేస్తారేమో.. ప్రజలంతా వలయంగా ఏర్పడి నన్ను కాపాడుకోవాలి..  ఇలా ముఖ్యమంత్రి స్థాయి నుంచి దిగజారిపోయి మాట్లాడి నవ్వుల పాలయ్యాడు. అదే అసహనంతో రాబోయే ఎన్నికల్లో బీజేపీ, వైయస్‌ఆర్‌సీపీ కలిసి పోటీ చేస్తే అదొక అనైతిక పొత్తుగా ఇప్పుట్నుంచే ప్రచారం చేసి లబ్ధిపొందాలని మీడియాను వెనకేసుకుని రెచ్చిపోతున్నారు.  
Back to Top