ఓటమికి భయపడే ప్రచారానికి బాబు దూరం

– జనాలు నిలదీస్తారని వెనక్కి తగ్గిన లోకేష్‌ 
– మరొక్క రోజే ప్రచారం చేయనున్న చంద్రబాబు 
– వైయస్‌ జగన్‌ రాకతో మారిన సమీకరణాలు

టీడీసీ నాయకులకు నంద్యాల ఉప ఎన్నికలపై ఒక క్లారిటీ వచ్చినట్టుంది. రోజులు గడిచిపోతున్నా ప్రచారానికి రావడానికి వెనకడుగు వేస్తున్నారు. ఆఖరుకి పోల్‌ మేనేజ్‌మెంట్‌ నాకంటే ఎవరూ బాగా చేయలేరని జబ్బలు చరుచుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రచారం ముగియడానికి మరో వారం రోజులు కూడా లేకున్నా నంద్యాల్లో అడుగుపెట్టడానికి వెనకడుగు వేస్తున్నట్టే కనిపిస్తున్నాడు. ఇక లోకేష్‌ సంగతి చెప్పాల్సిన పనిలేదు. లోకేష్‌ మాట్లాడిన ప్రతిసారీ జనాలు నిలదీస్తుంటే సమాధానం చెప్పలేక  నీళ్లు నమలాల్సి వచ్చింది. లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెబితే ఎక్కడో చూపించమని నిలదీస్తే లోకేష్‌ దగ్గర సమాధానమే కరువైంది. అయితే చంద్రబాబు పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఇప్పటికే రెండు సార్లు నంద్యాల్లో పర్యటించిన బాబు వివాదాస్పద వ్యాఖ్యలతో పరువు పోగొట్టుకున్నాడు. ఓడిపోతామనే భయంతో ప్రజలను బెదిరించి నవ్వుల పాలయ్యాడు. నేషనల్‌ మీడియాలో సైతం బాబు చేసిన వ్యాఖ్యలు ప్రసారమై ఆయన పరువును రోడ్డున పడేశాయి. ఆ దెబ్బకు నంద్యాల ముఖం చాటేసిన బాబు ఇప్పటివరకు తన పర్యటన ఖరారు చేసుకోలేకపోయారు. నిన్న మొన్నటి చివరి మూడు రోజులు ప్రచారం చేస్తారని వార్తలొచ్చినా ఇప్పుడు ఒకరోజుకే పరిమితం కానున్నారనే సమాచారం. 16వ తేదీన బాలకృష్ణను పంపి రోడ్‌ షోలు చేయించాలని ప్లాన్‌ చేశారు. 

ఓటమి నెపం నెట్టేందుకే..
నిరంతరం పబ్లిసిటీ కోసం తపించే చంద్రబాబు గెలిస్తే వోన్‌ చేసుకోవడం.. ఓడినప్పుడు ఎవరొకర్ని బాధ్యులను చేయడం అలావాటే. వైయస్‌ జగన్‌ ప్రచార బరిలోకి దిగిన తర్వాత నంద్యాల ఓటర్లలో వచ్చిన మార్పును చూసి చంద్రబాబు వెనక్కి తగ్గారనే విషయం సుస్పష్టంగా తెలుస్తుంది. ఎలా గెలవాలనే విషయం పక్కనపెట్టి ఓడిపోతే ఎవర్ని బాధ్యులను చేయాలి అనేదానిపై చంద్రబాబు దృష్టిసారించారని అర్థమవుతోంది. అందుకే తండ్రీకొడుకులిద్దరూ ప్రచారానికి దూరంగా ఉంటూ అమరావతి నుంచి ఆర్డర్లు వేస్తున్నారని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. 

మంత్రులే బలిపశువులు..
నంద్యాల ఎన్నికల్లో ఓడితే మంత్రులు బలిపశువులు అవుతారని టీడీపీ సర్కిల్లో గట్టిగా వినిపిస్తోంది. పార్టీ ఫిరాయించి రాయలసీమలో మంత్రి పదవులు పొందిన అఖిల ప్రియ, అమర్నాథ్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి లు నంద్యాల ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. ఫలితాల్లో ఏదైనా తేడావస్తే వీరే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే అఖిల ప్రియ రాజీనామాకు సిద్ధమని కూడా ప్రకటించారు. ఇక మరో ఇద్దరు మంత్రులు ఆది, అమర్‌లకు కూడా ఓటమి భయం పట్టుకుంది. చంద్రబాబు తమను రాజీనామా చేయమంటారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిసారీ ఎన్నికలకు ముందు క్యాబినెట్‌ను విస్తరణ చేయడం బాబుకి అలవాటే. ఈ నేపథ్యంలో ఓటమికి నైతిక బాధ్యతగా రాజీనామా చేస్తున్నామని వారితో ప్రకటింపజేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నంద్యాల్లో పరిస్థితులు టీడీపీకి వ్యతిరేకంగా మారుతున్నాయి. టీడీపీ నుంచి ఒక్కొక్కరిగా జారిపోతున్నారనే అనుమానాలు టీడీపీ నాయకుల నుంచే వ్యక్తమవుతున్నాయి. దీనికి బలం చేకూర్చే విధంగా టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అసహనం వ్యక్తం చేస్తూ మాట్లాడి.. అదే సమయంలో వైయస్‌ జగన్‌ను ఆకాశానికెత్తేశారు. ఒకవైపు టీజీని అడ్డంపెట్టుకుని ఆర్యవైశ్యుల ఓట్లకు గాలం వేద్దామని చూసిన చంద్రబాబుకు టీజీ వ్యాఖ్యలు ఇబ్బందికరంగా మారాయి. ఇదే నేపథ్యంలో కృష్ణ–మహేష్‌ అభిమానులు కూడా వైయస్‌ఆర్‌సీపీకే మద్ధతు ఇస్తున్నామని ప్రకటించారు. దీంతో టీడీపీ పరిస్థితి మింగలేక కక్కలేక అన్నట్టుగా తయారైంది. ఎలాగూ ఓడిపోతామని గ్రహించి చంద్రబాబు ప్రచారానికి దూరంగా ఉంటున్నారని టీడీపీ నాయకులే చెప్పుకుంటున్నారు. ముఖ్యమంత్రే ప్రచారం చేసినా గెలవలేకపోయారనే విమర్శలు వస్తాయని గ్రహించి ప్రచారం చేయడం లేదని ప్రచారం జరుగుతోంది. 
Back to Top