పచ్చనేతల గుప్పిట్లో ఆలయ భూములు

-ఆలయ భూముల్లో ఎల్లో మాఫియా అక్రమ వ్యాపారాలు
-ఆక్రమణలు, అమ్ముకోవడాలు
-దేవుడి భూములకే శఠగోపం
-అన్ని జిల్లాల్లోనూ ఆలయ భూముల కబ్జాలు
-వెనకుండి చక్రం తిప్పుతున్న టిడిపి నేతలు

అసైన్డ్ భూములు, పోరంబోకు భూములు, బినామీలకు అప్పనంగా కట్టబెడుతున్నవే కాక దేవాలయ భూములను కూడా భోంచేసేస్తున్నారు టిడిపి నాయకులు. భగవంతుని కైంకర్యాలకు భక్తులు, నాటి జమిందారులు ఇచ్చిన మాన్యాలను మాయం చేసేస్తున్నారు. కబ్జాలకు గురై, ఆక్రమణల్లో చిక్కుకుని, అన్యాక్రాంతమై పోయిన ఆలయ భూములకు లెక్కే లేదు. ఇదంతా టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో జరుగిన అధర్మపూరిత అవినీతి. 

అన్ని జిల్లాల్లోనూ ఆలయ భూములు హాంఫట్
వేలాది ఎకరాల విలువైన ఆలయ భూములు కబ్జాకోరుల కోరల్లో చిక్కాయి. ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి నగరాల్లో అత్యంత ఖరీదైన ఆలయ మాన్యాలు అన్యాక్రాంతం అయ్యాయి. ఈ జిల్లాలో ఆలయాలు, మఠాలు, ధార్మిక సత్రాలు అన్నింటికీ కలిపి 19,720ఎకరాల మాన్యం భూమి ఉంది. అధికారిక లెక్కల ప్రకారమే ఇందులో 4000కు పైగా ఎకరాలు ఆక్రమణకు గురై ఉంది. ఈ ఆక్రమణలకు సంబంధించి వందలకొద్దీ కేసులు హైకోర్టు, జిల్లాకోర్టుల పరిధిలో మూలుగుతున్నాయి. పెద్దలు ఈ కేసులను అడ్డం పెట్టుకునే ఏళ్లతరబడి ఆలయ భూములపై పెత్తనం చెలాయిస్తున్నారు.
ఇక ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆలయ భూములనైతే ఏకంగా మాయమే చేసేశారు. మార్కాపురంలోని చెన్నకేశవ స్వామి, లక్ష్మీనరసింహ స్వామి ఆలయాలకు ప్రజలు పెద్ద ఎత్తున భూములు మాన్యాలుగా అందించారు. వీటిలో చాలా భూములు ప్రస్తుతం వేరే వ్యక్తుల పేర రిజిస్టర్ అయిపోయాయి. కొందరు అక్రమార్కులు దేవుడి భూమిని కబ్జాచేసి వ్యాపారాలు చేసుకుంటుండగా, మరికొందరు ఏకంగా అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. ఇలా ప్రకాశం జిల్లాలో చాలా చోట్ల దేవుడి ఇనాం భూములు రెక్కలొచ్చి ఎగిరిపోయాయి. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానికంగా ఉన్న నేతల అనుచరులే ఈ వ్యవహారాలన్నీ నడిపిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. 

కోస్తాలోనూ కోవెల భూములకు రెక్కలు
తూర్పుగోదావరి జిల్లా కాకినాడుకు చెందిన కాకర్లపూడి నీలయమ్మ కాశీయత్రికుల కోసం, విద్యార్థుల సౌకర్యార్థం భారీ భూ విరాళం ఇచ్చారు. నీలయ్యమ్మ సత్రం బాటసారుల అన్నదానానికి నిర్దేశించింది. యతి సత్రంలో విద్యార్థులకు, కాశీ యాత్రికులకు వసతి సౌకర్యం కల్పించేవారు. విద్యార్థి నిలయం పేరుతో ఉపకార వేతనాలు ఇవ్వడానికి కూడా నిర్దేశించారు. మొత్తం 4 దఫాలుగా ఆమె విల్లు రాశారు. మెత్తం 844.77ఎకరాల భూమి విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఉంది. వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని పైన పేర్కొన్న ధార్మిక, దాన కార్యక్రమాలకు వినియోగించాలని విల్లు రాశారు. ఈ భూములకు 1971వరకూ కలెక్టర్ కస్టోడియన్ గా వ్యవహరించారు. ఆ తర్వాత ఎండోమెంట్ చట్టం రావడంతో భూములన్నీ దేవాదాయ, ధర్మాదాయ శాఖకు బదిలీ అయ్యాయి. అప్పుడు జరిగిన ఒక వివాదంలో కోర్టు తీర్పు ఇచ్చింది. దాని ప్రకారం ఇవి దేవాదాయ శాఖకు చెందినవి కనుక వీటిని రిజిస్ట్రేషన్ చేయకూడదని పేర్కొన్నారు.  గత కొన్నేళ్లుగా ఈ భూములను సాగు చేసుకుంటున్న రైతులతో, భూ అనుభవదారుల పేరుతో పట్టాలు ఇప్పించడానికి తెరవెనుక కుట్ర మెదలు పెట్టారు టిడిపి నేతలు. ఆ రైతులకు అప్పటి జాయింట్ కలెక్టరు పట్టాలు కూడా జారీ చేసారు. ఈ విషయాన్ని తెలుసుకున్న  నీలాయమ్మ చౌల్ట్రీ వారు హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు జెసి ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేసింది. ఇంతకూ రైతుల పేర పట్టాలు ఇప్పించిన నేతలు అప్పటికే రైతులకు అంతో ఇంతో ముట్టచెప్పి వారినుంచి కారుచౌకగా భూములను చేజిక్కించుకునే ప్లాన్ వేసారు. హైకోర్టు జోక్యం వల్ల దానికి బ్రేక్ పడింది.

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సదావర్తి వ్యవహారం ప్రభుత్వ పెద్ద గద్దల ప్లానులకు పక్కా సాక్షీభూతంగా నిలిచింది. దేవాదాయ శాఖకు చెందిన సదావర్తి భూములను కారుచౌకగా సొంతపార్టీ నేతలకు కట్టబెట్టడంపై వైయస్సార్ సిపి ఎమ్మెల్యే ఆళ్లరామకృష్ణా రెడ్డి హైకోర్టులో పిటీషన్ వేసారు. దేవాదాయ శాఖ కు చెందిన 83ఎకరాల అతి విలువైన భూమిని గుట్టు చప్పుడు కాకుండా అస్మదీయులకు కట్టబెట్టేసింది చంద్రబాబు ప్రభుత్వం. దీనిపై పోరాడుతున్న ఆళ్లరామకృష్ణ రెడ్డి హైకోర్టు సూచించిన ధరకు తాను భూములను తీసుకోడానికి అంగీకరించి, ఆమేరకు సొమ్మును ప్రభుత్వానికి చెల్లించారు. ఆ సొమ్ము అలాగే ఉంచి వేలం కూడా నిర్వహించమని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. తమ వ్యవహారం బైటపడటంతో చంద్రబాబుకు గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టైలంది. వేలాన్ని ఆపాలని కోరుతూ టిడిపి ప్రభుత్వం సుప్రీంని ఆశ్రయించింది. కాని వేలం జరగాల్సిందేనని, ఎక్కువ ధరకు భూములు పోతే ప్రభుత్వానికే లాభం కదా అని సుప్రీం చురక అంటించడంతో బాబు సర్కార్ విలవిల లాడుతోంది. సర్కారు దోపిడీకి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది సదావర్తి భూముల వ్యవహారం.

భద్రాచల సీతారాముల ఆలయానికి సంబంధించిన భూములపైనా బడా ‘బాబు’ల కన్ను పడిందంటున్నారు స్థానికులు. భద్రాచల ఆలయానికి మాన్యంగా ఉన్నభూముల్లో ఎక్కువశాతం ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాయి. ఆ భూములను కొందరు రైతులు కౌలు చేసుకుని, కౌలు సొమ్మును ఆలయానికి జమ కడుతుంటారు. అయితే కొందరు టిడిపి నేతల ప్రోద్బంలతో దేవాలయ భూముల్లో చేపల చెరువులు తవ్వారు. ఆలయ భూముల్లో వ్యవసాయం తప్ప మరే ఇతర వ్యాపారాలూ చేయకూడదని చట్టం ఉంది. దాన్ని తుంగలో తొక్కి వివిధ వ్యాపారాలు చేయడమే కాదు, ఇసుక కుంభకోణంలోనూ ఆలయ భూములను ఉపయోగిస్తున్నారు. భద్రాచలం పరిధిలోని దేవాలయ భూముల్లో అక్రమంగా తరలించే ఇసుకను నిల్వ చేయడం, ఆ భూముల్లోని ఇసుకను కొల్లగొట్టి అమ్ముకోవడం వంటివి చేస్తున్నారు. 

దేవాదాయ శాఖామంత్రి జిల్లాలోనూ భారీగా కబ్జాలు
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖామాత్యులు పైడికొండల మాణిక్యాలరావు ప్రాతినిధ్యం వహిస్తున్న పశ్చిమగోదావరి జిల్లాలోనే దేవాలయ భూములకు రక్షణ లేకుండా పోయింది. ఈ జిల్లాలో సుమారు 216ఎకరాల ఆలయభూములు కబ్జా కోరల్లో ఉన్నట్టు రికార్డులు తెలియజేస్తున్నాయి. ఆక్రమించిన భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటాం అని అధికారులు చెబుతున్నా, అలా జరిగిన దాఖలాలు ఇంతవరకూ లేవు. కోర్టుల్లో గెలిచిన ఆక్రమిత భూములను తిరగి స్వాధీనం కూడా చేసుకోకుండా ఈ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రజలు, ప్రతిపక్షాలను శాంత పరిచేందుకు తప్ప చిత్తశుద్ధితో ఆలయ భూములను కాపాడాలనే సంకల్పం అటు దేవాదాయ శాఖకు కాని, ఇటు ప్రభుత్వానికి లేదని స్పష్టం అవుతోంది. స్వయంగా దేవాదాయ శాఖామంత్రి కొన్నాళ్ల కిందట చేసిన ప్రకటనలో ఎపి లో మొత్తం 20వేల ఎకరాల దేవాలయ భూములు కబ్జాకు గురయ్యాయని నిస్సిగ్గుగా ప్రకటించారు. కబ్జాదారుల వివరాలను వెబ్ సైట్ లో పెడతామని ప్రగల్బాలు పలికారు. అలాంటివేవి సవ్యంగా ఆచరణకునోచుకోలేదు. ఆలయ భూములను బకాసురులు బ్రహ్మాండంగా భోంచేస్తున్నారు. ఇదీ టిడిపి సర్కార్ ఆలయ భూములపై వ్యవహరిస్తున్న తీరు. 

తాజా ఫోటోలు

Back to Top