నంద్యాలపై బాబుకు సన్నగిల్లిన ఆశలు

– బాబుపై నమ్మకం కోల్పోతున్న తెలుగు తమ్ముళ్లు
– ఉప ఎన్నికలపై అమరావతిలో అంతర్మథనం 
– గెలవలేమనే బెదిరింపులు, ప్రజలపై అసహనం 

నంద్యాల ఎన్నికలపై చంద్రబాబుకు తత్వం బోధపడినట్టుంది.. మొదట్లో 50 వేల మెజారిటీతో గెలిచేస్తామని చంకలు గుద్దుకున్న చంద్రబాబు రోజురోజుకీ మెత్తబడుతూ వస్తున్నాడు. నంద్యాల ఎన్నికలపై అమరావతిలో తీవ్రమైన చర్చోపచర్చలు సాగుతున్నాయి. కనీసం రెండు వేల మెజారిటీతోనైనా బయట పడగలమా అనే దీన స్థితిలో తెలుగు తమ్ముళ్లు లెక్కలు వేసుకుంటున్నారు. దానికితోడు టీడీపీ గెజిట్‌ పత్రికలో నంద్యాల ఎన్నికలపై ప్రత్యేక కథనమే ప్రచురించారు. కథనం మొత్తం పరిశీలిస్తే టీడీపీ డిఫెన్సులో ఉందనే విషయం అర్థమవుతూనే ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేలను భారీగా మోహరించినా వారు నామ్‌కే వాస్తే ప్రచారం చేస్తున్నారనే మాట వినిపిస్తుంది. వైయస్‌ఆర్‌సీపీ నాయకులు చేసినంత ఉత్సాహంగా టీడీపీ నాయకులు ప్రజలతో మాట్లాడేందుకు చొరవ చూపడం లేదని ఇప్పటికే చంద్రబాబుపై అసహనం వ్యక్తం చేసినట్టుగా ఆ పత్రిక కథనం సారాంశం. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుడు నిర్వహించిన బహిరంగ సభకు అపూర్వ స్పందన రావడంతో పాటు వైయస్‌ జగన్‌ తానే స్వయంగా ఈనెల 9 నుంచి 21వ తేదీ వరకు నంద్యాల మొత్తం పర్యటిస్తానని చెప్పిన విషయం తెలిసిందే. పరిస్థితులు ఇలాగే కొనసాగితే సైకిల్‌ను జనాలు తుక్కుతుక్కు చేస్తారని అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే ఎన్నికల లోపు ఇంకోసారి చంద్రబాబు నంద్యాల్లో పర్యటించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వార్తలొస్తున్నాయి. 

ఓటమి భయంతో జనం మీద అసహనం వ్యక్తం చేస్తూ నేషనల్‌ మీడియాలోనే ప్రధాన వార్తల్లో నిలిచారు. ఇప్పటికే రెండు సార్లు నంద్యాల పర్యటనకొచ్చిన చంద్రబాబు నోరు జారి మాట్లాడి అందరి ముందూ అభాసు పాలయ్యారు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి కూడా తన స్థాయిని దిగజార్చుకుని చేసిన వ్యాఖ్యలు బాబు సహా టీడీపీనే అపహాస్యం చేశాయి. మొదటిసారి పర్యటనకొచ్చిన బాబు గోస్పాడులో ప్రజలతో మాట్లాడుతూ నేను ఓటుకు 5 వేలు ఇవ్వగలను.. నేను వేసిన రోడ్లమీద నడవొద్దు.. నేనిచ్చిన వీధిదీపాల కింద చూడొద్దు.. అని మాట్లాడి నేషనల్‌ మీడియాలో వార్తయ్యారు. రెండోసారీ అదే పరిస్థితి అభివృద్ధి గురించి రోడ్‌షోలో ముఖ్యమంత్రిని ప్రశ్నించిన వ్యక్తిని పోలీసులను పంపించి అరెస్టు చేస్తానని చెప్పి తన స్థాయిని తగ్గించుకుని మాట్లాడి పలచనయ్యారు. అయితే ఈ విషయాలను జాతి మీడియా లైట్‌ తీసుకున్నప్పటికీ జాతీయ మీడియా మాత్రం బాగా హైలెట్‌ చేసింది. టెక్నాలజీ గురూని అని ప్రచారం చేసుకుని విర్రవీగే చంద్రబాబు చీకటి కోణాన్ని నేషనల్‌ మీడియా దేశానికి పరిచయం చేసింది. 
Back to Top