భారీ దోపిడీ!

– పెరిగిపోతున్న సచివాలయ నిర్మాణ వ్యయం
– ఇప్పటికే రూ. 221 కోట్ల చెల్లింపులు 
–అదనంగా మరో రూ.500 కోట్లు
తాత్కాలిక సచివాలయానికి రూ.721 కోట్లా..?
– ఇరుకు గదులు, అరకొర సదుపాయాలతో నిర్మాణం
–ప్రజా ధనాన్ని దోచుకుంటున్న పచ్చనేతలు 

చంద్రబాబు మాటలింటాంటే ‘అంతన్నాడింతన్నాడే గంగరాజు’అనే పాట గుర్తుకొస్తాంది. ఆయన మాటలు చూస్తే కోటలు దాటుతున్నాయ్‌.. చేతలేమో గడపలు కూడా దాటడంలా. నెలకో కొత్త పథకమో.. కార్యక్రమమో.. పనో మొదలు పెట్టుడు మధ్యలోనే వదిలేసుడు. పరిస్థితి ఎంతవరకొచ్చిందని ఎవరైనా ప్రశ్నిస్తే ఇదిగే రేపే ప్రారంభోత్సవం అని కేంద్రమంత్రిని పిలుచుడు.. పేపర్ల నిండ యాడ్స్‌ ఇచ్చుడు. అయిపోయిందని చేతులు దులుపుకొనుడు. గింతే మూడేళ్ల సంది నడుస్తుంది. 

ఏంటి ఇదంతా అని ఆశ్చర్యపోతున్నారా... ఏం లేదండీ... మన హైదరాబాద్‌ నుంచి మహబూబ్‌నగర్‌ నుంచి సచివాలయం పనుల కోసం వచ్చిన ఓ బేల్దార్‌ మేస్త్రీ రామయ్యగౌడ్‌ని ఆంధ్రాకు చెందిన హైదరాబాద్‌లో ఉండే వెంకటరావు అనే స్నేహితుడు ఫోన్‌లో పలకరించాడు. వీరిద్దరూ బేల్దార్‌ మేస్త్రీలే. అయితే ఆంధ్రాకు చెందిన వెంకట్రావు హైదరాబాద్‌లో పనులు చేస్తున్నాడు. తెలంగాణకు చెందిన రామయ్య గౌడ్‌ అమరావతి సచివాలయం పనుల్లో ఉన్నాడు. రామయ్యగౌడ్‌ను వెంకటరావు ఫోన్‌లో ఆంధ్రా ఎలా ఉందని అడిగినప్పుడు జరిగిన సంభాషణ ఇది. రామయ్య గౌడ్‌ చెప్పింది అక్షరాలా నిజమే మరి. ఆంధ్ర రాష్ట్రంలో గత రెండున్నరేళ్లుగా జరుగుతున్నది అదే. పనుల్లేవ్‌.. అభివృద్ధి లేదు. కేవలం పబ్లిసిటీ మాత్రమే. డబ్బులు కోట్లకు కోట్లు తెచ్చి హడావుడికి తగలెయ్యడం తప్ప ఒరగబెట్టిందేమీ లేదు. వెలగపూడి నిర్మాణాన్ని పరిశీలిస్తే అసలు విషయం అర్థంకాక మానదు. 

దోపిడీ రాజ్యం
అమరావతి: కాదేది దోపిడీకి అనర్హం అన్నట్లుగా ఉంది తెలుగు దేశం పార్టీ నేతల తీరు. అధికారంలోకి వచ్చింది మొదలు దోచుకోవడం, దాచుకోవడంపైనే టీడీపీ నేతలు దృష్టి సారించారు. ఏ పని చేసినా అధినేతకు, ఆయన తనయుడికి ముడుపులు అందాల్సిందే. ఇలా అతితక్కువ సమయంలో వేల కోట్ల ప్రజాధనాన్ని ఏపీ సీఎం చంద్రబాబు కొల్లగొట్టారనడానికి ఎన్నో సజీవ సాక్ష్యాలు. కొత్తగా తాత్కాలిక సచివాలయం పేరుతో అధికార పార్టీ నేతలు భారీ దోపిడీకి తెర లేపారు. అంతర్జాతీయ స్థాయిలో సచివాలయం నిర్మిస్తానంటూ చంద్రబాబు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. సచివాలయ నిర్మాణాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్ర నారాయణ పర్యవేక్షణలోనే జరుగుతోంది. ఇక్కడ ఏ ఇటుక కదపాలన్నా.. ఇటుక చేరాలన్నా వారిద్దరి కనుసన్నల్లోనే జరగాలి. సచివాలయం పనులను పల్లోంజీ, ఎల్‌అండ్‌టీ కంపెనీలకు అప్పగించారు. ఈ ఏడాది జూన్‌లోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలి. కాగా రూ. 181 కోట్లతో పనులు పూర్తి చేయాల్సి ఉంది. కానీ పనులు వేగవంతం కావాలంటే మరో రూ.40 కోట్లు అదనపు నిధులు కావాలని నిర్ణయించారు. అంటే నిర్మాణ వ్యయం రూ. 221 కోట్లకు చేరింది. గడువును ప్రతినెలా పొడిగించుకుంటూ వచ్చారు. సెప్టెంబర్‌ నాటికి తూతూమంత్రంగా సచివాలయాన్ని నిర్మించారు. ఇప్పటికీ కనీసం ముఖ్యమంత్రి కార్యాలయం, అసెంబ్లీ, శాసనమండలి నిర్మాణాలను పూర్తి చేయలేదు. 

మరో రూ.500 కోట్ల కేంద్రప్రభుత్వ నిధులు 
ఇదిలా ఉండగా సచివాలయ నిర్మాణం పూర్తి చేసేందుకు మరో రూ.370 కోట్లు కావాలని సీఆర్‌డీఏ ఇటీవల ఆర్థిక శాఖకు ఫైల్‌ పంపింది. కానీ మంత్రి యనమల రామకృష్ణుడు అదనపు నిధులు ఇవ్వలేమని రాజధానిలో భవన నిర్మాణాల కోసం కేంద్రం ఇచ్చిన రూ.500 కోట్లు వాడుకోవాలని సలహా ఇచ్చారు. అంటే కేవలం సచివాలయానికే ఏకంగా రూ. 721 కోట్లు ఖర్చు చేస్తున్నారన్నమాట. ఇంత చేసినా అవేమన్నా సొంపుగా ఉన్నాయంటే అదీ లేదు. సచివాలయంలోని తన కార్యాలయం ఏమాత్రం బాగా లేదుని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు. పైగా మంత్రులు, ఉద్యోగులు ఇరుకిరుకు గదుల్లో సర్దుకోలేక నానా అవస్థలు పడుతున్నామని చెప్పడం విశేషం. 

నిర్మాణం అంతంత మాత్రమే..
ఆరు లక్షల చదరపు అడుగుల్లో సచివాలయ నిర్మాణం చేపట్టారు. అంటే ఒక్కో చదరపు అడుగుకు ఏకంగా 10,500 ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. అత్యంత విలాసవంతమైన నిర్మాణాలకు కూడా ఇత మొత్తంలో ఖర్చు చేయరని నిపుణులు పేర్కొంటున్నారు. సదుపాయాలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. క్యాబినెట్‌ ర్యాంకు గల అధికారులకు కూడా ఐదో భవనంలో కేవలం రెండు గదులే కేటాయించారు. వారికి ప్రత్యేకంగా యాంటీ రూమ్‌లు, పేషీలు ఇవ్వలేదు. పైగా వారు కామన్‌ బాత్‌రూమ్స్‌నే వాడాల్సి వస్తుంది. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులకు కూడా అగ్గిపెట్టెల్టాంటి గదులనే కేటాయించారు. ఆ గదుల్లోని గోడలకు టీవీలను అమర్చడానికి కూడా వీలు పడటం లేదు. గోడలను కలపతో నిర్మించడంతో టీవీలను అమర్చితే కిందపడిపోతున్నాయి. సచివాలయంలోని భోజన శాలల్లో చేతులు కడుక్కునేందకు కనీసం వాష్‌బేసిన్లు ఏర్పాటు చేయలేదు. చేతులు కడుక్కునేందుకు కూడా బాత్‌రూమ్స్‌కి వెళ్లాల్సి వస్తుందంటే ఎంత అసౌకర్యంగా ఉందో తెలుస్తుంది. ఇలా చంద్రబాబు విచ్చలవిడిగా ప్రజాధనాన్ని దోచుకోవడాన్ని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. దోపిడీకి పాల్పడిన టీడీపీ నేతలకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.
 
Back to Top