రైతన్న మరణాలపై అవహేళన

– అన్నదాత మరణాలపై సర్కారు ఎగతాళి 
– అసెంబ్లీ వేదికగా ఆత్మహత్యలపై వక్రభాష్యాలు
– మత్తుమందులకు బానిసలై చనిపోతున్నారని ప్రచారం 
– పరిహారం ఎగ్గొట్టేందుకు అన్నదాత మరణాలపై విష ప్రచారం
– అరకొర రుణమాఫీతో రైతులను మోసగించిన బాబు సర్కారు 

అన్నదాతలు అకాల మరణంతో పల్లెలు కన్నీరు పెడుతుంటే ఆ చావుల్లో కూడా తప్పులు వెతుకుతున్నారు తెలుగుదేశం పెద్దలు. కరువుతో అప్పులై పోయి తీర్చే మార్గం కానరాక జీవితాలనే పణంగా పెడుతుందే ఆ చావుల్లో ప్రభుత్వం కారణాలు వెతకడం సిగ్గు చేటు. చట్టపరంగా బాధిత కుటుంబాలకు దక్కాల్సిన పరిహారం ఎగ్గొట్టేందుకు చంద్రబాబు చేస్తున్న కుటిల యత్నాలు రైతన్నను మరింత కుంగదీస్తున్నాయి. కష్టమొస్తే అండగా ఉంటానని నమ్మించి ఒటేయించుకున్న వ్యక్తి ఇప్పుడు కాలయముడిలా మారిపోయాడు. కుటుంబ పెద్ద చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబానికి సీఎం అనేవాడు వెన్నుదన్నుగా నిలవాల్సింది పోయి వారిని విచారణ పేరుతో వేధించడం దురదృష్టకరం.. 

సిగ్గు విడిచి అసెంబ్లీలో అసత్య ప్రచారం
నవ్యాంధ్రలో అన్నదాతల ఆత్మహత్యలు సర్కారుకు సిగ్గుచేటు కాగా పరిహారం ఎగ్గొట్టేందుకు శాసనసభ వేదికపై సిగ్గు విడిచి మరీ వక్రభాష్యాలు చెప్పడం ప్రభుత్వ రైతు వ్యతిరేకతకు నిదర్శనం. కుటుంబ పెద్దను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతు కుటుంబాలను మానవత్వంతో ఆదుకోవాల్సిందిపోయి మరణాలను చులకన చేయడం దారుణం. కుటుంబాలను ఆదుకోవడం, ఆత్మహత్యలు జరక్కుండా గట్టి చర్యలు చేపట్టడం ప్రభుత్వ కనీస బాధ్యత. చంద్రబాబు సర్కారు తన బాధ్యతను పూర్తిగా విస్మరించింది. పైగా బలవన్మరణాలను అపహాస్యం చేస్తోంది. ఇది ముమ్మాటికీ అమానుష చర్య. ఏ దినపత్రికను తిరగేసినా, ఏ టీవీ చానల్‌ చూసినా రైతు ఆత్మహత్యలపై వార్త లేని రోజు లేదు. అలాంటిది ఆత్మహత్యలను వీలైనంత మేరకు తగ్గించాల్సిందిపోయి  తన కసాయి తనాన్ని బయటపెట్టుకుంటోంది సర్కారు. రైతుల ఆత్మహత్యలపై అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ’మత్తుపదార్థాల దుర్వినియోగం’ వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెబుతూ రైతు కుటుంబాలను క్షోభకు గురిచేశారు. ఎక్స్‌గ్రేషియా ఇవ్వకపోతే ఇవ్వకపోయారు, చనిపోయినవారిపై వ్యసన పరులన్న ముద్ర వేయడం ఏమిటన్న ఆవేదన కుబుంబీకులనే కాదు మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరినీ కలచివేస్తుంది. సర్కార్ గణాంకాల ప్రకారం 2015లో 516 మంది రైతులు చనిపోగా అందులో వంద మాత్రమే సాగు సంబంధమట. రుణ బాధల వలన 200 మంది తనువు చాలిస్తే, 216 మంది కుటుంబ కలహాలు, అనారోగ్యం, మత్తు పదార్ధాల వాడకం వలన తనువు చాలించారట. ఇది కూడా నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) లెక్కట. ఆత్మహత్యలను గుర్తించేందుకు రెవెన్యూ, వ్యవసాయం, పోలీస్‌ అధికారులతో ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీలు మాత్రం చాలా ఉదారంగా శోధించి పరిశోధించి 137 ఆత్మహత్యలను నిజమైనవిగా తేల్చాయట. మీడియా రిపోర్ట్స్ , రైతు సంఘాల నివేదికల ప్రకారమైతే టీడీపీ సర్కారు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 916 మంది చనిపోయారు. ప్రభుత్వం 160 మందికి పరిహారం చెల్లించి చేతులు దులుపుకుంది. అందులోనూ 103 మందికి లక్షన్నర చొప్పున, తక్కిన వారికి ఐదు లక్షల వంతున ఇచ్చింది. శవాల మీద చిల్లరపైసలు ఏరుకోవడమంటే ఇదే. 

ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే..
రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని చెప్పక తప్పదు. బోరుబావుల ఫెయిల్యూర్‌ అన్నారు. వాల్టా చట్టం అమలు చేయాల్సింది సర్కారే. అత్యధిక వ్యయంతో వాణిజ్యపంటల సాగుకు పురిగొల్పుతున్నదీ పాలకులే. పైపెచ్చు బహుళజాతి విత్తన, క్రిమిసంహారక మందుల కంపెనీలను సాదరంగా ఆహ్వానిస్తున్నది ఏలికలే. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాల్సిందీ వారే. మౌఖిక కౌలు అయినా, కౌలు రైతులు బ్యాంకు రుణాలకు దూరం కావడానికైనా సర్కారే కారణం. అధిక వడ్డీలపై ప్రైవేటు రుణాలను ఆశ్రయిస్తున్నదీ ప్రభుత్వ నిర్వాకం వల్లనే. సంస్థాగత పరపతి సౌకర్యం లేకుండా చేస్తున్నది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే. కరువు, తుపాన్లు, ప్రతికూల వాతావరణాలకు నేరుగా సర్కారు కారణం కాకున్నా నివారణా, ఉపశమన చర్యల్లో వైఫల్యానికి కచ్చితంగా ప్రభుత్వాన్ని తప్పుబట్టాల్సిందే. ఇదే అసెంబ్లీ సాక్షిగా హుద్‌హుద్‌ మొదలుకొని నేటి కరువు వరకు ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లింపు ఎలా అఘోరించిందో మంత్రి సమాధానమే ఉదాహరణ. రూ.3,600 కోట్లకుగాను ఇంకా రూ. రెండు వేల కోట్లు పెండింగ్‌. ఇదీ విపత్తుల బారిన పడ్డ రైతులను ఆదుకునే పద్ధతి. 

వడ్డీలకు కూడా చాలని రుణమాఫీ 
రుణమాఫీ, వడ్డీ మాఫీ పథకాలతో రైతులను రెండు చేతులా ఆదుకుంటున్నామన్న సర్కారు సమర్ధన డోల్లేనని అసెంబ్లీలోనే తేలిపోయింది. రూ.87 వేల కోట్ల పంట రుణాల్లో మాఫీ చేసింది రూ.11 వేల కోట్లే. మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి జరిగిన మాఫీయే పక్కా సాక్ష్యం. మూడేళ్ల కింద రూ.50 వేల అప్పు ఉండగా, రెండు కిస్తీల్లో ఇచ్చిన సొమ్ము పోను ఇంకా రూ.51 వేల అప్పు తేలింది. ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రతిపక్షం ఆధారాలతో నిరూపించింది కూడా. వడ్డీలేని రుణాలు, పావలా వడ్డీ పథకాలనైతే చెప్పనే అక్కర్లేదు. రెండేళ్లలో సుమారు రూ.3,400 కోట్లు కావాల్సి ఉండగా బడ్జెట్‌లో రూ.450 కోట్లు కేటాయించి రూ.154 కోట్లు సెటిల్‌ చేశారు. వచ్చే ఏడాది రూ.1,800 కావాల్సి ఉండగా రూ.177 కోట్లు బడ్జెట్‌లో ప్రతిపాదించారు. వడ్డీ పథకాలపై సర్కారు చిత్తశుద్ధిని శంకించడానికి ఇంతకంటే ఉదాహరణలేం కావాలి? పిల్లల్ని చదివించుకోడానికి, పిల్లల వివాహాలకు, హాస్పిటల్‌ ట్రీట్‌మెంట్‌కు రైతులు ఆడంబరాలకుపోయి దుబారా చేస్తున్నారని భాష్యం చెప్పారు మంత్రి వర్యులు. గతంలోనూ రైతులు తిన్నది అరక్క ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఒక పెద్ద మనిషి సూత్రీకరించగా, పరిహారం కోసం చస్తున్నారని ఇంకో ఆయన గేలి చేశారు. రైతులను తూలనాడిన నాయకులేమయ్యారో తెలుగు దేశం నేతలు తెలుసుకోవడం మంచిది. రైతులను చిన్నచూపు చూసిన ఆనాటి ప్రభుత్వాలకు పట్టిన గతే ఈ ప్రభుత్వానికీ పడుతుంది. 
Back to Top