కాకినాడలోనూ ఇళ్ల దగా

– ఇళ్ల కేటాయింపుల పేరుతో వసూళ్లు
– నంద్యాల తరహా ఎన్నికల రాజకీయం
– లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు
– అసలు లబ్ధిదారులకు తీవ్ర అన్యాయం
– కేంద్ర ప్రభుత్వ పథకాన్ని టీడీపీదిగా ప్రచారం 
– మూడేళ్లలో ఒక్క ఇళ్లూ కట్టని చంద్రబాబు ప్రభుత్వం 

నంద్యాల ఎన్నికల్లో  అనుసరించిన వ్యూహాన్నే కాకినాడ ఎన్నికల్లో కూడా అనుసరించడానికి టీడీపీ సిద్ధమైంది. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ఒక్క ఇల్లూ మంజూరు చేయలేకపోయిన అధికార తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రం ప్రవేశ పెట్టిన గృహనిర్మాణ పథకాన్ని తమదిగా ప్రచారం చేసుకుంటున్నారు.  ప్రధానమంత్రి ఆవాజ్ యోజన పథకంలో ఇళ్లు మంజూరు చేస్తామంటూ కేంద్రం ప్రకటించడంతో జిల్లా కేంద్రం కాకినాడలో దాదాపు 50 డివిజన్ల నుంచి ఇప్పటి వరకు 43వేల మంది దరఖాస్తులు చేసుకున్నారు. కానీ, 4,608 ఇళ్లు మాత్రమే కేంద్రం కేటాయించింది. 

అనువుగాని స్థలంలో ఇళ్ల నిర్మాణమా...
పీఎంఏవై పథకంలో ఇళ్ల నిర్మాణం కోసం పర్లోపేటలో 47 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. అయితే అందులో 25 ఎకరాలు జీప్లస్‌ 3 నిర్మాణాలకు ఏ మాత్రం అనువుగాలేవని ఓ అధ్యాయనంలో బయటపడింది. సముద్రతీరాన్ని ఆనుకుని ఉన్న ఈ ప్రాంతంలో దాదాపు 25 ఎకరాలు ఊబిగా నిర్ధారణవడంతో ఇక్కడ జరిగే నిర్మాణాలు భవిష్యత్‌లో భూమిలోకి కుంగే అవకాశం కూడా ఉందని నివేదికలు స్పష్టం చేశాయి. అయితే ఇవన్నీ పక్కన పెట్టి త్వరలోనే టు బెడ్‌ రూమ్‌ ప్లాట్‌లు వచ్చేస్తున్నాయంటూ దరఖాస్తుదారులను మభ్యపెట్టి వారి వాటా సొమ్మును కట్టించేశారు. వాస్తవానికైతే, కార్పొరేషన్‌ పరిధిలో వచ్చిన 43వేలకు పైగా దరఖాస్తుల్లో సీనియారిటీ ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలి. అయితే, అదేమి లేకుండా దశాబ్ధాలుగా సొంతిల్లులేక వేచి చూస్తున్న పేదల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే హడావుడిగా 4,608 మంది జాబితాను ప్రకటించేశారు.

తతంగమంతా  ఎమ్మెల్యే కార్యాలయం నుంచే 
ఇళ్లు వస్తున్నాయన్న ఆశతో నేతలు చెప్పిన మేరకు నిరుపేదలు అక్కడా ఇక్కడా అప్పులు చేసి డీడీలు కట్టేశారు. ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరావు కార్యాలయం నుంచి ఇళ్లు మంజూరైందంటూ సమాచారం పంపించారు. వాస్తవానికైతే వారికి ఇళ్లు మంజూరే కాలేదు. ఈ రకంగా మంజూరు కాకుండా  సుమారు 3,500 మంది ఇప్పటికే సొమ్ములు చెల్లించేశారు. విశేషమేమిటంటే ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే నేరుగా దరఖాస్తుదారులొచ్చి డీడీలు కట్టడం చూసి కార్పొరేషన్‌ అధికారులు సైతం షాకయ్యారు.  డీడీలు కట్టమని చెప్పకుండానే కార్యాలయానికి నేరుగా రావడంపై కార్పొరేషన్‌ అధికారులు అభ్యంతరం కూడా వ్యక్తం చేశారు. ఈ రకంగా కార్పొరేషన్‌కు రూ. 8కోట్ల వరకు డీడీలు వచ్చినట్టు సమాచారం. ఇళ్లు ఇచ్చింది... చేసిందీ లేదు. కానీ, ఇళ్లు మంజూరైందంటూ ముడుపుల పర్వం సాగించారు. అధికార పార్టీ అనుయాయుల  ఒక్కొక్కరి నుంచి రూ. 10వేల వరకు వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. వీరితో పాటు   జన్మభూమి కమిటీ సభ్యులు కూడా చేతివాటం ప్రదర్శించారు. 

గత లబ్ధిదారులకు అతీగతి లేదు  
గత పాలనలో ఐహెచ్‌ఎస్‌డీపీ పథకంలో 1750 మందికి ఇళ్లు  మంజూరయ్యాయి. ఇందులో తొలి విడత ఏటిమొగ, పర్లోపేటల్లో 816 మందికి ఇళ్లు మంజూరు చేశారు. మిగిలిన 934 మంది లబ్ధిదారులు రూ.26వేలు నుంచి  రూ.83వేలు వరకు తమ వాటా సొమ్మును అప్పట్లోనే చెల్లించారు. అప్పట్లో వాటా సొమ్ము చెల్లించినవారికి ప్రాధాన్యతా క్రమంలో ఇళ్ళు మంజూరు చేయించాల్సి ఉండగా, ఇప్పుడు ఆ లబ్ధిదారులను కనీసం పట్టించుకోవడం లేదు.  దాదాపు మూడుకోట్ల రూపాయాలు డీడీల రూపంలో వీరిచ్చిన సొమ్ము గృహనిర్మాణశాఖలో మూలుగుతున్నాయి. అర్హత కలిగి, సొమ్ముకట్టి ఏళ్ళు గడిచినా తమకు ఇల్లు ఎప్పుడు మంజూరవుతుందా అని గత లబ్ధిదారులు ఆశతో ఎదురుచూస్తున్నారు.
Back to Top