అసెంబ్లీ లో అడ్డంగా దొరికిపోయిన టీడీపీ

   () నిస్సిగ్గుగా అబద్దాలు చెబుతున్న టీడీపీ

() సూటిగా ప్రశ్నించిన వైఎస్సార్సీపీ

() తడబడి మాట మార్చేసిన టీడీపీ

 

హైదరాబాద్) మాట్లాడితే థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పే శాసనసభ వ్యవహారాల
శాఖ మంత్రి యనమల రామక్రిష్ణుడు...అడ్డగోలుగా అబద్దాలు చెప్పటంలో దిట్ట అని మరోసారి
రుజువు చేసుకొన్నారు. నిండుసభలో అబద్దాలు చెప్పి అడ్డంగా దొరికిపోయారు. దీంతో మాట
మార్చటం టీడీపీ సభ్యుల వంతయింది.

ఎగతాళి వ్యాఖ్యలు

అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద చర్చకు రెండు
రోజుల సమయం ఇచ్చినట్లు అసెంబ్లీ వర్గాలు ప్రకటించాయి. కానీ మొదటి రోజు చివరి గంటలో
చర్చను ప్రారంభించారు. దీని మీద అభ్యంతరం తెలిపిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మరికొంత
సమయం కావాలన్నారు. ఒక గంటలోనే చర్చ ముగించి ఒక రోజు చర్చ అయిపోయిందని చెబుతారని,
అందుచేత సభను సాయంత్రం దాకా నిర్వహించాలని కోరారు. దీన్ని అడ్డుకొన్న శాసనసభ
వ్యవహారాల మంత్రి యనమల రామక్రిష్ణుడు ఎప్పటిలాగే అడ్డగోలుగా అబద్దాలు చెప్పేశారు.
గతంలో వైఎస్ జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో
మధ్యాహ్నం ఒకటిన్నర కాగానే చేతి గడియారం చూసుకొనేవారని చెప్పారు. మధ్యాహ్నం దాటాక
సభను జరగనిచ్చేవారు కాదని వివరించారు.

వాస్తవాలు వివరించిన విపక్ష నేత

        దీనికి ప్రతిపక్ష నేత వైఎస్
జగన్ అభ్యంతరం తెలిపారు. గతంలో రాత్రి 8 గంటల దాకా సభ నడిచిన రోజులు ఉన్నాయని
గుర్తు చేశారు. బడ్జెట్ సమావేశాలు 60, 70 రోజులు జరిగిన సందర్భాలు ఉన్నాయని
స్పష్టం చేశారు. ఈ సమయంలో టీడీపీ ఎమ్మెల్యే ధూలిపాళ్ల నరేంద్ర అడ్డు తగిలారు.
ముఖ్యమంత్రిగా వైఎస్ ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా సభ సాయంత్రం దాకా జరగలేదని స్పష్టంగా
చెప్పారు. అంతే గాకుండా సభను సాయంత్రం దాకా నిర్వహించింది చంద్రబాబునాయుడు
అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే అని చెప్పుకొచ్చారు. తనది ట్వంటీ ఇయర్స్ ఇండస్ట్రీ
అని డబ్బాలు కొట్టుకొన్నారు. ప్రతిపక్ష నేత మీద బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేశారు.

నిలదీసిన సీనియర్ సభ్యులు పెద్దిరెడ్డి

దీనికి వైఎస్సార్సీపీ సీనియర్ సభ్యులు
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభ్యంతరం తెలిపారు. ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ పరిపాలన
చేసినప్పుడు అసెంబ్లీకి లంచ్ బ్రేక్ ఇచ్చినా, సాయంత్రం దాకా అనేక సార్లు సభను
నిర్వహించారని స్పష్టం చేశారు. కావాలంటే రికార్డులు వెరీఫై చేసుకోవచ్చని సవాల్
విసిరారు. అంతేగాకుండా చంద్రబాబు రెండేళ్ల పాలనలో ఎన్ని రోజులు సభ జరిగిందో,
వైఎస్సార్ హయంలో ఒక్క ఏడాదిలోనే అన్ని రోజులు నిర్వహించిన సందర్భాలు ఉన్నాయని
తేల్చి చెప్పారు.

        దీంతో టీడీపీ అడ్డంగా ఇరుక్కొని
పోయింది. వాస్తవాల్ని వైఎస్సార్సీపీ కుండ బద్దలు కొట్టినట్లు చెప్పటంతో ఏమి చేయాలో
పాలు పోలేదు. దీంతో వైఎస్సార్ హయంలో అసెంబ్లీ సాయంత్రం దాకా కూడా నడిచిందని, కానీ
అదంతా తెలుగుదేశం ప్రతిపక్ష హోదాలో గట్టిగా డిమాండ్ చేయటం వల్లనే సాధ్యం అయిందని
సన్నాయి నొక్కులు నొక్కింది. నిండు సభలో అంతకు ముందు వైఎస్సార్ హయంలో సభ సాయంత్రం
దాకా జరగలేదని చెప్పటం, తర్వాత నిజం బయట పడేసరికి, అది కూడా టీడీపీ వల్లనే
జరిగిందని చెప్పుకోవటం పచ్చ చొక్కాలకే చెల్లింది. 

Back to Top