ముగిసిన టీడీపీ నాటకం

              

మనం ముందే చెప్పుకున్నట్లు తెలుగుదేశం ఎంపీల నిరసన నాటకానికి తెరపడింది.  జైట్లీ ఎదో హామీ ఇచ్చారట.  దానికి తెలుగుదేశం ఎంపీలు సంతృప్తి చెందారుట.  జైట్లీ ఇచ్చిన హామీలలో కొత్త ఏముంది?  తెలుగుదేశం ఎంపీల ఆందోళనతో బీజేపీకి బీపీ పెరిగిపోయిందని, ప్రధాని సుజనాచౌదరికి కలవాలని వెంటనే కబురు పంపించారని క్షుద్రజ్యోతి కామెడీ స్టోరీ వండి వార్చింది.  ఆంధ్రప్రదేశ్ కు పూర్తి  న్యాయం చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారని సుజనాచౌదరి చెప్పారు తప్ప ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేస్తానని ప్రధాని మాత్రం ఎవరితోనూ చెప్పలేదు.  ప్రధాని ఆగ్రహానికి గురికాకుండా ఎలా బయటపడాలా అని తెలుగుదేశం ఎంపీలకు బీపీ షుగర్ లెవెల్స్ పెరిగిపోయిన ఉంటాయనేది ఎవరూ చెప్పాల్సిన పనిలేదు.  చివరకు ఎంపీలు అందరూ తోకలు ముడిచి యధాస్థానాల్లో పెట్టుకున్నారు.  

మనం ముందే చెప్పుకున్నాం.  అజస్ర సహస్ర కోటీశ్వరులైన తెలుగుదేశం ఎంపీలు ఆందోళనలు చెయ్యడం అనేది కలలో కూడా జరగదని.  ప్రధాని కన్నెర్ర చేసి సిబిఐ వారిని పంపిస్తే వీరిలో కొంతమందికి పదేళ్లకు పైగా జైలుశిక్ష తప్పదు.  మనం ఊహించినట్లుగానే తెలుగుదేశం ఎంపీలు నాటకాన్ని ముగించేశారు.  

వైసిపి ఎంపీలు మాత్రం తమ నాయకుడిమీద కేసులు ఉన్నప్పటికీ, మీడియా ముందు కేంద్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.  రాష్ట్రప్రయోజనాలకోసం పోరాడుతామని వారు స్పష్టం చేసారు.  ఇప్పటికి నాలుగేళ్లలో చెయ్యనిది ఇప్పుడేమి చేస్తారు అని సుబ్బారెడ్డి ప్రశ్నించి బీజేపీని ఇరకాటంలోకి నెట్టేశారు.  వైసిపి ఎంపీల సాహసాన్ని మెచ్చుకోవాలి.  

మిథున్ రెడ్డి  పార్లమెంట్ లో చేసిన ప్రసంగం అద్భుతంగా ఉంది.  ప్రస్తుతం మనకు కావాల్సింది ఇలాంటి చురుకైన, భాషాజ్ఞానం, విషయాలపట్ల అవగాహన కలిగిన యువకిశోరాలు.  అంతే తప్ప ఎముకలు క్రుళ్ళిన,  వయస్సుమళ్ళిన వృద్ధ జంబూక సోమరిపోతులు కారు.  

ఇక సోము వీర్రాజు విషయానికి వస్తే ఆయన నిన్న చేసిన ఆరోపణల ప్రకంపనలు ఇంకా టీడీపీని కుదిపేస్తూనే ఉన్నాయి.  చంద్రబాబు మీద నేరుగా వీర్రాజు ఆరోపణలు చేసారు అంటే ఆయనకు బీజేపీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ ఉన్నదని భావించాలి.  మోడీ - అమిత్ షా ల ప్రోద్బలం లేనిది వీర్రాజు లాంటి ఒక ఎమ్మెల్సీ అంత ఘాటుగా విమర్శించడం జరగని పని.  ఆ విషయాన్నీ చంద్రబాబు గ్రహించారు.  అందుకే వీర్రాజును విమర్శించి మరింత ఇబ్బందులలో తనను పడెయ్యద్దు అని తన పార్టీ నాయకులను ఆదేశించారు.  అతి చేస్తే గతి చెందుతుందని చంద్రబాబు లాంటి అనుభవజ్ఞుడికి తెలియకుండా ఉంటుందా?  

కొంతమంది తెలుగుదేశం నాయకులు వీర్రాజు చేసిన ఆరోపణలకు లెక్కలతో వివరంగా కౌంటర్ ఇస్తే బాగుండేది.  వీర్రాజు చేసిన ఆరోపణలను  గణాంకాలతో పాయింట్ టు పాయింట్ ఖండిస్తే అర్ధవంతంగా ఉండేది.  అలా కాకుండా "చంద్రబాబును విమర్శించే స్థాయి వీర్రాజుకు లేదు... నోరు పారేసుకోవద్దు...ఆయన వైసిపి తరపున మాట్లాడుతున్నారు"  లాంటి పిరికి ప్రకటనలు చెయ్యడం వారిలో ఉన్న భయవిహ్వలతకు తార్కాణం.  బీజేపీకి కోపం వస్తే ఒక్క ఓటుకు నోటు కేసు చాలు చంద్రబాబును ఏడేళ్లు శ్రీకృష్ణజన్మస్థానానికి పంపించడానికి అని వారికి బాగా ఎరుక.  అందుకే అర్ధంపర్ధం లేని విమర్శలు చేస్తూ వీర్రాజు చేసిన ఆరోపణలు నిజమేనేమో అని ప్రజలు భావించేట్లు చేస్తున్నారు.  చంద్రబాబు అవినీతిపట్ల మరిన్ని అనుమానాలను పెంచుతున్నారు...తమ అజ్ఞానంతో.  

ఇన్నాళ్లూ ఒక్క జగన్ మాత్రమే చంద్రబాబు మీద అవినీతి ఆరోపణలు గుప్పిస్తున్నారు.  ఇప్పుడు అధికారపార్టీ మిత్రపక్షం కూడా చంద్రబాబుపై నేరుగా అవినీతి అస్త్రాలను సంధిస్తున్నది అంటే జగన్ కు విశ్వసనీయత పెరిగినట్లే నమ్మాలి.  

ఏదేమైనప్పటికీ, తెలుగుదేశం ఎంపీలు ప్రధాని మెడకాయ వంచి ఏదో ఊడబొడుస్తారనే నమ్మకం ఎవ్వరిలోనూ లేదు.  వారికి వారి వ్యాపార ప్రయోజనాలే ముఖ్యం.
Written by Ilapavuluri
Back to Top