హోదా క్రెడిట్ కోసం టిడిపి ఆరాటం

ఓ పక్క ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  పెద్ద ఎత్తున ఢిల్లీలో పోరాటం జరుపుతోంది. ఆంధ్రప్రదేశ్ కు హక్కుగా లభించిన హోదా విషయంలో నిర్లక్ష్యం తగదని కేంద్రంతో తలపడుతోంది. దేశం యావత్తూ ఈ ఉద్యమం గురించి చర్చించేలా చేసింది. ఇంత జరుగుతున్నా తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం పైకి హోదా కోసం పోరాటం అంటూనే మరో పక్క ప్యాకేజీల గురించి మంతనాలాడుతున్నారు. ఇంతకు మించిన దగకోరుతనం ఎక్కడైనా ఉంటుందా? ప్రజల తరఫున హోదా కోసం ప్రతిపక్షం దీక్షలు చేస్తుంటే, ప్రభుత్వం మాత్రం దాన్ని నీరుగార్చే ప్రయత్నాల్లోనే ఉంది. 
జైట్లీని కలిసిన టిడిపి నేతలు
హోదా గురించి మాట్లాడలంటూ అమిత్ షా చంద్రబాబుకు ఫోను చేసారని, అందుకే ఢిల్లీలో మీటింగ్ అనీ కలరింగ్ ఇచ్చారు తెలుగు తమ్ముళ్లు. కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, టిడిపి, బిజెపి ఎమ్.పిలు రామ్మోహన్ నాయుడు, కంభంపాటి హరిబాబు, ఎపి భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్, ఎపి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు బృందం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశం అయ్యింది. హోదా పై చర్చిద్దాం రమ్మని అమిత్ షా  బాబును పిలవగా, నేను రాను మా బ్యాచ్ ను పంపుతాను అని చంద్రబాబు బింకంగా చెప్పినట్టు బోలెడు వార్తలు షికార్లు కొట్టాయి. మరి రమ్మని పిలిచిన అమిత్ షా ఈ సమావేశానికి ఎందుకు డుమ్మా కొట్టినట్టు అని అంటే, మా ఫ్లైట్ డిలే అయిన కారణంగా ఆయన వెళ్లిపోయారు అని సమాధానాలు ఇచ్చుకుంటున్నారు టిడిపి నేతలు. ఇంతకీ ఆ సమావేశంలో ఏం జరిగింది అనే విషయం యనమలే విలేఖర్లకు తెలియజేసారు. అటు హోదా గురించో ఇటు ప్యాకేజీ గురించో అసలు దేని గురించి మాట్లాడారో, దానికి అరుణ్ జైట్లీ ఎలాంటి హామీ ఇచ్చారో ఏదీ స్పష్టంగా చెప్పనే లేదు. ప్రత్యేక హోదా ఇతర రాష్ట్రాలకిచ్చి మాకెందుకు ఇవ్వరిని అడిగాము అన్నారు యనమల. రెవెన్యూ లోటు ఇంకా రావాల్సి ఉందని, బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని అరుణ్ జైట్లీతో చర్చించినట్టు చెప్పుకొచ్చారు. ఆర్థిక ప్రయోజనాలు చేకూరేలా చూస్తామని జైట్లీ అన్నారని తెలియజేసారు. ఇందులో ఎక్కడా హోదా గురించి కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి సూత్రప్రాయమైన హామీ కూడా ఇవ్వలేదన్నది స్పష్టం.
క్రెడిట్ కోసం తెలుగు తమ్ముళ్ల పాకులాట
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని ఆది నుంచీ పోరాడుతున్నారు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్. ఇప్పుడా ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది. హోదాపై తాడో పేడో అనేలా ప్రతిపక్ష వైసీపీ ఇతర పార్టీలు, ప్రజలను కలుపుకుని పోతోంది. దాంతో హోదాపై తామేం చేయలేదనే విషయం ప్రజల్లోకి బాగా చొచ్చుకుపోయిందని అర్థం అయిన టిడిపి శ్రేణులు కొత్త డ్రామాలు మొదలు పెట్టాయి. పార్లమెంటులో జాతి సిగ్గుపడే రీతిలో వెకిలితనం ప్రదర్శించడమే కాదు, హోదా కోసం ఢిల్లీలో పోరాడుతున్న వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ దీక్షను కూడా అణిచివేసే ప్రయత్నం చేసారు. కేంద్రతో అధికారం పంచుకున్న టిడిపి సర్కార్ ఢిల్లీలోనూ తన దమనకాండనే కొనసాగించింది. అక్రమ అరెస్టులతో హోదా ఉద్యమానికి తాను వ్యతిరేకం అనే విషయాన్ని రుజువు చేసింది. ఇన్ని జరిగినా హోదాపై ప్రభుత్వం తరఫున ఎంతో ప్రయత్నం జరుగుతోందనే అబద్ధపు ప్రచారం కల్పించుకోవడం కోసం కేంద్రంలో పెద్దలను కలుస్తున్నామని, వారేదో హామీలు ఇస్తున్నారనే ఉత్తుత్తి మాటల మెరమెచ్చులు చెప్పుకోవడం మొదలు పెట్టారు. 
ప్రజలకు అంతా తెలుసు
ప్రత్యేక హోదా వద్దన్నదెవరో, ఆంధ్రుల ఆశలను అధిష్టానం వద్ద తాకట్టు పెట్టిందెవరో, హోదాకంటే ప్యాకేజీలపై మక్కువ చూపిస్తోందెవరో ప్రజలు సులభంగానే అర్థం చేసుకున్నారు. అందుకే బాబు చెప్పే మోసకారి మాటలను నమ్మకుండా, హోదా కోసమే మా పోరాటం అని తేల్చి చెబుతున్నారు. హోదా కోసం కేంద్రాన్ని నిలదీశే దమ్ములేక, కేబినెట్ నుంచి మంత్రులను ఉపసంహరించుకునే సత్తా లేక, ఎమ్.పిలతో రాజీనామా చేయించే చేవ లేక చంద్రబాబు ఆడుతున్న హోదా డ్రామాను ప్రజలు తిప్పి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు.  

 
Back to Top