కాకినాడలో టిడిపికి పరాభవం ఖాయం

ఒకప్పుడు ముఖ్యమంత్రో, మంత్రులో లేక ప్రముఖ రాజకీయ నాయకులో వస్తున్నారంటే వీధులను శుభ్రం చేసి, సున్నాలు వేసేవారు. దోమల మందులు కొట్టేవారు. మురికిగా, అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలు, ఆయా నేతల రాకతోనైనా కాస్త సుందరంగా తయారైనందుకు సంతోషించేవారు జనం. ఇప్పుడు రాజకీయాలు అలా లేవు. నేతలు ప్రజల వాకిళ్ల ముందుకు రావడం మానుకుని మూడేళ్లైపోయింది. అనుకోకుండా వీధులు శుభ్రం అయి, రోడ్లు వేసే రోజులు మళ్లీ వచ్చాయి. అంటే దానర్థం నాయకులు ప్రజలను కలవడానికి రావడం కాదు. ఎలక్షన్లు రావడం. నంద్యాల ఎలక్షన్లకు నంద్యాల రోడ్లు వెడల్పు అవుతుంటే, కాకినాడ కార్పొరేషన్ ఎలక్షన్లకు హడావిడిగా రోడ్ల మరమ్మత్తులు జరుగుతున్నాయి. దీంతో నెలకో ఎలక్షనుంటే బావుండు, అందులో వైఎస్సార్ సిపి పోటీ చేస్తే ఇంకా బాగుండు అనుకుంటున్నారు ప్రజలు. కాస్త వర్షానికే మునిగిపోయే రోడ్లు, పొంగి పొరలే డ్రైనేజీలు, పారిశుద్ధ్యలోపంతో కొట్టుమిట్టాడే కాకినాడ లో ఆదరాబాదరాగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్రతిపక్ష పార్టీ పోటీ చేస్తేనే భయంతో ప్రభుత్వం పరిగెత్తి పనులు చేస్తుందని ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇదంతా ఎన్నికల మహిమ, ఆ ఎన్నికల్లో బలమైన ప్రతిపక్ష పార్టీ మహిమ అని స్థానికులు చర్చించుకుంటున్నారు. కాకినాడను స్మార్ట్ సిటిగా ఎన్నిక చేసిన తరువాత కూడా కన్నెత్తి చూడని ప్రభుత్వం ఇప్పుడు రోడ్లు వేసి, డ్రైనేజీలు సరి చేస్తుంటే విడ్డూరంగా ఉందంటున్నారు కాకినాడ వాసులు. ఎన్నికల కోసం పడుతున్న పాట్లు తప్పించి చేసే పని మీద శ్రద్ధ లేదంటున్నారు. ఒక పక్కవర్షంతో, బురదమయమైన చోట్లే రోడ్లు వేసేయడం చూస్తే పనుల్లో నాణ్యత కొరవడుతోందని తెలుస్తోందని, తూతూమంత్రంగా చేసే ఈ హడావిడికి ఓట్లు రాలతాయనుకోవడం టిడిపి భ్రమే అని కాకినాడ ప్రజలు విమర్శిస్తున్నారు. 

ఈ సంగతి ఇలాఉంటే మిత్రపక్షమైన బిజెపికి టిడిపి ఝలక్ ఇచ్చింది. కాకినాడ కార్పొరేషన్ ఎలక్షన్లో  బిజెపి పోటీ చేసే వార్డుల్లో టిడిపి అభ్యర్థులు నామినేషన్లు ఉప సంహరించుకోలేదు. ముందు 26 వార్డులు అడిగిన కమలదళానికి బిజెపి 9వార్డులనే ఇచ్చి సర్దుకోమంది. అప్పటికే 23 వార్డుల్లో నామినేషన్ వేసిన భాజప తన వాటాలోని 9వార్డులు మినహాయించి మిగిలిన చోట్ల నామనేషన్లు ఉపసంహరించుకుంది. కాని టిడిపి మాత్రం బిజెపి కోటాలోని వార్డుల నుంచి నామినేషన్లను ఉపసంహరించుకోలేదు. ఇప్పుడు నామినేషన్ల ఉపసంహరణ గడవుకూడా పూర్తి అయిపోవడంతో టిడిపి చేసిన మోసంపై కమలం నేతలు కోపంతో మండిపడుతున్నారు. మిత్రపక్షం అంటూ వాడుకుని ఇలా నమ్మకద్రోహం చేస్తారా అని టిడిపిపై నిప్పులు చెరుగుతున్నారు. చంద్రబాబుకు, ఆయన పార్టీకి ఇది ఎప్పుడూ ఉన్న అలవాటే అని బిజెపి నేతలు మరిచిపోయి, వారితో పొత్తుపెట్టుకోవడం వల్లే ఇలా అయ్యిందని ఆ పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేసారు.

తూర్పు గోదావరి జిల్లాకు కాపుల ఖిల్లా అనే పేరుంది. అందులోనూ కాకినాడలో కాపు సామాజిక వర్గం ఎక్కువ శాతం ఉన్నారు. కాపుల ఉద్యమాన్ని నిర్దాక్షిణ్యంగా అణిచివేసిన టిడిపి సర్కార్ ఇప్పుడు కాకినాడ ఎలక్షన్ల పేరు తలుచుకుని టెంక్షన్ పడుతోంది. కాపు రిజర్వేషన్ల గురించి మాటమార్చిన చంద్రబాబు వైఖరిపై కాపులంతా గుర్రుగా ఉన్నారు. కొన్నాళ్లుగా వారి నాయకుడు ముద్రగడను గృహనిర్బంధంలో ఉంచడం, ఇటీవల విజయవాడలో సభపెట్టి కాపు వర్గీయుల్లోనే అంతర్గత చీలికను తేవడంతో టిడిపి పేరు చెబితేనే కాపులు భగ్గుమంటున్నారు. శాంతియుతంగా పాదయాత్ర చేయాలనుకున్న వారికి అనుమతినివ్వకుండా, పోలీసు బలగాలతో ఉద్యమాన్ని అణిచివేయడంతో టిడిపికి ఈ ఎలక్షన్ లో గట్టి గుణపాఠం నేర్పాలనుకుంటున్నారు. 2014లో పవన్ టిడిపికి మద్దతు ఇవ్వడంతో ఈ వర్గమంతా అప్పుడు చంద్రబాబుకు అండగా నిలిచారు. కాని గత మూడేళ్లుగా చంద్రబాబు ద్వంద వైఖరి చూసిన పవన్ ఈ ఎన్నికల్లో తటస్థంగా ఉంటాను కాని టిడిపికి మాత్రం మద్దతు ఇవ్వనన్నారు. ఒక పక్క వైసిపి దూకుడు, మరోపక్క కాపునేతల కన్నెర్ర, పవన్ సహాయ నిరాకరణ, టిడిపి చేసిన మోసంతో కాకమీదున్న మిత్రపక్షం, అన్నిటికీ మించి అభివృద్ధికి, ఎలక్షన్లకు దూరంగా ఉంచినందుకు కాకినాడ ప్రజల అసంతృప్తి అన్నీ కలిసి తెలుగుదేశాన్ని ఈ ఎన్నికల్లో మట్టికరిపిస్తాయన్నది స్పష్టం అయిపోతోంది. Back to Top