సదావర్తి వెనుక సర్కారు కుట్ర..?

– కనీస ధర నిర్ణయించకుండా వేలం 
– ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల నష్టం 
– తాజా వేలంతోనే బహిర్గతమైన మోసం 
– మొక్కుబడి ప్రకటనలతో వేలం 

సదావర్తి భూములపై చంద్రబాబుకు ఆశ చావడం లేదు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన వ్యక్తి దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎలాగైనా భూములు కాజేయాలని కన్నేసినట్టు గతంలో జరిగిన సదావర్తి వేలం చూస్తేనే తెలుస్తుంది. మొక్కుబడిగా వేలం నిర్వహించి తన అనుయాయుడైన కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ రామానుజయ్య కుటుంబ సభ్యులకు దక్కేలా చేశారు. దాదాపు వెయ్యి కోట్ల విలువైన భూములను కేవలం 22 కోట్లకే వారికి కట్టబెట్టి చంద్రబాబు ప్రభుత్వ ఆస్తులను ధారాదత్తం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారు. అయితే దీనిపై వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కల్పించుకుని పోరాడటంతో అసలు నిజాలు వెలుగు చూశాయి. చెన్నై నగర నడిబొడ్డున ఉన్న భూములను కారు చౌకగా కట్టబెట్టేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దానిపైన కోర్టు కూడా అక్షింతలు వేయడంతో మళ్లీ వేలం నిర్వహించారు. 

రెండో వేలంతో మోసం వెలుగులోకి
సదావర్తి భూముల విషయంలో ప్రభుత్వం ఎంత స్థాయిలో మోసానికి పాల్పడిందో చాలా స్పష్టంగా నిరూపణ అయింది. అయితే ఇప్పుడు ప్రభుత్వానికి లభిస్తున్నది 60.30 కోట్లు మాత్రమే. 83.11 ఎకరాల భూమికి కేవలం 60కోట్లు దక్కుతున్నాయి. వాస్తవంగా ఇక్కడి భూమి విలువ వందల కోట్లలోనే ఉంది. అయితే అక్కడున్న మార్కెట్‌ వేల్యూతో పోల్చుకుంటే రూ. 60 కోట్లు కూడా చాలా చిన్న విషయం. ప్రభుత్వం రెండోసారి నిర్వహించిన వేలంలోనూ చాలా అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలున్నాయి. మొత్తం 83 ఎకరాలు కాగా.. ప్రభుత్వం కేవలం 79 ఎకరాలకే వేలం నిర్వహించడం గమనార్హం. అంతేకాకుండా ఈ వేలం నిర్వహిస్తున్న విషయాన్ని కూడా బాహ్య ప్రపంచానికి తెలియకుండా చేశారు.  జాతీయ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుంటే భారీ ధర పలికి ఉండేదే. 

కనీస ధర నిర్ణయించి ఉంటే..
సదావర్తి సత్రానికి చెందిన మొత్తం భూములు 83.11 ఎకరాలు. చెన్నైలోని ఈ ప్రాంతంలో అధికారికంగా భూముల రిజిస్టర్‌ వేల్యూ... ఎకరా 6.5 కోట్లు. అంటే.. ఎవరైనా ఎకరాను కోటి రూపాయలకు కొన్నట్లు ఒప్పందపత్రాలు రాసుకున్నా సరే.. ప్రభుత్వం మాత్రం ఆ స్థలం కనీస ధర 6.5 కోట్లుగా లెక్కించి, దానికి తగ్గట్లుగానే స్టాంప్‌ డ్యూటీలు వసూలు చేస్తుంది. సాధారణంగా ప్రభుత్వం చెప్పే రిజిస్టర్‌ వేల్యూ కంటే.. మార్కెట్‌ విలువల రెట్టింపుగా ఉంటాయి. ఆ లెక్కన.. సదావర్తి భూముల 83 ఎకరాల విలువ వెయ్యి కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది. కానీ మొత్తం కలిపి 60.30 కోట్లకే వేలం పాట జరిగింది. కనీసం రెండోసారి వేలం నిర్వహించేప్పుడు అయినా.. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. ఆ ప్రాంతంలో ప్రభుత్వం నిర్ణయించిన రిజిస్టర్‌ వేల్యూను కనీస ధరగా నిర్ణయించి వేలం పెట్టి ఉంటే బాగుండేది. గతంలో ఒకసారి అక్రమాలకు పాల్పడిన ప్రభుత్వమే మళ్లీ వేలం నిర్వహించినందున.. ఎంత ఎక్కువ ధర పలికితే.. అంతగా తమ అక్రమాలు బయటకు వస్తాయనే భయంతో.. తక్కువ ధరనే నిర్ణయించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేలం జరిగిన తీరును గమనిస్తే బిడ్‌ను దక్కించుకున్న సత్యనారాయణరెడ్డి కన్‌స్ట్రక్షన్స్, మరో పార్టీ తప్ప మిగతా అందరూ రూ. 28 కోట్లలోపే టెండర్లు దాఖలు చేయడం గుర్తించాలి. అంటే ఎక్కువమంది వేలంలో పాల్గొనకుండా ప్రభుత్వ పెద్దలే ప్రభావితం చేశారని అర్థమవుతుంది. వేలంలో భూమలు దక్కించుకున్న వ్యక్తి కూడా మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అనుచరుడు కావడం విశేషం. వేలం జరిగిన రోజున కూడా అతడు వరదరాజులరెడ్డి కుమారుడితోపాటే వేలానికి హాజరవడం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం. సదావర్తి వేలం చుట్టూ జరుగుతున్న పరిణామాలు చూస్తే ప్రభుత్వ కుట్ర సుస్పష్టం. మంత్రి ఆదినారాయణ రెడ్డి చెన్నైలో మకాం వేసి వేలంలో పాల్గొనాలనుకున్న వారిని బెదిరింపులకు గురిచేసినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి.   ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కనీస మార్కెట్‌ ధర నిర్ణియంచి మళ్లీ వేలం నిర్వహిస్తే ప్రభుత్వ ఖజానాకు వందల కోట్లు లాభాలు వచ్చే అవకాశం ఉంది. 
Back to Top