బీజేపీని బుక్‌ చేసిన టీడీపీ

– 9 సీట్లిచ్చినట్టుగా సొంతంగా పేపర్‌ ప్రకటన
– బీజేపీ కార్యాలయంపై అభ్యర్థుల దాడి 
– గెలవలేని సీట్లు కేటాయించారని టీడీపీపై గరంగరం
– ప్రచారంలో దూసుకెళ్తున్న వైయస్‌ఆర్‌సీపీ

కార్పొరేషన్‌ ఎన్నికలు టీడీపీ కీలక నేతలకు కఠిన పరీక్షగా మారాయి. పార్టీకి కూడా చావు దెబ్బ తప్పేలా కనబడటం లేదు. ఇద్దరు మంత్రుల మధ్య కుదరని సయోధ్య, టీడీపీ మూడేళ్ల పాలనపై ప్రజల్లో వ్యతిరేకత, అభివృద్ధికి నోచుకోని కాకినాడ స్మార్ట్‌సిటీ.. బీజేపీతో పొత్తుపై ఇప్పటికీ కుదరని సయోధ్య.. ఇలా అన్ని వైపులా వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో హఠాత్తుగా వచ్చి పడిన కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికలు అధికారపార్టీ నేతలకు తలనొప్పిగా మారాయి. ఇదే సమయంలో ప్రతిపక్ష వైయస్‌ఆర్‌సీపీ ప్రచారంలో దూసుకుపోతోంది. 

ఆమడ దూరంలో యనమల
ఇటు పార్టీలోను.. అటు మంత్రివర్గంలో సీనియర్‌గా ఉన్న రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి యనమల రామకృష్ణుడు అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. జెడ్పీ చైర్మన్‌ విషయంలో ఆయన మాట చెల్లుబాటు కాకపోవడంతో పార్టీలో యనమలకు ప్రాధాన్యత తగ్గిందనే చర్చ జరుగుతోంది. అభ్యర్థుల ఎంపిక అంతా సర్వేలు, ఐవీఆర్‌ఎస్‌ విధానంతో ఉంటుందని అధిష్ఠానం తేల్చిచెప్పడం కూడా ఆయన పాత్ర పెద్దగా లేదన్నట్టుగా చేసింది. 

రాజప్ప చుట్టూ ఉచ్చు...
ఇక ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు మాత్రం ఈ ఎన్నిక అగ్నిపరీక్షే. రాజప్ప కార్పొరేషన్‌ను ఆనుకుని ఉన్న పెద్దాపురం అసెంబ్లీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇటీవల జెడ్పీ చైర్మన్‌ మార్పు వంటి విషయాల్లో చురుగ్గా ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల బాధ్యత కూడా పార్టీ ఆయనకే అప్పగించింది. దీంతో గెలిపించాల్సిన బాధ్యత సహజంగా రాజప్ప మీదనే ఉంది. రాజప్పకు సొంత సామాజికవర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంది. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమిస్తున్న కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం విషయంలోనూ, ఉద్యమాన్ని అణచివేసే విషయంలో రాజప్ప సొంత సామాజికవర్గం నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.

బీజేపీతో ఎడతెగని సీట్ల రగడ
బీజీపీతో పొత్తు ఖరారు చేసుకున్న టీడీపీ సీట్ల విషయంలో మాత్రం రోజుకొక నాటకం ఆడుతోంది. మొదట రెండంకెల సీట్లు కేటాయిస్తామని చెప్పిన టీడీపీ నాయకులు.. బీజేపీని సంప్రదించకుండానే 9 సీట్లు ఇస్తున్నట్టు ఏకపక్షంగా ఇచ్చిన పేపర్‌ ప్రకటన రెండు పార్టీల మధ్య నిప్పు రాజేసింది. మొదట 23 సీట్లు డిమాండ్‌ చేసిన బీజేపీ నాయకులు 9, 40 వార్డులు తమకే కేటాయించాలని పట్టు బట్టారు. అయితే 13 సీట్లు ఇస్తామని ఇరు పక్షాలు అంగీకారం చేసుకున్నారు. ఈ సమావేశంలో టీడీపీ నుంచి పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల, కాకినాడ ఎంపీ తోట నర్సింహం, శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం పాల్గొనగా బీజేపీ నుంచి దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్‌రాజు, ఆకుల సత్యనారాయణ చరచల్లో పాల్గొన్నారు. అయితే సీట్ల సర్దుపాటు పూర్తికాకుండానే టీడీపీ ఇచ్చిన ప్రకటనతో బీజీపీలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. తమకు ఆదరణ లేని డివిజన్లు ఓడిపోయే డివిజన్లను తమకు కేటాయిస్తుందని తీవ్ర ఆగ్రహంతో రగలిపోతున్నారు. 4,5,9,35,39 డివిజన్ల వరకే క్లారిటీ ఇచ్చారని మిగతా వాటికి స్పష్టత ఇవ్వకుండానే టీడీపీ పేపర్‌ ప్రకటన జారీ చేసిందని.. ఇలాంటి అవకాశవాద రాజకీయం చే స్తే ఊరుకునేది లేదని బీజేపీ నేతలు హెచ్చరించారు. 

బీజేపీకి ఊహించని షాక్‌ 
టీడీపీతో పెట్టుకున్న పొత్తు కారణంగా బీజేపీ నాయకులకు సొంత పార్టీ నుంచి సెగ తాకింది. డివిజన్ల కేటాయింపులు చేయడంతో తమకు అన్యాయం జరిగిందని బీజేపీకి చెందిన ఎస్సీ, బీసీలు తిరగబడ్డారు. ఏకంగా కార్యాలయంపై దాడి చేసి రాళ్ల వర్షం కురిపించారు. సీట్లిస్తామని చెప్పి నామినేషన్‌ వేయించిన నాయకులు ఆ తర్వాత మొఖం చాటేస్తుండటంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. సీటిస్తే ఫర్వాలేదు...లేదంటే రెబెల్స్‌గా నిలబడటం తప్పదని వార్నింగ్‌ ఇస్తున్నారు. టీడీపీ తొలి జాబితా సిద్ధం చేసింది. 34 డివిజన్ల అభ్యర్థులను ఖరారు చేసింది. మిత్రపక్షమైన బీజేపీ తొమ్మిది డివిజన్లకు తమ అభ్యర్థులను ఎంపిక చేసింది. ఇంకా ఐదు డివిజన్లే పెండింగ్‌లో ఉన్నాయి. అధికారికంగా ప్రకటించకపోయినా రెండు పార్టీల జాబితాలు బయటికొచ్చేశాయి. దీంతో టీడీపీ, బీజేపీల్లో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. నేతలపై దాడి చేసే స్థాయికి పరిస్థితులు వెళ్లిపోవడంతో  జిల్లా అధ్యక్షుడు మాలకొండయ్య ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. లేదంటే విధ్వంసానికి దారి తీసేది.   

బీజేపీని వ్యూహాత్మకంగా దెబ్బతీసిన టీడీపీ
సూత్రప్రాయంగా జరిగిన సీట్ల కేటాయింపులో టీడీపీ వ్యూహాత్మకంగా వెళ్లి బీజేపీకి కోలుకోలేని దెబ్బకొట్టింది. బలం లేని డివిజన్లను, అభ్యర్థుల దొరకని సీట్లను అంటగట్టేసి టీడీపీ సేఫ్‌గేమ్‌ ఆడింది. గెలవలేని డివిజన్‌లిచ్చేసి టీడీపీ చేతులు దులుపుకుంటోందని... ఓటమి పాలయ్యాక బీజేపీ వైఫల్యమని తప్పించుకునే అవకాశం ఉందని బీజేపీ నాయకులు అంతర్మథనం చెందుతున్నారు. వాడుకుని వదిలేసే నాయకులున్న టీడీపీని ఎలా నమ్మగలమని, అధినేతలు ఏం చెప్పినా ఎన్నికల్లో రెబెల్‌గా పోటీ చేయక తప్పదని టిక్కెటు ఆశావహులు అంటున్నారు. 
Back to Top