దాడులే లక్ష్యంగా టీడీపీ

హైదరాబాద్) తెలుగుదేశం పార్టీ ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రతిపక్షంపై దాడులు, దౌర్జన్యాలకు దిగుతోంది. ప్రభుత్వ అవినీతిని, అరాచకాలను ప్రశ్నించిన ప్రతిపక్షం గొంతు నొక్కుతూ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. అధ్యక్షులు వైయస్ జగన్ నాయకత్వంలో ప్రభుత్వం చేసే తప్పుడు పనులను, అన్యాయాలను ఎలుగెత్తి చాటుతున్న వైయస్సార్సీపీ ప్రజాప్రతినిధులపై వరుస దాడులు చేస్తోంది. పోలీసులను ఉసిగొల్పి అక్రమ కేసులు బనాయించడం, జైళ్లో పెట్టడం పరిపాటుగా మార్చుకుంది. టీడీపీ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుతున్న ప్రతిపక్ష ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి  చంద్రబాబు సర్కార్ వేధింపులకు పాల్పడుతోంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్న చోట నిధులివ్వకుండా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోంది. 

 సీఎం జిల్లాలో దాడుల పర్వం

 చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జిల్లాలో అణగదొక్కేందుకు చంద్రబాబు టీం కుట్రలకు తెరలేపింది. వైయస్సార్సీపీలో చురుకైన ఎమ్మెల్యే అయిన చెవిరెడ్డిపై పాత కేసులు తిరగదోడి అక్రమ అరెస్ట్ లకు పాల్పడుతోంది. చంద్రబాబు సొంత ఇలాకాలో టీడీపీ చేస్తున్న దుర్మార్గాలపై  ప్రజల పక్షాన పోరాడుతున్న  చెవిరెడ్డిపై టీడీపీ కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. అన్యాయంగా పేదల ఇళ్లను కూల్చేయడాన్ని నిరసిస్తూ శాంతియుతంగా ధర్నా చేస్తుంటే అక్రమ అరెస్ట్ లతో జైళ్ల చుట్టూ తిప్పుతోంది. పోలీసులు, రెవెన్యూ అన్ని వ్యవస్థలను  గుప్పిట్లో పెట్టుకొని చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతోంది. 

 మహిళా సమస్యలపై ప్రభుత్వంపై రాజీలేని పోరాటం కొనసాగిస్తున్న ఎమ్మెల్యే ఆర్ కె రోజాపై  టీడీపీ మొదటి నుంచి అక్కసు వెళ్లగక్కుతోంది. ప్రజాసమస్యలపై పోరాడుతున్న రోజాను ఇబ్బందుల పాలు చేసేందుకు టీడీపీ చేయని కుట్రలు లేవు. నిబంధనలకు విరుద్ధంగా చట్టాలను అతిక్రమిస్తూ అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం మొదలు అనేక అరాచక పర్వాలకు తెరలేపారు. 

అంతకు ముందు వైయస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డిన వేధించేందుకు కూడా పోలీసుల్ని ఉపయోగించింది. తిరుపతి విమానాశ్రయంలో జరిగిన చిన్న అంశాన్ని ఆధారంగా చేసుకొని చెన్నైలో ఆయన్ని అరెస్టు చేశారు. బలవంతంగా జైలులోకి పంపించి వేధించారు.

 ఎమ్మెల్యేలే టార్గెట్

వైయస్సార్సీపీ లో చురుకైన పాత్ర పోషిస్తున్న ఎమ్మెల్యేలపై టీడీపీ శ్రేణులు ఎక్కడికక్కడ దాడులకు దిగుతున్నారు. నరసరావుపేటలో టీడీపీ నాయకుడు కోడెల శివప్రసాద్ రావు కుటుంబం చేస్తున్న అరాచకాల్ని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. దీంతో ఆయన మీద పోలీసు కేసులు పెట్టిస్తున్నారు. తాజాగా టీడీపీ గూండాల్ని ఉసిగొల్పి దాడులు చేయించారు.

 నాయకులపై అక్కసు

వైయస్సార్సీపీ లో చురుగ్గా వ్యవహరిస్తున్న నాయకుల్ని లక్ష్యంగా చేసుకొని దాడుల్ని ముమ్మరం చేస్తోంది. అనేక చోట్ల అనుబంధ విభాగాల నాయకులపై దాడులు చేస్తున్నారు.

Back to Top