మన ఆశలపై నీల్లు, మన నోట్లో మట్టి

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి చంద్రబాబు ఇచ్చిన  'మన నీరు - మన మట్టి' అన్న  నినాదానికి మాత్రమే మోడి స్పందించి డిల్లీ నుండి పుట్ట మట్టి- యమునా నదీ జలాలు కష్టపడి మోసుకొచ్చి చంద్రబాబు చేతుల్లో పెట్టి నమస్కారం పెట్టి సెలవు పుచ్చుకొన్నారు. పైపెచ్చు 'నాపై, చంద్రబాబుపై' నమ్మకం పెట్టుకోండని ముక్తసరిగా ముక్తాయింపు ఇచ్చి వెళ్ళారు.
రాష్ట్ర విభజనతో కృంగిపోయి, భవిష్యత్తుపై బెంగ పెట్టుకొని, మనోవేదనతో కొట్టుమిట్టాడుతున్న ఐదు కోట్ల మంది ఆశలపై మోడి నీళ్ళు చల్లారు. 
విభజన చట్టంలో పొందుపరచిన అంశాలన్నింటినీ 'లెటర్ అండ్ స్పిరిట్'  అమలు పరచడానికి కట్టుబడి ఉన్నామని మరొకసారి నొక్కి వక్కాణించారు. రాజ్యసభలో నాటి ప్రధాన మంత్రి ఇచ్చిన వాగ్ధానం "ప్రత్యేక తరగతి హోదా" అమలు చేసే బాధ్యత తనపై ఉన్నట్లు కూడా మోడి చెప్పకుండా ఉద్ధేశ్యపూర్వకంగానే దాట వేసినట్లు స్పష్టంగా కనబడింది. విభజన చట్టంలో పేర్కొనబడిన వెనుకబడిన రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాలకు అభివృద్ధి ప్యాకేజీపైన ఆయన నోట మాట రాలేదు. 2018 సం. నాటికి పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేస్తామని పదే పదే చెబుతుంటారు. ఆ బహుళార్థ సాధక ప్రాజెక్టు నిర్మాణానికి నిథుల కేటాయింపుపైనా మోడి నోరు విప్పలేదు. ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీపైన మోడి ప్రకటన చేస్తారని ఊదరకొట్టారు. ఆ విషయంపైన మోడి తుస్సు మనిపించారు.
బ్రిటీష్ వాళ్ళు దేశాన్ని రెండు ముక్కలు చేసి భారత దేశాన్ని సమస్యల వలయంలో పడేసి పోయినట్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని రాజకీయాల కోసమే విభజించి సమస్యల కుంపటిలో పడవేసి పోయిందని వ్యాఖ్యానించారు. అంత వరకు బాగానే ఉన్నది. బిజెపి సహకారం లేకుండానే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజిస్తూ పార్లమెంటు ఉభయ సభల్లో చట్టం చేయగలిగిందా? బాధ్యత నుండి తప్పించుకోవడానికి అడ్డగోలుగా మాట్లాడడానికి కూడా బిడియం లేనట్లు  మాట్లాడం మోడికే చెల్లింది. 
ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకొంటున్నది మాటలు కాదు,  విభజన చట్టంలో పొందు పరచిన అంశాలు, రాజ్యసభ వేదికగా ప్రత్యేక తరగతి హోదా కల్పిస్తామన్న హామీ అమలుపై నిర్ధిష్ట కార్యాచరణ ప్రణాళిక, తదనుగుణంగా నిథుల కేటాయింపులు. రాజధాని కూడా లేని  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని శంకుస్థాపన సందర్భంలోనైనా నిర్థిషమైన ప్రకటనచేస్తారన్న ప్రజల నమ్మకాన్ని మోడి వమ్ము చేశారు."
ఆంధ్రోల్లకు ప్రియతమ       ప్రధాని మోడీగారి మహోన్నతమైస ప్యాకేజి
"చెంబెడు నీళ్ళు - పిడికెడుమట్టి" 

Back to Top