స్వాతంత్ర్యం చెప్పిన అభివృద్ధి సత్యం

కొన్ని నగ్న సత్యాలు తెలియక తెలుగు ప్రజలు అన్యాయంగా
చంద్రబాబును ఆడిపోసుకుంటున్నారు. రాష్ట్రాన్ని నిధులు లేకుండానే అభివృద్ధి చేయగల
మహానుభావుడాయన. కేంద్రం
ఇచ్చే గ్రాంటులతో పని లేకుండానే జిల్లాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టించగల సమర్థుడాయన. అందుకే
వెనకబడిన జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మౌలిక వసతుల సొమ్ములు ఖర్చే పెట్టకుండా
ఖాతాల్లో దాచిపెట్టాడు.

ఏడాదికో జిల్లాలో స్వాతంత్ర్య వేడుకలు జరపడం వల్ల
జిల్లా గణనీయంగా అభివృద్ధి చెందే సూత్రాన్ని కనిబెట్టాడు చంద్రబాబు. ఇలా
చేయడం వల్ల జిల్లా పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతుంది. లక్షలాది
ఉద్యోగాలు వస్తాయి. రోడ్లు, డ్రైనేజీ బాగుపడతాయి. కరువు, గిరువు
లాంటివేమన్నా ఉంటే ఒక్కదెబ్బతో పారిపోతాయి. తాగు, సాగునీటి
సమస్యలు వాటంతటవే పరిష్కారం అయిపోతాయి. అలాగే జిల్లాల వారీగా చంద్రబాబు
ఇచ్చిన వందలాది హామీలు కోట్లు ఖర్చు పెట్టి నెరవేర్చాల్సిన పని ఉండదు. పోర్టులు, విమానాశ్రయాలు, యూనివర్సిటీలు, ఆసుత్రులు
లాంటివేం లేకుండానే జిల్లాలు దేశంతో పోటీ పడి అభివృద్ధి చెందుతుంటాయి.

విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ లో స్వాతంత్ర్యదినోత్సవ
వేడుకలను కర్నూలులో జరిపారు ముఖ్యమంత్రిగారు. రాజధాని విషయంలో తర్జన
భర్జనలు జరుగుతున్న తరుణంలో సీమ వాసులకు ఆశలు కల్పించేలాగా కర్నూలులో ఆగస్టు 15 నిర్వహించారు. ఆ తర్వాత 2015లో విశాఖలో, 2016లో అనంతపురంలో, 2017లో తిరుపతిలో
పంద్రాగస్ట్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఏడాది శ్రీకాకుళంలో బాబుగారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఐదేళ్ల పాలనా కాలంలో
మూడు సార్లు రాయలసీమ జిల్లాల్లో, కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో చెరోసారీ నిర్వహించారు. అంటే రాష్ట్రంలో అన్ని
ప్రాంతాలను సమానంగా చూసి, సమదృష్టితో అభివృద్ధి చేసారన్నమాట. బాబుగారు స్వతంత్ర్య
దినోత్సవ వేడుకలు జరిపిన ప్రతి జిల్లా ఇప్పుడు పారిశ్రామిక, ఆర్థిక ప్రగతిలో ముందుకు
దూసుకుపోతోంది. కర్నూలు, అనంతపురంలో కరువే లేకుండాపోయింది. చిత్తూరులో వెంకటేశ్వర
స్వామి హుండీ ఆదాయం పెరిగి, నేల మాళిగనుంచి నిధుల సంగతులు బయటపడ్డాయి. విశాఖ నగరం హుద్ హుద్
తుఫాన్ కంటే ఎక్కువ సమావేశాలు, సమ్మెట్లను రుచి చూసింది. శ్రీకాకుళంలో ఫ్లైరైడ్
తగ్గిపోయి, ప్రజలు ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోష నగరాల జాబితాలో
ముందు వరసలో నుంచుండిపోయారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు కనుకే ఈ ఐదేళ్ల కాలంలో ఐదు స్వాతంత్ర్య
దినోత్సవ వేడుకల్లో ఐదు జిల్లాలను ఆఘమేఘాల మీద అభివృద్ధి చేయగలిగారు. ఆయన మరో తడవ ముఖ్యమంత్రి
అయి, ప్రతి సంవత్సరం స్వాతంత్ర్యదినోత్సవం జరిపితేనే మిగిలిన జిల్లాల
అభివృద్ధి సాధ్యం అవుతుందన్నమాట. పాపం ఆయన విశ్వ రాజధాని నగరమైన అమరావతిని కూడా కాదని ఇన్ని జిల్లాలను
అభివృద్ధి చేసారు. ఇదేదో కేంద్రాన్ని అమరావతి నిర్మాణానికి నిధుల కోసం యాచించకుండా, ఒక్కసారి స్వాతంత్ర్యదినోత్సవ
సంబరాలని అమరావతిలో జరిపేస్తే బావుండేది బాబుగారూ...ఈపాటికి
అమరావతి అద్భుతంగా అభివృద్ధి చెందిపోయి ఉండేది. ఆయన కోరుకున్న విధంగా
సిగ్నేచర్ టవర్స్, చిత్రగుప్తుడి టోపీ లాంటి సచివాలయం, బాహుబలి రాజప్రాసాదంలాంటి
హైకోర్టు, వెనిస్ సిటీ లాంటి వాటితో అమరావతి నదీతీర నగరం కన్నుల విందుగా, ప్రపంచ నగరాల సరసన
నిలబడి ఉండేది. పాపం ఏం చేస్తాం...సౌకర్యాలు లేని కారణంగా అమరావతిలో ఐదేళ్లలో
ఒక్కసారి కూడా ఆగస్టు 15 నిర్వహించలేకపోయారు బాబుగారు. అందుకే అమరావతి ఇంకా
భ్రమరావతిలా మిగిలిపోయింది.

 

తాజా ఫోటోలు

Back to Top