బాబు స్వార్థానికి విభజన హామీలు బలి


సీమాంధ్రవాసుల గుండెలు రగిలే సందర్భం ఇది. ఏమాత్రం ఇష్టం లేకుండా రాష్ట్ర విభజనకు ఒప్పుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి చంద్రబాబు పొడిచిన వెన్నుపోటు ఇది. మిత్రపక్షమైన బిజెపితో కలిసి ఆంధ్రప్రదేశ్ కు అన్ని విధాలా అవసరమైన సాయాన్నీ తెస్తానని ప్రగల్భాలు పలికిన టిడిపి అధినేత ఇప్పుడు నోరుమెదపడం లేదు. భాగస్వామ్య ఎన్డీయే మన రాష్ట్రానికి మొండి చేయి చూపినా పల్లెత్తు మాట అనడం లేదు. ఎన్నికల సభల్లో మోడీతో కలిసి వేదికలపై ఇచ్చిన హామీలు ఈరోజుకూ ఒక్కటి కూడా నెరవేరలేదు. ఇక నెరవేరతాయన్న ఆశకూడా లేదు. ఎందుకంటే ఎన్డీఎ హయాంలోని చివరి బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు చిల్లిగవ్వకూడా విదల్చలేదు. విభజన హామీల ఊసు అసలే లేదు.
బడ్జెట్ కేటాయింపుల్లో విభజన హామీలకు సంబంధించి సూచనప్రాయమైన అంశం కూడా లేకపోవడం చంద్రబాబు చేతకాని తనానికి నిదర్శనం. మిత్రపక్షమైన బిజెపితో కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తానన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రం నుంచి సాధారణ నిధులు, అటు విభజన హామీలు వేటినీ సాధించలేకపోయారు. ప్రపంచమంతా తనని గుర్తిస్తుందని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు ప్రతాపం ఇది.

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఉన్న హామీలపై బడ్జెట్ లో ఒక్క కేటాయింపూ లేదు. విభజన వల్ల నష్టపోతున్న రాష్ట్రంగా ఎపిని గుర్తించి ప్రత్యేకహోదా ఇస్తామన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వలేమని, అంతకంటే ఎక్కువ ప్రయోజనం పొందే ప్యాకేజీ ఇస్తామని అరుణ్ జైట్లీ చెప్పారు. దానికి తానా తందానా పాడిన చంద్రబాబు కోడలు మగబిడ్డను కంటానంటే వద్దంటామా అంటూ వింత వాఖ్యలు చేశారు. చివరకు ఈ బడ్జెట్లో ఆ ప్యాకేజీ ప్రస్తావన ఐనా రాకపోవడం విడ్డూరం. ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత గురించి మాట్టాడారు కానీ, ఆ ప్యాకేజీలోని ఒక్క అంశం కూడా బడ్జెట్ స్పీచ్ లో లేదు. ఇక విభజన చట్టంలోనే ఉన్న మరో హామీ ఆంధ్రప్రదేశ్ కి రెవెన్యూ లోటు ఉంటుంది కనుక దాన్ని పూడ్చడానికి సాయం చేస్తామనడం. ఎపికి మొదటి ఏడాది 7000కోట్ల రెవెన్యూ లోటు ఉండగా కేంద్రం అందులో కొర్రి పెట్టి ఇచ్చింది. చంద్రబాబు ఆ నిధులను రాబట్టుకోడంలోనూ విఫలం అయ్యారు. ఈ ఏడాది 12000 కోట్ల రెవెన్యూ లోటు ఉంది. కానీ బడ్జెట్ లో దీనిపై మాటమాత్రం స్సందించలేదు. అతిచిన్న అంశమైన విశాఖ రైల్వేజోన్ కు కూడా బడ్జెట్ లో చోటు దక్కలేదు. కనీసం కేంద్రంతో ఓ రైల్వేజోన్ ని కూడా సాంక్షన్ చేయించుకోలేని చంద్రబాబు గురించి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ‘’ఆంధ్రప్రదేశ్ కి ఏం ఫర్వాలేదు చంద్రబాబు ఉన్నారుగా’’ అన్నారట. ఓ చేతకాని ముఖ్యమంత్రి గురించి చేవలేని మీడియాలు కొన్ని ఊదిన బాకాలివి.

ఇనుప ఖనిజం నిక్షేపాలున్న కడపలో స్టీలు ప్లాంటు పెడతామని చెప్పారు. దాని గురించి కూడా బడ్జెట్లో ప్రస్తావనైనా రాలేదు. విభజనతో నష్టపోతున్న ఆంధ్రప్రదేశ్ కు అన్ని విధాలా సహకరిస్తామని టిడిపితో కలిసి ఎన్నికల సభలో మోడీ చేసిన వాగ్దానాన్ని నెరవేర్చమని అడిగే ధైర్యం కూడా చేయలేకపోయాడు చంద్రబాబు. విభజన చట్టంలోని మరో హామీ వెనుకడ్డ ప్రాంతాల అభివృద్ధికోసం, మౌలికవసతుల కల్పన కోసం ప్రత్యేక నిధులు కేటాయించడం. రాయలసీమలో నాలుగు, ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలను వెనుకబడ్డ జిల్లాలుగా గుర్తించారు. మొదట్లో 50కోట్లు తప్ప ఇంతవరకూ వాటికోసం ఏ కేటాయింపులూ లేవు. ఇక ట్రైబల్ యూనివర్సిటీ మాట ఎప్పుడో మర్చిపోయారనుకోవాలి. ఓటుకు నోటు కేసు, అసెంబ్లీ సీట్ల పెంపు వ్యవహారాలను కప్పిపుచ్చుకోడానికి ఢిల్లీకి సూట్ కేసులు పట్టుకుని తిరిగి, కోర్టుల్లో స్టేలు సంపాదించుకోవడమే తప్ప, రాష్ట్రానికి బాబు చేసిన మేలు లేదు. తన స్వప్రయోజనాలకోసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ను పణంగా పెట్టేశాడు చంద్రబాబు. రాజ్యాంగరీత్యా, చట్టరీత్యా, హక్కు రీత్యా ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన కేటాయింపుల్లో ఒక్కటికూడా సాధించలేకపోయిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నా ఒక్కటే, ప్రతిపక్షంలో ఉన్నా ఒక్కటే అనుకుంటున్నారు సీమాంధ్ర ప్రజలు. 

తాజా వీడియోలు

Back to Top