అవినీతి పాలనలో రాష్ట్రం అథోగతి పాలు

రాష్ట్రంలో అంతులేని అవినీతి కథ
టీడీపీ సర్కార్ భారీ కుంభకోణాలు
రెండేళ్లలోనే లక్షన్నర కోట్ల అవినీతి
ముక్కున వేలేసుకుంటున్న దేశం

చంద్రబాబు అవినీతిలో దూసుకుపోతుండడంతో రాష్ట్రం అధోగతి పాలవుతోంది. రెండేళ్ళలోనే చంద్రబాబు అండ్ కో అభివృద్ధి లక్షన్నర కోట్లకు చేరింది. రాష్ట్రాభివృద్ధి మాత్రం పాతాళానికి పడిపోయింది. దేశంలోనే ఏముఖ్యమంత్రి చేయని ఘోరాలు చంద్రబాబు చేస్తున్నాడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.  టీడీపీ అవినీతి బాగోతాన్ని విని యావత్ దేశం ఖంగుతింటోంది. మిగిలి ఉన్న మూడేళ్లలో  ఇంకెన్ని లక్షల కోట్లు మింగుతారోనని ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంతింతై వటుడింతై అన్నట్లు 24 నెలల్లో బాబు గారి బ్యాచ్ సాగించిన అవినీతి సునామీ అంతా ఇంతా కాదు.

టీడీపీ కుంభకోణాలు....ల్యాండ్ మాఫియా, సాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, సెక్స్ రాకెట్ మాఫియా, ఓటుకు కోట్లు స్కాం, ప్రాజెక్ట్ ల పేరుతో కోట్లాది రూపాయల స్కాంలు, పుష్కరాల్లో అవకతవకలు, పట్టిసీమ దోపిడీ, ప్రభుత్వ పథకాల్లో అవినీతి ఇలా చెప్పుకుంటూ పోతే బాబు కుంభకోణాల చిట్టా పద్దు చాంతడంత ఉంటుంది. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే చంద్రబాబు నవ్యాంధ్రను అవినీతిలో నంబర్ 1 గా ప్రపంచపటంలో పెట్టారు. అవినీతి రారాజుగా బాబు చరిత్ర సృష్టించారు. 

రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉందంటూ బీద అరుపులు అరుస్తూనే...రాష్ట్రాన్నినిలువునా దోచేస్తున్నారు. విచ్చలవిడిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని పచ్చనేతలు సాగిస్తున్న అరాచకాలు, అక్రమాలకు  అంతే లేకుండా పోతోంది. ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపిన నేతలపై అక్రమ కేసులు పెట్టడం, వేధించడమే పనిగా పెట్టుకున్నారు. అవినీతికి అడ్డొచ్చిన అధికారులపైనా దాడులకు తెగబడుతున్నారు. ఇందుకోసం అన్ని వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకొని రాజ్యాంగ విలువలకు తిలోదకాలిస్తున్నారు. 

బాబుగారి స్పెషల్ ఫ్లైట్ల ఖర్చే రాష్ట్ర ఖజనాకు తడిసి మోపెడు అవుతోంది. ప్రధాని రేంజ్ లో ప్రత్యేక విమానాల్లో విదేశాలు తిరుగుతూ బాబు కోట్లాది రూపాయలు దుబారా చేస్తున్నారు. ఇంత చేసి రాష్ట్రానికి ఏవైనా పెట్టుబడులు తెచ్చాడనుకుంటే అది గ్రహపాటే అవుతోంది. రాష్ట్రంలో సైతం ఎక్కడ ఏ 20 కిలోమీటర్ల దూరం వెళ్లినా బాబు హెలికాప్టర్ ను వాడుతున్నారు. అవినీతి వసూళ్ల కోసం చంద్రబాబు రాష్ట్రంలో హెలికాప్టర్ లు వేసుకొని తిరుగుతూ...ఆసొమ్మును విదేశాల్లో దాచుకునేందుకు విమానాల్లో దేశాలు పట్టుకు తిరుగుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. 

ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని నేరవేర్చని చంద్రబాబు...దాన్నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకు కుట్ర రాజకీయాలు సాగిస్తున్నారు.  ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై ఉద్యమిస్తున్న ప్రజల గొంతుక అయిన ప్రతిపక్ష వైఎస్సార్సీపీ గొంతు నొక్కేందుకు టీడీపీ బ్యాచ్ తెగ శ్రమిస్తోంది.  దానిలో భాగమే ఎమ్మెల్యేల కొనుగోళ్లు. పాలనను గాలికొదిలేసి సంత బేరాలు మొదలుపెట్టారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా దోచుకున్న అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనే కార్యక్రమం చేస్తున్నారు.  ఒక్కో ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయలు, మంత్రి పదవులు ఆశచూపి అప్రజాస్వామిక విధానాలకు పాల్పడుతున్నారు. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర పార్టీ ఎమ్మెల్యేలను వెంటబెట్టుకురావడం, చంద్రబాబు పచ్చకండువాలు కప్పడమే పాలన అన్నట్లు రాష్ట్రంలో అరాచకాలు కొనసాగుతున్నాయి. 

తాజా వీడియోలు

Back to Top