‌కష్టాలు వింటూ.. కన్నీరు తుడుస్తూ..

కాకినాడ:

డ్వాక్రా అక్కా, చెల్లెమ్మలకు అప్పుల ఊబి నుంచి విముక్తి కల్పించి కొత్త జీవితాన్ని ప్రసాదించేందుకు వారు తీసుకున్న డ్వాక్రా రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించానని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రోజే డ్వాక్రా రుణాల మాఫీ ఫైలుపై సంతకం చేస్తానన్నారు. అక్కాచెల్లెళ్ల కన్నీరు తుడుస్తాను అని శ్రీ జగన్మోహన్‌రెడ్డి మహిళలకు హామీ ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐదవ రోజు శుక్రవారం నాడు మండపేటలో శ్రీ వైయస్‌ జగన్ రో‌డ్‌షో నిర్వహించారు.

జనస్పందన వెల్లువెత్తడంతో ఐదు కిలోమీటర్ల శ్రీ జగన్ రోడ్‌షోకు పది గంటలకు పైగా సమయం పట్టింది. పట్టణ వీధుల్లో కిక్కిరిసిన జనసందోహం మధ్య రాత్రి 9 గంటల వరకు శ్రీ జగన్ పర్యటించారు. దారిపొడవునా‌ శ్రీ జగన్‌కు జనం బ్రహ్మరథం పట్టారు. మంగళహారతులు పడుతూ, పూలవర్షం కురిపిస్తూ, భారీ బాణసంచాతో జన నీరాజనాలు పలికారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో మండపేట రోడ్లన్నీ జనసునామీని తలపించాయి. దారి పొడవునా ప్రజలు శ్రీ జగన్‌ను కలిసి అధికారంలోకి రాగానే తమ కష్టాలు తీర్చాలంటూ పలు సమస్యలు చెప్పుకొన్నారు. రాబోయేది ప్రజల ప్రభుత్వమేనని శ్రీ వైయస్ జగ‌న్ వారికి భరోసా ఇచ్చారు.

ప్రతి మహిళా లక్షాధికారి :
మండపేటలోని మారేడుబాక సెంటర్‌లో బంధువుల ఇంటికి వచ్చిన పశ్చిమ గోదావరి జిల్లా రెడ్డిపోలవరానికి చెందిన పోలపర్తి సాయికుమారి స్థానిక డ్వాక్రా సంఘ సభ్యులతో కలిసి శ్రీ జగన్ దగ్గరకొచ్చారు. ‘అన్నా మీరు.. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెబుతున్నారు.. రోజూ టీవీల్లో చూస్తున్నాం’ అని అన్నారు. ‘రుణమాఫీ అనేది భారంతో కూడుకున్న పని. అయినప్పటికీ నా డ్వాక్రా అక్కాచెల్లెమ్మల కోసం వారు తీసుకున్న రూ.20వేల కోట్ల డ్వాక్రా రుణాలన్నింటినీ మాఫీ చేస్తానమ్మా. అంతేకాదు వడ్డీ లేని రుణాలిస్తాను. ఆ మహానేత కలలు కన్నట్టుగా ప్రతీ మహిళను లక్షాధికారిని చేస్తా. మీరంతా నిశ్చింతగా సంతోషంగా ఉండండి.. అదే నాక్కావాల్సింది’ అని‌ శ్రీ జగన్మోహన్‌రెడ్డి వారికి ధైర్యం చెప్పారు.

రోడ్ షో సాగుతు‌న్న సమయంలో ఎస్సీ కాలనీకి చెందిన ముమ్మిడివరపు నాగమణి అనే రెండు చేతులు, కాళ్లూ లేని వికలాంగురాలిని క్వాన్వాయ్‌పై నుంచే చూసిన శ్రీ వైయస్ జగ‌న్ వాహనం దిగి ఆమె దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. కనీసం రెండు చేతులూ ఎత్తి నమస్కరించలేకపోతున్నానంటూ ఆమె విలపించడంతో‌ శ్రీ జగన్‌ చలించిపోయారు. ‘అన్నా.. మీ నాన్న గారి దయ వల్ల మాకు రూ.500పింఛన్ వస్తోంది.. అయితే అది ఏ‌ మూలకూ సరిపోవడం లేదన్నా’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మరో రెండు నెలల్లో రాజన్న కలలుగన్న మన ప్రభుత్వం రాగానే మీ పింఛన్‌ను వెయ్యి రూపాయలకు పెంచుతానమ్మా అంటూ శ్రీ జగన్మోహన్‌రెడ్డి చెప్పడంతో ఆమె ఆనందంలో మునిగితేలింది.

ఎస్సీ కాలనీలోనే.. నిమ్మన మంగరాజు అనే వృద్ధుడు ఇంటి మెట్ల వద్ద వేచి చూస్తుండడాన్ని గమనించిన శ్రీ జగన్ వాహనం దిగి ఆయన వద్దకు వెళ్లి మాట్లాడారు. ఆయన బాగో‌గులు అడిగి తెలుసుకున్నారు. మార్గమధ్యంలో కలిసిన పలువురు వృద్ధులు పింఛను డబ్బులు సరిపోవడం లేదని చెప్పగా.. తమ ప్రభుత్వం రాగానే రూ.200 పింఛన్‌ను రూ.700 చేస్తామని శ్రీ జగన్ భరోసా ఇచ్చారు. రామాలయం‌ సెంటర్‌లో శ్రీ జగన్‌ను కలిసిన పలివెల జయసుశీల అనే మహిళ.. తన కొడుకు వెంకన్నకు రెండు కాళ్లూ లేవని, ఏమీ చేయలేని స్థితిలో ఇంటిలోనే ఉంటున్నాడని బోరున విలపించింది. ఆమె కన్నీరును తుడిచిన శ్రీ జగన్.. మన ప్రభుత్వం రాగానే ఆదుకుంటానని చెప్పారు.

రాజారత్న రోడ్‌లో వేమగిరి లోవమ్మ అనే మహిళ శ్రీ వైయస్ జగ‌న్‌ను కలిసి.. గతంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఒళ్లంతా కాలిపోయిందని, భర్త రిక్షా కార్మికుడు కావడం తో ఆర్థిక స్థోమత లేక వైద్యం చేయించుకోలేకపోతున్నానని  వాపోయింది. ముఖమంతా కాలిపోయి మాట్లాడేందుకు సైతం ఇబ్బందిపడుతున్న ఆమెను దగ్గరకు తీసుకొని ఓదార్చిన శ్రీ జగన్ ‘త్వరలోనే మన ప్రభుత్వం వస్తుంది. తప్పకుండా మీ కష్టాలు తీరుస్తా’నని ధైర్యం చెప్పారు. పూరి గుడిసెలో ఉంటున్న అన్నందేవుల పాపమ్మ వద్దకు వెళ్లిన శ్రీ జగన్‌ వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, రాజన్న రాజ్యంలో పింఛన్ పెంచుతామంటూ హామీ ఇచ్చారు.

న్యూకాలనీలో వారా సూర్యచంద్రశేఖర్, చిన్నారి దంపతులు తమ మొదటి సంతానమైన మూడు నెలల పసికందును తీసుకొచ్చి పేరు పెట్టి ఆశీర్వదించాలని ‌శ్రీ జగన్‌ను కోరారు. ఆ చిన్నారిని చేతిలోకి తీసుకొని శ్రీ జగన్ ముద్దాడి విజయమ్మ‌ అని పేరుపెట్టారు. వెన్నెముక దెబ్బతిని మంచానపడిన టేకి కుమారస్వామి ఇంటికి వెళ్లి శ్రీ జగన్మోహన్‌రెడ్డి పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. తనకు ఇద్దరు కుమార్తెలను పోషించడం చాలా ఇబ్బందిగా ఉందని, వారిద్దరికీ పెళ్లిళ్లు ఎలా చేయాలో అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. సూర్యచంద్రా పేపర్‌మిల్లు నుంచి ఎటువంటి పరిహారం అందలేదని చెప్పగా, మీకు కాబోయే ఎమ్మెల్యే గిరజాల వెంకట స్వామి నాయుడు అన్ని విధాలా సాయం అందిస్తారని చెప్పారు. పరిహారం సమస్యను పరిష్కరించాలని శ్రీ జగన్ ఆయనకు సూచించారు.

‌వైయస్ఆర్‌సీపీలో పలువురి చేరిక :
శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో విశాఖ జిల్లా పెందుర్తి మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి, కామత్‌రాజు, బిఎన్ పాత్రుడు, జహీరాబా‌ద్‌కు చెందిన మొయిద్దీన్ పార్టీలో చేరారు. వారికి‌ శ్రీ జగ‌న్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రోడ్ షోలో అమలాపురం పార్లమెంటరీ స్థానం అభ్యర్థి, ఎమ్మెల్యే పినిపే విశ్వరూప్, మండపేట కో‌ ఆర్డినేటర్ గిరజాల వెంకటస్వామి నాయుడు, మండపేట మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Back to Top