శ్రీమతి షర్మిల నల్గొండ పాదయాత్ర విజయవంతం

నల్లగొండ : వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల నల్గొండ జిల్లాలో చేసిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర విజయవంతగా పూర్తయింది. జిల్లాలోని మిర్యాలగూడ నియోజకవర్గం వాడపల్లి వంతెన మీదుగా శనివారం సాయంత్రం శ్రీమతి షర్మిల గుంటూరు జిల్లాలోకి ప్రవేశించారు. శ్రీమతి షర్మిల పాదయాత్ర నల్గొండ జిల్లాలో ఓ అపూర్వ ఘట్టానికి వేదికైంది. భారతదేశ చరిత్రలో ఏ మహిళా సాధించని ఘనత శ్రీమతి షర్మిల సాధించారు. వెయ్యి కిలోమీటర్లు పాదయాత్ర పూర్తిచేసిన మహిళగా ఆమె రికార్డు సాధించారు. ఈ అరుదైన రికార్డుకు నల్గొండజిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని కొండ్రపోల్ గ్రామం వేదికైంది.

నల్గొండ జిల్లాలో శ్రీమతి షర్మిల పాదయాత్ర నిర్వహించినన్ని రోజులూ వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ నాయకులు, శ్రేణులు పండుగ వాతావరణం‌లా గడిపారు. ఈ అపూర్వ పాదయాత్రను పురస్కరించుకుని శ్రీమతి షర్మిల ప్రభుత్వం, విపక్ష నేత చంద్రబాబుపై విమర్శల బాణాలు ఎక్కుపెడుతూనే స్థానిక సమస్యలపైనా దృష్టి పెట్టారు. దివంగత మహానేత డాక్టర్‌ వైయస్ రాజశేఖరరెడ్డి చేసిన అభివృద్ధి, చేపట్టిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూనే,‌ తన అన్న జగనన్నతో రాజన్న రాజ్యం సాధ్యమని పేర్కొన్నారు.

ఇవీ.. అడుగులు :
ఫిబ్రవరి 8వ తేదీన మాల్ బహిరంగ సభతో నల్గొండ జిల్లాలో మొదలైన‌ శ్రీమతి షర్మిల పాదయాత్ర 23వ తేదీన వాడపల్లిలో జరిగిన రచ్చబండతో ముగిసింది. మధ్యలో మూడు రోజుల పాటు ఎన్నికల కోడ్, బాంబు పేలుళ్ల మృతులకు సంతాప సూచకంగా ఆమె వాయిదా‌ వేసుకున్నారు. నల్గొండ జిల్లాలో 13 రోజుల పాటు శ్రీమతి షర్మిల 151.3 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఐదు నియోజకవర్గాల పరిధిలోని 9 మండలాల్లో 47 గ్రామాల గుండా యాత్ర సాగింది. 12 రచ్చబండ కార్యక్రమాలు, ఏడు బహిరంగ సభల్లో శ్రీమతి షర్మిల పాల్గొని ప్రసంగించారు.

పెండింగ్ ప్రాజెక్టులపై శ్రీమతి షర్మిల గళం :
దేవరకొండ నియోజకవర్గం మాల్‌లో తొలి బహిరంగ సభలో ప్రసంగించిన శ్రీమతి షర్మిల ఆ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న శిశువిక్రయాలపై ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని అరికట్టడంతో విఫలమైన ప్రభుత్వ అసమర్ధతపై విరుచుకుపడ్డారు. ఎస్ఎ‌ల్‌బిసి సొరంగం పనుల వేగం మందగించడాన్ని నిలదీశారు. ప్రధానంగా మునుగోడు నియోజకవర్గంలో మూడు రోజుల పాటు కొనసాగిన పాదయాత్రలో ఫ్లోరైడ్ సమస్యను ప్రముఖంగా ప్రస్తావించారు. మర్రిగూడ మండలం సరంపేటలో ఫ్లోరై‌డ్ బాధితులతో నేరుగా ముచ్చటించారు. దశాబ్దాలుగా జిల్లాను పట్టి పీడిస్తున్న ‌ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం ‌చిత్తశుద్ధిని ఆమె సూటిగా ప్రశ్నించారు. దివంగత సిఎం వైయస్‌ఆర్ పాలనా ‌కాలంలో ఈ ప్రాంతాలకు కృష్ణా జలాలను అందించేందుకు చేసిన కృషిని గుర్తుచేశారు. ఎస్ఎ‌ల్‌బిసి సొరంగం పనులు పూర్తిచేయడంతో పాటు, నక్కలగండి (డిండి) ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేయడమే ఈ సమస్యకు విరుగడని పేర్కొన్నారు.‌ మహానేత డాక్టర్ వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఉదయసముద్రం ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేయడానికి నిధులు విడుదల విషయంలో ప్రభుత్వం తీరును తప్పుపట్టారు. నాగార్జునసాగర్ ఎడమకాల్వపై ఉన్న ఎత్తిపోతల పథకాల నిర్వహణ బాధ్యతను విస్మరించిన ప్రభుత్వం చేతగానితనాన్ని ఎత్తిచూపారు.‌

అన్నదాతలకు అభయం:
నిత్యం కరవు భారిన పడుతూ, సాగునీటికి నోచుకోక అప్పుల పాలవుతున్న అన్నదాతలకు శ్రీమతీ షర్మిల భరోసా ఇచ్చారు. బత్తాయి రైతుల సమస్యలను పూర్తిస్థాయిలో తెలుసుకున్నారు. కనగల్‌లో ఎండిపోవడంతో కొట్టేసిన ఓ బత్తాయి తోటను పరిశీలించి రైతులతో ‌సాధక బాధకాలు అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ సౌకర్యం కల్పించని ప్రభుత్వ వైఫల్యంపై‌ ఆమె తీవ్రంగా ధ్వజమెత్తారు. సాగర్ ఆయకట్టు రైతుల కష్టాలను కళ్లారా చూశారు. అకాల వర్షానికి నష్టపోయిన పత్తి రైతులు తమ బాధలు చెప్పుకోగా ఓదార్చారు.‌

స్థానిక సమస్యలపైనా తక్షణ స్పందన :
రచ్చబండ కార్యక్రమాలు జరిగిన ప్రతిచోటా శ్రీమతి షర్మిల చాలా ఓపిగ్గా మహిళలు చెప్పిన సమస్యలన్నీ సావధానంగా విన్నారు. ప్రతిచోటా రైతులు, విద్యార్థులతోనూ మాట్లాడించి సమస్యలు తెలుసుకున్నారు. కొన్ని సమస్యలపై స్పందించి స్థానిక నాయకులకు పురమాయించారు. యాచారం రచ్చబండలో ఓ విద్యార్థినిని ఆమె చదువుకున్నన్ని రోజులు చదివిస్తానని హామీ ఇచ్చారు. మరో వికలాంగునికి ట్రైసైకిల్ ఇప్పించాలని పార్టీ నాయకులకు పురమాయించారు.

తాగునీటి సమస్యతో అల్లాడుతున్నామని గోడు వెళ్లబోసుకున్న దామరచర్ల మహిళల‌ు అండగా ఉండాలని, వెంటనే పంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా చేయాలని పార్టీ నాయకులకు శ్రీమతి షర్మిల సూచించారు. హాలియా బహిరంగ సభలో మంత్రి జానారెడ్డి పనితీరును ప్రశ్నించారు. తుంగపాడులో‌ మహానేత డాక్టర్ వైయస్‌ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ప్రసంగించారు. వెయ్యి కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా వై‌యస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ‌శ్రీమతి షర్మిల రక్తదానం కూడా చేశారు. 13 రోజుల పాటు జిల్లాలో సాగిన పాదయాత్రలో శ్రీమతి షర్మిల జిల్లాపై తనదైన ముద్ర వేశారు. పార్టీ నేతలు, శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. యాత్ర సాగింది అయిదు నియోజకవర్గాల పరిధిలోనే అయినా దాదాపు అన్ని నియోజకవర్గాల నాయకులు యాత్రలో పాల్గొనడం విశేషం.

తాజా వీడియోలు

Back to Top