ఏపీలో రెచ్చిపోతున్న ఇసుకబకాసురులు..!

రాజకీయనేతల కనుసన్నల్లో జోరుగా సాండ్ మాఫియా..!
మామూళ్ల మత్తులో అధికారగణం..!
రాత్రికి రాత్రే సరిహద్దులు దాటిస్తూ కోట్లు కొల్లగొడుతున్న వైనం..!

చంద్రబాబు పాలనలో ఇసుకమాఫియా మూడు పువ్వులు ఆరు కాయలన్నట్లు సాగుతోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని పాలకులు,వారి అండదండలతో  అధికారులు ఇసుకబకాసురులుగా అవతారమెత్తారు. పోలీసులు,ఉద్యోగులు...కిందిస్థాయి నాయకుల నుంచి మంత్రుల దాకా అందరూ భాగస్వాములై ఇసుకమాఫియాను నడిపిస్తూ రాష్ట్రాన్ని నిలువునా దోచేస్తున్నారు. అడిగేనాథుడే లేకపోవడంతో అందినకాడికి భోంచేస్తూ చెలరేగిపోతున్నారు.  నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా ఇసుకను తవ్వేస్తూ కోట్లు గడిస్తున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా ఒకే బిల్లుపై నాలుగైదు లారీలు లోడ్ చేస్తూ రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారు. ఫలితంగా  రాష్ట్రవ్యాప్తంగా రూ.వేల కోట్లు అక్రమార్కుల జాబితాల్లోకి వెళుతున్నాయి.

అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇసుక దోపిడీ..!
ఇసుక అక్రమ సామ్రాజ్యంలో  నలుగురు మంత్రులు, 36 మంది ఎమ్మెల్యేలు , ముగ్గురు ఎమ్మెల్సీలు,ఎంపీలు, జడ్పీచైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇంఛార్జ్ లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్ లు ఇలా  చాంతాడంత లిస్టే ఉంది. రాజకీయ నేతలు, అధికారుల ధనదాహానికి  హద్దులు లేకుండా పోతుంది. ఇప్పటిదాకా రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా 1.21 కోట్ల ఘ.మీ. ఇసుక విక్రయించగా..అనధికారికంగా తరలించింది 4 కోట్ల ఘ.మీ. పర్యావరణానికి హాని కలిగిస్తూ ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడుస్తూ ఇసుకబకాసురులు రెచ్చిపోతున్నారు. సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక కొనలేని పరిస్థితి నెలకొంది. ఇసుక కోసమే అదనంగా రూ. 50 వేల చెల్లించాల్సిన దుస్థితి ఉందంటే మాఫియా ఎంత జడలు విప్పుకుందో అర్థమవుతోంది. 

అవినీతి రాబంధులు..!
రాజకీయ నేతల కనుసన్నల్లో ఇసుకదందా యథేశ్చగా కొనసాగుతోంది. ఇసుక రేవులున్న ప్రతిచోట రాజకీయ రాబంధులు వాలుతూ  కొల్లగొడుతున్నాయి.  రోజుకు వందల కొద్ది ట్రాక్టర్లు పదుల కొద్దీ లారీలు, టిప్పర్లు ఇసుక రేవుల్లో తిరుగుతున్నా పట్టుకునేవారే కరువు. అక్రమంగా తరలుతున్న ఇసుకతో రేవులన్నీ ఒట్టిపోయి భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. నేలమ్మతల్లి తల్లడిల్లుతోంది. ప్రకృతి, ప్రకోపిస్తుంది. అక్రమార్జనే ధ్యేయంగా ఇసుకను స్వాహా చేస్తూ భవిష్యత్ తరాలకు ముప్పు కొనితెచ్చిపెడుతున్న ఇసుక బకాసురులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేకుండా ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నారు. 
Back to Top