అంతా విదేశీ మయం...!

హంగూ ఆర్భాటాలతో రాజధాని శంకుస్థాపనకు వ్యూహం..!
ప్రచార ఆర్భాటం కోసం రూ.50 కోట్లు ఖర్చు..!
గ్లోబల్ టెండర్లతో సీఆర్డీఏ సంప్రదింపులు..!

విజయవాడః ఏపీ సీఎం చంద్రబాబు ప్రజాసమస్యలను గాలికొదిలేసి హైటెక్ హంగుల కోసం పాకులాడుతున్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉందంటూనే ప్రమాణస్వీకారం మొదలు ప్రతి కార్యక్రమంలో రూ.కోట్లు కుమ్మరిస్తున్నారు. ఇప్పటికే రాజధాని నిర్మాణాన్ని విదేశీ కంపెనీలకు కట్టబెట్టిన చంద్రబాబు...దాని శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించేశారు. కేవలం ప్రచారం హంగులకోసమే చంద్రబాబు రూ. 50 కోట్లు ఖర్చు చేస్తుండంతో రాష్ట్రప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. 
 
శంకుస్థాపన కోసం విచ్చలవిడిగా ఖర్చు..!
అక్టోబర్ 22 రాజధానికి శంకుస్థాపన ముహూర్తంగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈకార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీతో పాటు సింగపూర్ ప్రధాని, జపాన్ వాణిజ్యశాఖా మంత్రిని కార్యక్రమానికి తీసుకొస్తున్నారు. ప్రపంచస్థాయి రాజధాని పేరుతో విదేశీయుల ముందు హంగూ ఆర్భాటాలు చేసేందుకు చంద్రబాబు ఉత్సూహకత చూపుతున్నారు.  శంకుస్థాపన ఈవెంట్ ను ఇంటర్నేషనల్ లెవల్లో నిర్వహించేందుకు తాపత్రయపడుతున్నారు. ఈక్రమంలోనే సీఆర్డీఏ గ్లోబర్ టెండర్లను పిలిచి సంప్రదింపులు మొదలుపెట్టింది. అంతర్జాతీయ స్థాయి ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థలతో చర్చలు జరిపింది. 

ప్రజాధనం దుర్వినియోగం..!
సీడ్ క్యాపిటల్ ప్రాంతంలోని వెంకటపాలెంలో 50 ఎకరాలను శంకుస్థాపన కార్యక్రమం కోసం సిద్ధం చేస్తున్న చంద్రబాబు..మరోసారి తన డాబు చూపించనున్నారు. శంకుస్థాపన  ప్రచారాన్ని అక్టోబర్ 1 నుంచే మొదలుపెట్టాలని నిర్ణయించారు. పత్రికలు, టీవీలు, సోషల్ మీడియాను  ఇందుకు ఉపయోగించుకోవాలని తహతహలాడుతున్నారు. అంతే కాదు అవసరమైతే హైదరాబాద్, విజయవాడతో పాటు ఢిల్లీ స్థాయిలో ఆడియోలు, వీడియోలను ప్రదర్శించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ప్రజాధనాన్ని అడ్డగోలుగా దుర్వినియోగం చేస్తుండడం పట్ల ప్రజలు, ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. రాజధాని శంకుస్థాపన పేరుతో  కోట్లాది రూపాయలు  ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం మాని రాష్ట్రాభివృద్ధికి ఉపయోగించాలని సూచిస్తున్నాయి. 

తాజా వీడియోలు

Back to Top