రాజధానిలో ఏం జరుగుతోందంటే..!

గుంటూరు: రాజధాని ప్రాంతంలో జరిగేది ఒకటి అయితే, ప్రచారం మరొకలా జరుగుతోంది. భూముల్ని లాక్కొనేందుకు బోలెడు హామీలు గుప్పించిన చంద్రబాబు ప్రభుత్వం అవన్నీ నెరవేర్చినట్లు చెప్పుకొంటోంది. వాస్తవంలో మాత్రం హామీలు అలాగే మిగిలి ఉన్నాయి.

రైతుల్ని బాగా ఆదుకొంటామని చెప్పిన ప్రభుత్వం పరిహారం విషయంలో దొంగ లెక్కలు కొనసాగిస్తోంది. అసైన్డ్ భూములకు పరిహారం ఇస్తామని చెప్పి 2, 040 ఎకరాలకు గాను 938 ఎకరాలకు మాత్రమే పరిహారం అందించారు. మిగిలిన భూములకు ఎగ్గొట్టారు. వివాదాలు ఉన్నాయని దొంగ లెక్కలు చెబుతున్నారు. లంక గ్రామాల్లో పరిహారం విషయమై ఇప్పటికీ స్పష్టత లేదు.

రైతు కూలీలకు నైపుణ్య శిక్షణ సంస్థలతో శిక్షణ ఇప్పిస్తామని నమ్మబలికారు. ఇందుకోసం మొత్తంగా 24 వేల మందికి అవకాశం కల్పిస్తామని గుర్తింపు ఇచ్చారు. 50 వేలకు పైగా కూలీలు ఉన్న చోట గుర్తింపు దక్కింది సగం లోపే. తీరా చూస్తే ఆరు వేల మందిని అర్హులుగా చెప్పారు. చివరకు 250 మందికి మాత్రం శిక్షణ ఇచ్చారు.

భూమిలేని నిరుపేదలకు పింఛన్ ఇస్తామని ఘనంగా ప్రకటించారు. లక్షమంది పైగా నిరుపేదలు ఉన్న చోట 50 వేల మందిదాకా అందుకొంటారని అంచనా కట్టారు. చివరకు 23, 500 మందికి పింఛన్ ఇస్తున్నట్లు కాగితాల మీద రాశారు. అంతిమంగా 13, 019 మందికి పింఛన్లు ఇచ్చారు.

అవకాశం లేని వారికి ఉపాధి హామీ పథకం ద్వారా ఆదుకొంటామన్నారు. ఇప్పటికీ దీనికి సంబంధించి అతీ గతీ లేదు. లక్షన్నర మంది ఉన్న చోట 30 వేల మందికి పనులు కల్పిస్తున్నట్లు రాసుకొన్నారు. చివరకు మొక్కల పెంపకానికి 1,980 మందిని మాత్రం ఎంపిక చేశారు.

ఇక ప్రజలకు ఉచిత వైద్యం, పిల్లలకు ఉచిత విద్య కల్పిస్తామని హామీలు గుప్పించారు. ఇప్పటి దాకా మార్గ దర్శకాలు కూడా విడుదల చేయలేదు. పేదలకు తక్కువ ధరకు ఆహారం అందించేందుకు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఒక్కటంటే ఒక్కటి కూడా ఈ ప్రాంతంలో తెరుచుకోలేదు.

 ఈ విధంగా రాజధాని ప్రాంత వాసులకు అందిస్తామని చెప్పిన హామీల్లో 90 శాతం దాకా అమలు కాలేదు. కానీ ప్రచారం మాత్రం నూటికి నూరు శాతం పూర్తి చేస్తున్నట్లుగా చెప్పుకొంటున్నారు. 
Back to Top