ప్ర‌జా స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ఎప్పుడు..!

ప్రజా సమస్యలపై తూర్పారబట్టిన ప్రతిపక్షం
దాటవేత  ధోరణితో బయటపడాలనుకున్న అధికార పక్షం
ఏరోజుకారోజు తప్పించుకునే ప్రయత్నం

హైద‌రాబాద్‌: ఏపీ అసెంబ్లీ సమావేశాలను టీడీపీ ప్రభుత్వం ‘మమ’ అనిపించింది. రాష్ట్రంలో  చాలా సమస్యలు ఉన్నాయని, అవి చర్చించడానికి కనీసం 15 రోజులైనా సభ కొనసాగాలని ప్రతిపక్ష నేత వై ఎస్ జ‌గ‌న్  కోరినా సర్కార్ పట్టించుకోకుండా ఐదు రోజులకే కుదించి ముగించేసింది. టీడీపీ ప్రభుత్వానికి ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదన్న విషయం మరో మారు రుజువైంది.
 
ప్రజా సమస్యలపై తూర్పారపట్టిన ప్రతిపక్షం
ప్రజలు కరువు కాటకాలతో అల్లాడుతున్నారని, వారిని ఆదుకోవడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ సీపీ విమర్శించింది.   550 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేసింది. వర్షాలు పడక, పంటలు వేసుకోలేక రైతులు ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందా అంటూ ప్రశ్నించింది. కరువు కారణంగా రైతులు అప్చలు పాలై  ఇప్పటి వరకు 197 మంది ఆత్మహత్య చేసుకుంటే ఒక్క అనంతపురంలోనే 101 మంది ఆత్మహత్య చేసుకున్నారని ప్రతిపక్షం గుర్తు చేసింది. పంటలు లేక, పనులు లేక లక్షల మంది   వలసలు వెళ్తున్నారని, ఒక్క అనంతపురంలోనే 4 లక్షల మంది వరకు   వలసలు వెళ్తుంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని ఆరోపించింది. 
 
పట్టిసీమతో ప్రయోజనం శూన్యం
పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి  వ్యతిరేకమని   ప్రతిపక్ష నేత వైఎస్ జ‌గ‌న్ ఇప్పటికే చాలా సార్లు చెప్పారు. అయినా కూడా టీడీపీ మాత్రం పట్టిసీమకు వ్యతిరేకమో.. అనుకూలమో  చెప్పాలని పట్టుపట్టడంలో అర్థమే లేదు. పట్టిసీమ  ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు, మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని  ఘంటాపథంగా చెబుతున్నారు.   రాయలసీమకు నీళ్లు అందిస్తామని గొప్పలు చెప్చకుంటున్న చంద్రబాబు జీవో నం-1లో రాయలసీమ పేరు పెట్టకపోవడాన్ని చూస్తే ఆయనకు సీమపై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోంది.  
 
ధరల స్థిరీకరణ ఏమైంది?
నిత్యావసర ధరలను అరికట్టడంలో టీడీపీ ఘోరంగా విఫలమైంది. ఈ విషయం అసెంబ్లీలో చర్చకు వచ్చిన నేపథ్యంలో సమాధానం చెప్చకోలేక తడబడింది.   ఎన్నికలకు ముందు రూ.1000 కోట్లతో  ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్చడు ఏం సమాధానం చెబుతాడని బాబును ప్రశ్నించింది.    
 
‘ప్రత్యేక హోదా’ విషయంలో  విజయం
ప్రత్యేక హోదా వద్దు.. ప్యాకేజీ ముద్దు అని టీడీపీ ముందుకెళ్తున్న సమయంలో ప్రతిపక్షం దానిని అడ్డుపడింది.  ప్రభుత్వం సహకరించకపోయినా ప్రత్యేక హోదాపై చర్చ జరిగితీరాల్సిందేనని పట్టుబట్టింది. రోజుకో మాట మాట్లాడుతూ ప్రజలను గందరగోళానికి గురి చేయోద్దని, ఇప్పటికైనా స్పష్టమైన ప్రకటన చేయాలని టీడీపీని డిమాండ్ చేసింది.  ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో చర్చించాలని, దాన్ని తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని పట్టిబట్టి విజయం సాధించింది.  
 
మాటిమాటికి మైక్ క‌ట్ 
ప్రతిపక్ష నేత వైఎస్ జ‌గ‌న్  లేచిన ప్రతిసారీ మైక్ క‌ట్ చేశారు. ఆయనను మాట్లాడనీయకుండా గొంతు నొక్కేశారు. ఐదు రోజులు అసెంబ్లీ సమావేశాలు 20 గంటల 29 నిమిషాలు జరిగితే ఏ రోజు కూడా కనీసం 20 నిమిషాల పాటు మైక్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఆ ఇచ్చిన కొద్ది సమయంలో కూడా టీడీపీ మంత్రులు అడ్డు తగలడం.. వ్యక్తి గత దూషణలకు దిగడం జరిగింది. 
 
బాబు మౌనం అర్ధాంగీకారమా?
‘ఓటుకు కోట్లు’ వ్యవహారం అసెంబ్లీ సమావేశాలను కుదిపేసింది. దీనిపై చర్చ జరగాలని వైఎస్సార్ సీపీ పట్టుబట్టింది.   పట్టిసీమ, రాజధాని భూములు,  సంపాదించిన నల్లడబ్బుతో ఒక ఎమ్మెల్యేను ప్రలోభపెడుతూ ఒక ముఖ్యమంత్రి రెడ్ హ్యాండెడ్‌గా దొరకడం దేశ చరిత్రలో ఇదే ప్రథమమని, దీనిపై చంద్రబాబు సమాధానం చెప్పాలని ప్రతిపక్షం డిమాండ్ చేసింది.  ఆ అంశంపై చర్చించడం కోసం వాయిదా తీర్మానం ఇస్తే తిరస్కరించారు. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి వచ్చి కూడా  అసెంబ్లీ జరుగుతున్నంతసేపు తన చాంబర్‌లో నుంచి బయటకు రాలేదు. 
 
సమస్యల నుంచి టీడీపీ పలాయనం
తెలుగుదేశం ప్రభుత్వం ప్రజా సమస్యలనుంచి తప్పికునేందుకు ప్రయత్నం చేసిందనేది అసెంబ్లీ చూసిన ఎవరికైనా అర్థమవుతుంది. ప్రతిపక్షం వేస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్చకోలేక పలాయనం చిత్తగించింది. సభను తూతూ మంత్రంగా నడిపి మమ అనిపించింది. పట్టిసీమ, పోలవరం తదితర  అంశాలపై ప్రతిపక్ష నేత జగన్  ప్రస్తావిస్తుండగా స్పీకర్ అడ్డుకున్నారు. కరువు, అధిక ధరలు, ఓటుకు కోట్లు విషయంలోనూ ప్రతిపక్ష నేతను మాట్లాడనీయకుండా అధికార పార్టీ సభ్యులు అడ్డు తగిలారు. దీంతో ప్రజా సమస్యలేవీ చర్చకు రాకుండానే సమావేశాలు ముగిశాయి.
Back to Top