టీడీపీ పలాయన మంత్రం

– బహిరంగ చర్చలకు భయపడుతున్న తెలుగు తమ్ముళ్లు
– చంద్రబాబు సహా వెనకడుగు వేసిన నాయకులు
– మీడియా ప్రతినిధులకూ సమాధానం చెప్పలేని స్థితిలో బాబు 

మన గురించి రాసే మీడియా ఉంది.. ఏం తప్పు మాట్లాడినా కవర్‌ చేయడానికి ముందుంటారు కదా అని కెమెరాల ముందుకొచ్చి ఎంతంటే అంత మాట్లాడటం.. కొండనైనా మోసుకొస్తామని గొప్పలు పోవడం టీడీపీ నాయకులకు అలవాటైపోయింది. టీవీ చర్చల్లో సవాళ్లు విసరడం.. ప్రతిపక్షం మీద ఒంటి కాలిమీద లేవడం తప్ప.. ఆరోపణలు నిరూపించుకునే సత్తా లేకుండా పోయింది. యథా రాజా తథా ప్రజా అన్నట్టు తెలుగు తమ్ముళ్లు కూడా చంద్రబాబు నాయుడిలాగే తయారయ్యారు. వైయస్‌ జగన్‌ ఆస్తుల విషయంలో పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సహా ఎంతో మంది టీడీపీ నాయకులు ఆరోపణలు చేశారు. ఆధారులుంటే బయటపెట్టాలని ఎన్నోసార్లు ప్రతిపక్ష నేత కూడా బహిరంగంగానే సవాల్‌ విసిరారు. అయినా ఏ ఒక్కసారి కూడా నిరూపించుకున్న దాఖలాలు లేనేలేవు. ఇటీవలే ఈడీ లిస్టులో పేరుందంటూ పచ్చ పత్రికల్లో పెయిడ్‌ వార్తలు రాయించి పొద్దున్నే దాని ఆధారంగా ఆరోపణలు గుప్పించారు. అంతకుముందే ఊరూ పేరూ లేని ఇంగ్లిషు పేపర్‌లోనూ వారే వార్తలు రాయించి ఇంగ్లిషు పత్రిక ఆధారంగా అంటూ తెలుగు పత్రికల్లో ఆధారాల్లేని ఓ చెత్త కథనాన్ని వండి వడ్డించారు. దాన్ని పట్టుకుని చంద్రబాబు రోడ్డక్కాడు. దీనిపై స్పందించిన జననేత ధీటు బదులిచ్చాడు. విదేశాల్లో ఒక్క రూపాయి పెట్టుబడి ఉన్నా రాజకీయాల నుంచి తప్పకుంటానని ప్రజా సంకల్పయాత్రలోనే ప్రజలందరి సాక్షిగా సవాల్‌ విసిరినా తెలుగుదేశం పార్టీ నుంచి స్పందన లేదు. 
బాబు దారిలోనే తెలుగు తమ్ముళ్లు..
రెండు రోజుల కిందట సత్తెనపల్లి వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు అంబటి రాంబాబుకి, విజయవాడలోని తెలుగుదేశం ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకి మధ్య మాటలయుద్ధం జరిగింది. ఓ ఛానెల్‌ నిర్వహించిన చర్చలో వారిద్దరూ వాదులాడుకున్నారు. రాష్ట్రంలో అసలు వృద్ధాప్య పెన్షన్ల అమలు సక్రమంగా లేదని అంబటి ఆరోపిస్తే.. వెంకన్న దానిని అడ్డుకునే ప్రయత్నం చేసారు. దమ్ముంటే ఒక్క కేసు చూపించు.. ఏదో విమర్శలు చేసేయడం కాదు.. అంటూ బుద్ధా వెంకన్న ఘాటుగా స్పందించారు.

దానికి అంబటి కూడా తగ్గలేదు. తన సత్తెనపల్లి నియోజకవర్గానికి వస్తే.. బోలెడు ఉదాహరణలు చూపిస్తా అన్నారు. ఆ సవాలును స్వీకరించిన వెంకన్న సత్తెనపల్లి బస్టాండు వద్దకు వచ్చేలా రెట్టించి పంతం కాశారు.
అయితే సత్తెనపల్లి దాకా వెళితే.. పరువుపోతుందని అధికార పార్టీ వారికి భయం పుట్టిందేమో.. తాముగా వెనక్కు తగ్గినట్లుగా కనిపించకుండానే.. పరువు పోయే ప్రమాదం రాకుండా కొత్త స్కెచ్‌ వేశారు. ఇద్దరు నాయకులు సత్తెనపల్లిలో కలవడం జరిగితే.. అల్లర్లు రేగుతాయనే అనుమానంతో పోలీసుల ద్వారా సాంతం ఆపించేశారు. వెంకన్నను విజయవాడలోనే నిలువరించిన పోలీసులు, అంబటి రాంబాబును గుంటూరులో గృహనిర్బంధం చేశారు.
వర్ల రామయ్య– సుధాకర్‌బాబు.. 
చంద్రబాబు ఆస్తుల మీద టీడీపీ సీనియర్‌ నాయకుడు వర్ల రామయ్య, వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు సుధాకర్‌బాబుల మధ్య కూడా చర్చ జరిగింది. టీవీ వేదికగా మాటల యుద్ధం జరిగింది. సవాళ్లు ప్రతిసవాళ్ల వరకు వెళ్లింది. ప్రత్యక్షంగా మాట్లాడాలని నిర్ణయించారు. చివరికి వర్ల రామయ్య బహిరంగ చర్చకు రాకుండా పలాయన మంత్రం పటించారు. 

కొలుసు పార్ధసారథి గృహనిర్బంధం 
మాజీ మంత్రి, వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు కొలుసు పార్థసారథి జన్మభూమి సమావేశానికి వస్తుండగా పోలీసులు గృహనిర్బంధం చేశారు. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా పోలీసులను ప్రయోగించి నిజం నోరు నొక్కుతున్నారు. 
బహిరంగ సభల్లోనూ అంతే..
బహిరంగ సభల్లోనూ టీడీపీ పైత్యం పతాకస్థాయిల్లో ఉంటుంది. అసెంబ్లీలో మైకులు కట్‌ చేసే సంస్కృతిని బహిరంగ సభలకు కూడా విస్తరింపజేశారు. సాక్షాత్తు చంద్రబాబు సమక్షంలోనే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎంపీల మైకులు కట్‌ చేశారు. ముచ్చుమ్రరి ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే ఐజయ్య మాట్లాడుతుండగా చంద్రబాబు మైక్‌ కట్‌ చేయించారు. నిజాలు బయటకు పొక్కకుండా చేయాలని ప్రజలందరి సాక్షిగా సిగ్గు ఎగ్గులు వదిలేసి వికృత చేష్టలకు దిగారు. ఇదే సాంప్రదాయాన్ని పైడిపాలెం, గండికోట ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా ఎంపీ అవినాశ్‌రెడ్డి మాట్లాడుతుండగా ముఖ్యమంత్రే స్వయంగా మైకు లాక్కోవడం జాతీయ మీడియాలోనూ విస్తృతంగా ప్రచారమైంది. చాలా సార్లు జర్నలిస్టుల సమావేశాల్లో కూడా చంద్రబాబే ప్రశ్నలడిగిన జర్నలిస్టులపై మండిపడిన సంఘటనలున్నాయి. మీడియాను అడ్డం పెట్టకుని తాము చెప్పాలనుకున్నది మాత్రమే చెప్పడం.. తమ ఆలోచనలను ప్రజలపై రుద్దడం అలవాటైంది. ప్రభుత్వ అవినీతిపై యుద్ధం చేస్తున్న సాక్షి మీడియాను కూడా కంట్రోల్‌ చేయాలనే దురుద్దేశ్యంతో ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుకు తెరతీశారు. ఫైబర్‌ గ్రిడ్‌ సాకారమైతే అంతా తాము అనుకున్నట్టు చేసుకోవచ్చని కుట్ర పన్నుతున్నారనేది ఓపెన్‌ సీక్రెట్‌. 
Back to Top