జన్మభూమికి జీరో మార్కులు

 
జన్మభూమి నిర్వహణ అంతా అధ్వాన్నంగా ఉందని ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ స్వయంగా బయటపెట్టారు. జన్మభూమి నిర్వహణకు సంబంధించి అన్ని జిల్లాలూ సి గ్రేడ్ లో ఉన్నాయని, మండలాలు సైతం సి గ్రేడ్ లోనే ఉన్నాయని తెలియజెప్పారు. లక్షలాదిగి వచ్చిన అర్జీల్లో పావు వంత కూడా పరిష్కారం కాలేదని తెలియజేసారు. 
జన్మభూమి టార్గెట్లు
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే జన్మభూమి  మన ఊరు అంటూ ఆర్భాటంగా మొదలు పెట్టిన కార్యక్రమం  ఈ రోజుకీ గాడిలో పడలేదు. గ్రామ కార్యదర్శి నుంచి ప్రధాన కార్యదర్శి వరకూ అందరూ ఒకే లక్ష్యంతో పని చేయాలని, సర్పంచ్ నుంచి సిఎమ్ వరకూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఉండాలని చంద్రబాబు ఆదేశించారు. వారం పదిరోజులకు ఓసారి క్షేత్ర స్థాయి పరిశీలన కూడా ఉండాలని అధికారులకు ఆర్డర్లేసారు. 20 అభివృద్ధి సూచికల ఆధారంగా గ్రామాలకు, మండలాలకు, జిల్లాలకు స్థాయిల వారీగా గ్రేడులు ఇస్తామని కూడా ప్రకటించారు. కానీ నాలుగేళ్లు గడిచినా కనీసం ఒక్క జిల్లా కూడా అనుకున్న స్థాయిలో అభివృద్ధికి నోచుకున్న పాపాన పోలేదు. ఒక్క మండలం కూడా 20 అభివృద్ధి సూచికలను తాకలేదు. అంటే రాష్ట్రంలో ఏ జిల్లా కూడా కనీస అభివృద్ధికి నోచుకోలేదని జన్మభూమి నివేదికలే ఖరాఖండీగా చెప్పేసాయన్నమాట. జిల్లాలకు కనీసం బి గ్రేడు కూడా రాలేదంటే జన్మభూమి కార్యక్రమమే లక్ష్యాన్ని అందుకోలేక చతికిలబడిందన్నమాట. ఆర్భాటంగా చంద్రబాబు ప్రచారం చేస్తున్న జన్మభూమి జీరో మార్కులతో అట్టర్ ఫ్లాపైందన్నమాట. 
జగ్గజ్జంత్రీ కమిటీలు
జన్మభూమి కమిటీల సభ్యుల పేరుతో చంద్రబాబు విచ్చలవిడిగా వదిలేసిన అధికార పార్టీ నేతలు గ్రామాల్లో మరో ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నాయి. వారికి అనుకూలమైన వారికి తప్ప ఇతరులకు ప్రభుత్వ పథకాలేవీ అందకుండా చేస్తున్నాయి ఈ జన్మభూమి కమిటీలు. ఊళ్లలో రౌడీ రాజ్యాన్ని తలిపించేలా జన్మభూమి కమీటీల మెంబర్లు ప్రవర్తిస్తున్నారని వేలాదిగా ఫిర్యాదులు అందుతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం దారుణం. కాంట్రాక్టులు దక్కించుకోవడం, నిధులు దారి మళ్లించడం, తప్పుడు పత్రాలతో బిల్లులు తెచ్చుకోవడం, ప్రతిపక్ష పార్టీ మద్దతు దారులపై దాడులు, దౌర్జన్యాలు, హత్యాకాండలతో గ్రామాలను గుప్పిట్లో పెట్టుకోవడం చేస్తున్నారు. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మల్లా ఉండాల్సిన పంచాయితీలు సైతం ఈ కమిటీల ఇనుప కాళ్ల కింద నలిగి నాశనం అవుతున్నాయి. 
దరఖాస్తుల వెల్లువ
గ్రామసభల్లో వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ ఫించన్ల కోసం వేలాదిగా దరఖాస్తులు వస్తున్నాయి. ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డుల కోసం పెట్టుకున్న అర్జీలకు దిక్కు లేకుండా పోతోంది. ఇక గ్రామాల్లో అభివృద్ధి పనుల గురించి చెప్పుకోవడానికైతే ఏమీ లేదు. ఉపాధి పనుల్లో అధికార పక్ష నేతలు అందినంత దండుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కూలీలకు నెలల తరబడి డబ్బులు ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నారు. రోడ్లు, చెరువుల మరమ్మత్తులు, నీటి పంపులు, పారిశుధ్యం ఇలా ఏ పనుల్లోనూ పురోగతి లేదు. ఇక పురపాలక సంస్థల పరిస్థితి కూడా అధ్వాన్నంగా ఉంది. ఆర్భాటాలకు, ప్రకటనలకు లక్షల్లో ఖర్చులు పెట్టడమే తప్ప మౌలిక వసతుల గురించి పట్టించుకున్ పాపాన పోవడం లేదు. పట్టణాల్లోనూ పాలకఫక్ష నేతల చేతులకే కాంట్రాక్టులు దక్కడం, 20 శాతం పనులు కూడా చేయకుండా మొబిలైజేషన్ అడ్బాన్సులు పుచ్చుకుని పనులను గాలికొదిలేయడం జరుగుతోంది. 
మాటలు ముత్యాలు పనులు మట్టిదిబ్బలు
ప్రతి గ్రామంలో వాటర్ మ్యాపింగ్ చేస్తామని, జల వనరుల సమాచారం ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తామన్నారు. ఎక్కడా ఈ వాటర్ మ్యాపింగ్ జరగలేదు. రెయిన్ గన్ ల పేరుతో కోట్లు ఖర్చు పెట్టి వాటిని కూడా సరిగ్గా నిర్వహించలేదు. కొత్త ఫింఛన్ల కోసం దరఖాస్తులు తీసుకుని వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. కాని ఉన్న ఫించన్లనే రకరకాల కొర్రీలు పెట్టి కోతలు పెట్టారు. ఎన్టీఆర్ గృహవసతి లబ్దిదారులను ఎంపిక చేసి ఇళ్లు నిర్మిస్తామన్నారు. ఇంత వరకూ ఒక్క ఇల్లూ కట్టి పేదలకు అందించలేదు. గ్రామాల్లో ప్రతిరోజూ 3కి.మీల మేర రహదారుల నిర్మాణం చేస్తూ, వాటిని పర్యవేక్షించి, పనుల పురోగతిని రోజువారీ నివేదికలు అందిస్తామన్నారు. కొత్త రోడ్లు సాంక్షనే చేయకుండా తిప్పుకుంటున్నారు. ఏళ్ల తరబడి గిరిజన గ్రామాలకు సరైన రోడ్డు సదుపాయం లేనేలేదు. 
ఊరూరా నిరసనలే
నాలుగేళ్లుగా జన్మభూమి అర్జీలు పరిష్కారం కాలేదని, మళ్లీ ఏ ముఖం పెట్టుకుని వచ్చి గ్రామ సభలు పెడుతున్నారని నేతలు, అధికారుల ముఖానే అడుగుతున్నారు ప్రజలు. కొన్ని ఊళ్లలో అయితే జన్మభూమి అక్కర్లేదని, గ్రామసభలు పెట్టొద్దని, ఎవ్వరూ మా ఊరికి రావద్దని బోర్డులుకూడా రాసి పెట్టారు. నాలుగేళ్లుగా ఇచ్చిన దరఖాస్తులను ఎందుకు పరిష్కరించట్లేదని, అర్హులకు కూడా పథకాలు ఎందుకు అందడం లేదని ప్రశ్నించే ప్రజలను, ప్రతిపక్ష నేతలను గ్రామ సభల నుంచి బలవంతంగా గెంటేస్తున్నారు. అవినీతిపై ప్రశ్నిస్తున్న వారిని అణిచి వేస్తున్నారు. అయినా సరే ప్రభుత్వ దమన చర్యలు ప్రతి గ్రామం ఎదిరిస్తోంది. ప్రతిపక్ష నేత అందిస్తున్న స్థైర్యాన్ని అండగా చేసుకుని అన్యాయాన్ని అడుగడుగునా ప్రశ్నిస్తోంది. జన్మభూమి గ్రామ సభల్లో అధికార పార్టీకి పగలే చుక్కలు చూపిస్తున్నప్రజల ఎదురుదాడి ప్రభుత్వం పై వారికున్న వ్యతిరేకతను ప్రస్పుఠంగా ప్రకటిస్తోంది. 
 

తాజా వీడియోలు

Back to Top