కాపుల్ని ఇరుకున పెడుతున్నారా..!

ఎన్నికలకు ముందు వాడుకోవటం,
ఎన్నికల తర్వాత వదిలేయటం చంద్రబాబుకి తెలిసినంతగా మరెవరికీ తెలియదు. తాజాగా
కాపులతో వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఆ సంగతి నిర్ధారణ అవుతోంది.

ఎన్నికలకు ముందు చంద్రబాబు
నాయుడు కాపులకు బలంగా వల వేశారు. కాపుల్ని ఉప ముఖ్యమంత్రిని చేస్తామని, ఆరు నెలల
తిరగకుండానే రిజర్వేషన్లు కల్పిస్తామని హామీలు గుప్పించారు. కార్పొరేషన్ ఏర్పాటు
చేస్తామని, ఆర్థికంగా ఆదుకొంటామని హామీ ఇచ్చారు. ప్రచారాన్ని మోత ఎక్కించటంతో
కాపుల ఓటు బ్యాంక్ ను తమ ఖాతాలో వేసుకొన్నారు. ఎన్నికలు పూర్తయ్యాక ఒక్కొక్క
హామీను అటక ఎక్కించటం మొదలు పెట్టారు.

ఎప్పటికీ రిజర్వేషన్ల సంగతి
ప్రస్తావించక పోవటం, నిదులు కేటాయించక పోవటంతో కాపుల్లో అసంత్రప్తి రాజుకోసాగింది.
ఈ లోగా వంగవీటి రంగా హత్యలో చంద్రబాబుకి ప్రమేయం ఉందని వార్తలు గుప్పుమనటం, రిజర్వేషన్ల
అంశాన్ని చెట్టు ఎక్కించారని బయట పడటంతో కాపు వర్గాలు బహిరంగంగానే
తిట్టిపోయసాగారు. దీంతో చంద్రబాబు తనదైన మార్కు రాజకీయాన్ని ఉపయోగించారు.

కాపు రిజర్వేషన్ల పరిశీలన
కోసం ఒక కమిషన్ ను వేస్తున్నట్లు ప్రకటించారు. అంటే ఒక రిటైర్డ్ జడ్జి గారిని
పిలిపించి, ఆయన కు అధ్యయనం బాధ్యతలు అప్పగిస్తారు. కమిషన్ అంటే 2,3 ఏళ్ల పాటు
అధ్యయనాలు, పరిశీలను జరుగుతూనే ఉంటాయి. అందుచేత వీలున్నప్పుడల్లా రిజర్వేషన్లకు
కట్టుబడి ఉన్నాం, త్వరలోనే కమిషన్ రిపోర్టు అంటూ ఊరిస్తూ కాలం గడిపేయవచ్చు.

కాపుల కోసం కార్పొరేషన్
అనిచెప్పి క్రిష్ణా జిల్లాలో తమ పార్టీ నాయకుడికి పదవి కట్టబెట్టారు. ఈ పేరుతో
తెలుగు తమ్ముళ్లకు ఉపాధి కల్పించేందుకు తలుపులు బార్లా తీశారు. అటు, కాపుల సామాజిక
వర్గం నుంచి నిమ్మకాయల చినరాజప్పను ఉప ముఖ్యమంత్రిని చేసి, హోమ్ మంత్రిగా
నియమించారు. పేరుకి ఆయన్ని హోమ్ మంత్రిగా చేసినా ఆయనకు ప్రాధాన్యం లేకుండా
డీజీపీని, పోలీసు యంత్రాంగాన్ని స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయం నడిపిస్తోందన్నది
బహిరంగ సత్యం.

మొత్తం మీద ఎన్నికలు
అయ్యేంత వరకు కాపుల్ని బాగా ఉపయోగించుకొన్న చంద్రబాబు..  ఆ తర్వాత వాళ్లను పూర్తిగా వదిలేశారన్న మాట
బలంగా వినిపిస్తోంది. 

Back to Top