గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం

()హోదా కోసం వైయస్సార్సీపీ అలుపెరగని పోరు
()కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల నయవంచనపై ఉద్యమం
()ప్రజలతో మమేకమై రెండున్నరేళ్లుగా జననేత పోరాటం
()ధర్నాలు, రాస్తారోకోలు, దీక్షలు, బంద్‌లు, నిరసనలు
()నిరవధిక నిరాహార దీక్ష..యువభేరి సదస్సులు

రెండున్నరేళ్లుగా ఆంధ్రుల భవిష్యత్తుకోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎనలేని పోరాటాలు చేస్తోంది. ప్రజలతో మమేకమై ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న ప్రభుత్వంపై రాజీలేని పోరాటం కొనసాగిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రుల జీవనాడి, సంజీవని అయిన ప్రత్యేకహోదా కోసం వైయస్సార్సీపీ ఆది నుంచి దిక్కులు పిక్కటిల్లేలా నినిదిస్తూ వస్తుంది. హోదా కోసం ముందువరుసలో ఉండి నిజాయితీగా పోరాటం కొనసాగిస్తున్న ఏకైక పార్టీ వైయస్సార్సీపీ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ఇచ్చిన ప్రత్యేకహోదా హామీని నెరవేర్చాల్సిందేనని గల్లీ నుంచి ఢిల్లీ దాకా గర్జించింది. ధర్నాలు, దీక్షలు, బంద్ లతో ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యపరుస్తూ...యువభేరి సదస్సుల ద్వారా యువతకు హోదా ప్రాముఖ్యతను చాటిచెప్పుతూ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మొక్కవోని దీక్షతో ఉద్యమిస్తున్నారు. 

ప్రజల ఆకాంక్షను వివిధ రూపాల్లో వైయస్ జగన్ బృందం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లింది. ధర్నాలు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలు, నిరసనలు.. విలైనన్ని మార్గాల్లో పోరాటం సాగించింది. విభజన హామీల్లో ప్రధానమైన ప్రత్యేక హోదా సాధన విషయంలో అధికార టీడీపీ మొద్దునిద్ర పోతుంటే ప్రతిపక్ష నేతగా వైయస్ జగన్ గళమెత్తారు. అడ్డగోలు విభజన వల్ల అన్ని విధాలా నష్టపోయిన ఏపీ సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేక హోదా ఒక్కటే మార్గమని ఎలుగెత్తి చాటారు. ముఖ్యమంత్రి స్థానంలో వ్యక్తి ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా, హోదాతోనే అన్నీ అయిపోతాయా, హోదాతోనే రాష్ట్రం స్వర్గం అవుతుందా అంటూ ఎద్దేవా చేసినా మొక్కవోని విశ్వాసంతో వైయస్ జగన్ ముందుకు కదిలారు. వైయస్సార్సీపీ వస్తున్న ప్రజాధారణ చూసి ఓర్వలేక జననేత పోరాటాలను అడ్డుకునేందుకు బాబు అనేక కుట్రలు చేశారు.  ఐనా ఇచ్చిన మాట కోసం మడమ తిప్పకుండా వైయస్ జగన్ తన పోరాట పంథాను కొనసాగిస్తున్నారు. 

వైయస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి 2015 ఆగస్టు 10న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఒక రోజు ధర్నా చేశారు. రాష్ట్ర ప్రజల ప్రత్యేక హోదా ఆకాంక్షను జాతీయ స్థాయిలో చాటి చెప్పారు. అదే రోజు మార్చ్‌ టు పార్లమెంట్‌ను నిర్వహించి ఢిల్లీ వీధుల్లో అరెస్టయ్యారు. ప్రత్యేక హోదా– ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఆగస్టు 29న ఆంధ్రప్రదేశ్‌ బంద్‌ను విజయవంతంగా నిర్వహించారు.

ఏడు రోజుల తర్వాత దీక్ష భగ్నం
రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదేమోనన్న ఆందోళనతో తిరుపతిలో మునికోటి అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడడం యావత్‌ రాష్ట్రాన్ని కుదిపి వేసింది. మరో ముగ్గురు కూడా ఆత్మాహుతికి పాల్పడ్డారు. వారి కుటుంబాలను వైయస్‌ జగన్‌ పరామర్శించారు. హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి తానే స్వయంగా నిరవధిక నిరాహార దీక్షకు పూనుకుంటానని ప్రకటించారు.

తిరుపతిలో 2015 సెప్టెంబర్‌ 15న, విశాఖపట్నంలో అదే నెల 22న యూనివర్సిటీ విద్యార్థులు, యువకులతో యువభేరి సదస్సులను నిర్వహించారు. ప్రత్యేక హోదాపై వారిని జాగృతం చేశారు. గుంటూరు జిల్లాలో అక్టోబర్‌ 7వ తేదీ నుంచి నిరవధిక నిరాహార దీక్షకు పూనుకున్నారు. ప్రజల నుంచి భారీ స్పందన వస్తున్న నేపథ్యంలో ఏడు రోజుల అనంతరం అక్టోబర్‌ 14న వైయస్ జగన్‌ దీక్షను ప్రభుత్వం భగ్నం చేసింది. దీక్ష భగ్నం తరువాత కూడా వైయస్ జగన్‌ యువభేరీలను నిర్వహిస్తూ ప్రత్యేక హోదా ఆవశ్యకతను చాటి చెబుతూ వచ్చారు. 2016 జనవరి 27న కాకినాడలో, ఫిబ్రవరి 2న శ్రీకాకుళంలో యువభేరీ సదస్సులు నిర్వహించారు.

కేంద్ర మంత్రులతో భేటీలు
నరేంద్ర మోదీ ప్రధానిగా పదవి చేపట్టడానికి ముందే 2014 మే19వ తేదీన వైయస్‌ జగన్‌ తమ పార్టీ ఎంపీలను వెంట తీసుకెళ్లి కలిశారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని విజ్ఞప్తి చేశారు. 2015 మార్చిలో మరోసారి ఎంపీలతో ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ప్రత్యేక హోదా అవసరాన్ని గుర్తు చేశారు. ఈ ఏడాది జూన్‌ 9న కూడా ఢిల్లీలో రాష్ట్రపతిని కలిసి ఇదే అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. 2015 ఫిబ్రవరి, మార్చి, జూన్‌ మాసాల్లో ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సమావేశమై ఏపీకి ప్రత్యేక హోదాతోపాటు పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని పెండింగ్‌ అంశాలు అమలు చేయాలని, రాష్ట్రానికి రావాల్సిన నిధులు త్వరగా విడుదల చేయాలని కోరారు.

ప్రత్యేక హోదా 20 ఏళ్లు కావాలి
ఎన్నికల అనంతరం వైయస్సార్‌సీ పార్లమెంటరీ పార్టీ నాయకుడి హోదాలో మేకపాటి రాజమోహన్‌రెడ్డి లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ... ఏపీకి 20 ఏళ్లపాటు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్‌ చేశారు. గతేడాది మే నెలలో పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా వైయస్సార్‌సీపీ ఎంపీలందరూ అక్కడి గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. గత జూన్‌ 3, 4 తేదీల్లో మంగళగిరిలో వైయస్ జగన్‌ రెండు రోజులపాటు దీక్ష చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని గట్టిగా డిమాండ్‌ చేశారు. ఆ తరువాత ప్రతి సందర్భంలోనూ, ముఖ్యంగా అసెంబ్లీలో పలుమార్లు ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై గట్టిగా పోరాడాలని వైయస్ జగన్‌ ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. 2016 ఫిబ్రవరి 23, 24 తేదీల్లో ఢిల్లీకి వెళ్లిన జగన్‌ రాష్ట్రపతిని, కేంద్ర హోంమంత్రిని కలిసి ప్రత్యేక హోదా ఆవశ్యకతను మరోసారి గుర్తు చేశారు. ప్రత్యేక హోదా కావాలంటూ వినతిపత్రాలు సమర్పించారు.

ప్రైవేట్‌ బిల్లుకు మద్దతు
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని పార్లమెంట్‌లో ఆర్థిక శాఖ సహాయమంత్రి జయంత్‌ సిన్హా తేల్చి చెప్పడంతో ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు మే 10న రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేయాలని వైయస్సార్‌సీపీ పిలుపునిచ్చింది. 2016 జూలై 21న రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేట్‌ బిల్లుకు మద్దతు తెలిపింది. జూలై 23న వైయస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రత్యేక హోదా కోరుతూ లోక్‌సభలో ప్రైవేట్‌ బిల్లును ప్రతిపాదించారు. ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని రాజ్యసభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ చేసిన ప్రకటనను నిరసిస్తూ ఆగస్టు 2వ తేదీన రాష్ట్ర బంద్‌కు వైయస్‌ జగన్‌ పిలుపునిచ్చారు. ఆగస్టు 2వ తేదీన బంద్‌ విజయవంతంగా జరిగింది. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రత్యేక హోదా ఒక్కటే పరిష్కార మార్గమని, ప్రత్యేకహోదా సాధించేవరకు విశ్రమించేది లేదని  వైయస్సార్‌సీపీ పోరాటం కొనసాగిస్తోంది. 
Back to Top