ఏపీ హక్కు.. ప్రత్యేక హోదా

* నమ్మించి మోసం చేసిన బీజేపీ..టీడీపీ
* పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీకి తూట్లు
* హోదాకంటే ప్యాకేజీతోనే ప్రయోజనమంటూ బాబు అబద్ధాలు
* ఏపీకి స్పెషల్‌ స్టేటస్‌ కోసం పోరాడుతున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌
* మూడేళ్లుగా పలు పోరాటలు..ధర్నాలు.. బంద్‌లతో నిరసనలు
* తాజాగా 26న అన్ని జిల్లాల్లో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టాలని వైయస్‌ జగన్‌ పిలుపు

ఎన్నికల ముందు ఏపీకి 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు ప్రత్యేక హోదా తెస్తామన్న టీడీపీ.. ఇస్తామన్న బీజేపీలు అధికారంలోకి రాగానే మాట తప్పాయి. 5 కోట్ల ఆంధ్రులను నమ్మించి మోసం చేశాయి. తిరుపతి వెంకన్న సాక్షిగా చెబుతున్నాం.. ప్రత్యేక హోదా టీడీపీ, బీజేపీతోనే సాధ్యమని చెప్పి  ప్రజలకు పంగనామాలు పెట్టాయి. ఆంధ్రులను  మోసం చేసిన ప్రభుత్వాలపై వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇప్పటికే పలు పోరాటాలు.. ధర్నాలు చేశారు. రాష్ట్ర బంద్‌లకు పిలుపునిచ్చారు. తాజాగా అన్ని జిల్లాల్లో కొవ్వొత్తుల ప్రదర్శన చేయాలని, ఈ కార్యక్రమంలో పార్టీలకతీతంగా అందరూ పాల్గొని ప్రత్యేక హోదా ఆకాంక్షను తెలియజేయాలని కోరారు. మాట తప్పిన ప్రభుత్వాలపై పోరాటం చేద్దాం.. ప్రత్యేక హోదా సాధించుకుందామని వైయస్‌ జగన్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను అప్పటి అధికార, ప్రతిపక్షాలు వాళ్ల సొంత లాభాల కోసం రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేశాయి. హైదరాబాద్‌ వంటి నగరం ఆంధ్రప్రదేశ్‌కు లేదు కాబట్టి ఏపీకి 5 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తున్నామని నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ రాజ్యసభలో ప్రకటన చేశారు. ఆ ప్రకటనకు కేంద్ర కేబినెట్‌ మార్చి 2న ఆమోదం తెలిపింది. అయితే అప్పటి ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ తాము అధికారంలోకి వస్తే ఏపీకి 5 ఏళ్లు కాదు.. 10 ఏళ్లు ప్రత్యేక హోదా  ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టుకుంది. ఏపీలో టీడీపీ కూడా తాము అధికారంలోకి ఏపీకి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పి టీడీపీ మేనిఫెస్టోలో పెట్టుకుంది. అయితే ఈ రెండు పార్టీలు కూడా అధికారంలోకి వచ్చాయి కానీ ప్రత్యేక హోదాను మాత్రం పట్టించుకోవడం మానేశాయి. మూడేళ్లు కావస్తున్నా ప్రత్యేక హోదా ఊసే ఎత్తడం లేదు. పైగా ప్రత్యేక హోదాతో ఏం ప్రయోజనం.. హోదాకు మించిన ప్యాకేజీ ఇస్తామంటూ ప్రజలను మోసం చేస్తున్నాయి. 

మోసం చేసిన ప్రభుత్వాలపై వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌ పోరాటం
పార్లమెంట్‌సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తున్నామని చెప్పిన హామీ కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గత మూడేళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తూనే ఉంది. గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయికి ఉద్యమాన్ని తీసుకెళ్లింది. అంతేకాదు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా ఆవశ్యకతను తెలియజేసేందుకు, విద్యార్థుల్లో చైతన్యం నింపేందుకు ‘‘యువభేరి’’ కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రత్యేక హోదా వల్ల కలిగే లాభాలను విద్యార్థులకు తెలియజేశారు. అంతేకాదు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ వైయస్‌జగన్‌ తమ పార్టీ ఎంపీలతో ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిశారు. పార్లమెంట్‌ జరిగే సమయంలో వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌ఎంపీలతో ధర్నాలు చేయించారు. మంగళగిరిలో రెండు రోజుల సమర దీక్ష కూడా  చేశారు. పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. రాష్ట్ర బంద్‌లకు పిలుపునిచ్చారు. అయినా ప్రభుత్వాల్లో చలనం లేదు. 

హోదా వచ్చే వరకు పోరాటం..
ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాటం చేస్తూనే ఉంటామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అంటున్నారు. తాజాగా ప్రత్యేక హోదాను కోరుతూ అన్ని జిల్లాల్లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించాలని పార్టీ శ్రేణులకు, ప్రత్యేక హోదాను కోరుకునే ప్రతి ఒక్కరికీ ఒక ప్రకటన ద్వారా పిలుపునిచ్చారు. 13 జిల్లాల కేంద్రాల్లో  సాయంత్రం 6 గంటలకు జరిగే  కొవ్వొత్తుల ప్రదర్శనను విజయవంతం చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరగాలంటే ప్రత్యేక హోదాతోనే సాధ్యమని, హోదా సాధించుకునేందుకు పార్టీలకతీతంగా అందరం కలిసి కట్టుగా నడిచి హోదాను సాధించుకుందామని వైయస్‌ జగన్‌ పిలుపునిచ్చారు.

ఏపీకి హోదా.. సంజీవని 
సాధారణంగా రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే గ్రాంట్లు 30 శాతానికి మించి ఉండవు. అంటే ఏ పథకం, కార్యక్రమం చేపట్టినా.. కేంద్రం గ్రాంట్‌ పోనూ మిగతా 70 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. అదే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే కేంద్ర గ్రాంట్‌ 90 శాతం అందుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 10 శాతం భరిస్తే చాలు.ఒకవేళ ఆ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకోలేని పరిస్థితి ఉంటే.. అప్పుడు కూడా కేంద్రమే సమకూరుస్తుంది. కేంద్రం గ్రాంట్‌గా ఇచ్చే ఏ నిధి కూడా తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సత్వర సాగునీటి ప్రయోజనం (ఏఐబీపీ) కింద మంజూరైన ప్రాజెక్టులకు కూడా ఇదే వర్తిస్తుంది. 90 శాతం నిధులను కేంద్రమే భరిస్తుంది. 

హోదా వస్తే పరిశ్రమలు క్యూ కడతాయి..
రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే పారిశ్రామిక యూనిట్లకు 100 శాతం ఎక్సైజ్‌ డ్యూటీ మినహాయింపు లభిస్తుంది. దీంతో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి పారిశ్రామికవేత్తలు, ఔత్సాహికులు ముందుకు వస్తారు. పారిశ్రామిక వృద్ధి  వేగవంతం కావడానికి ఇది దోహదం చేస్తుంది. ప్లాంట్లు, యంత్రాల మీద పెట్టే పెట్టుబడిలో 30 శాతం రాయితీ లభిస్తుంది. కొత్తగా ఏర్పాటయ్యే పరిశ్రమలతో పాటు, ప్రత్యేకహోదా ప్రకటన నాటికే ఏర్పాటై.. ఆ తర్వాత విస్తరణ చేపట్టిన పరిశ్రమలకు కూడా ఇది వర్తిస్తుంది. మధ్య, చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు ఇలాంటి రాయితీలు పనికి వస్తాయి. పరిశ్రమల ఏర్పాటుకు తీసుకునే వర్కింగ్‌ క్యాపిటల్‌పై 3 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. పరిశ్రమలకు 20 ఏళ్ళకు తగ్గకుండా విద్యుత్‌ ఛార్జీలపై 50 శాతం రాయితీ లభిస్తుంది.  ఇవే కాకుండా ఇన్సూరెన్స్, రవాణా వ్యయంపైనా రాయితీలు ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ తరహా పరిశ్రమలు భారీగా వస్తాయి. గ్రామీణ యువతకు, మహిళలకు ఉపాధి పెరుగుతుంది. నిరుద్యోగ సమస్య తీరుతుంది.

Back to Top