సదావర్తిలో చంద్రబాబుకు షాక్‌

– వేలం నిర్వహించాలని కోర్టు ఆదేశం
– పట్టుబట్టి నెగ్గించుకున్న ఎమ్మెల్యే ఆర్కే 
– జీవోలతో కేసుల ఎత్తివేతపైనా ప్రభుత్వానికి నోటీసులు 

సదావర్తి భూముల వ్యవహారం నుంచి చంద్రబాబు  బయటపడే పరిస్థితులు కనిపించడం లేదు. దాదాపు వెయ్యి కోట్ల విలువైన భూమికి దాపరికంగా టెండర్‌లు నిర్వహించి తమకు అనుకూలమైన వ్యక్తలకు కారు చౌకగా కట్టబెట్టడంపై ఇప్పటికే వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రూపంలో చంద్రబాబుకు కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. 83.11 ఎకరాల భూమిని తమ వారికి ధారాదత్తం చేయడంపై హైకోర్టు చంద్రబాబు ప్రభుత్వానికి అక్షింతలు వేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై కోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యే ఆర్కే చంద్రబాబుపై పైచేయి సాధించారు. మరో రూ. 5 కోట్లు ఎక్కువిస్తే మీకే ఇస్తామని చెప్పిన చంద్రబాబు మాటతో ఆర్కే హైకోర్టుకెళ్లి రూ. 27.44 కోట్లకు కోర్టు ద్వారా దక్కించుకున్నారు. దానికి సంబంధించిన డబ్బును కూడా కోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే రెండు విడతల్లో చెల్లించారు. ఈ నేపథ్యంలో కోర్టు మరోసారి సదావర్తి భూముల వ్యవహారంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. సదావర్తి భూములకు గతంలో నిర్వహించిన వేలం చెల్లదని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మళ్లీ వేలం నిర్వహించాలని, 6 వారాల్లో వేలం ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించింది. వైయస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) చెల్లించిన రూ.27.44 కోట్లను బేస్‌ ప్రైస్‌గా నిర్ణయించి వేలం నిర్వహించాలని సూచించింది. వేలంలో పాల్గొనేందుకు ఎవరూ ముందుకు రాకపోతే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి సదావర్తి భూములు చెందుతాయని హైకోర్టు తేల్చిచెప్పింది. 

ఇరకాటంలో చంద్రబాబు 
తాము అమ్మిన ధర కంటే ఎక్కువ డబ్బులు రావని ఇప్పటివరకు ప్రచారం చేసుకుంటూ వచ్చిన అధికార పార్టీ నాయకులు హైకోర్టు ఆదేశాలతో మూగబోయారు. అయితే తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రాబోయే ఆరు వారాల్లోగా టెండర్‌ ప్రక్రియను తిరిగి చేపట్టాలని కోర్టు ప్రభుత్వానికి సూచించింది. అందుకోసం ఆర్కే చెల్లించిన రూ. 27.44 కోట్లు బేస్‌ ప్రైస్‌గా పరిగణించాలని కోర్టు చెప్పింది. ఈసారి జరిగే బహిరంగవేళంలో ఎంత ఎక్కువ వస్తే అంత ధరకు భూములు విక్రయించాలని సూచించింది. ఒక వేళ అంత ధర చెల్లించేందుకు ఎవరూ ముందుకు రాకుంటే ఆర్కేకే ఆ భూములను ఇవ్వాలని తీర్పులో వెల్లడించింది. అయితే ఇక్కడ మరో సూపర్‌ ట్విస్టు ఏంటంటే ఈ వేలంలో ఆర్కే కూడా పాల్గొనవచ్చు. ఇప్పటికే భూములకు సంబంధించి రీటెండర్‌పై పోరాడుతున్న ఆర్కే ఎక్కువ ధర చెల్లించి భూములు సొంతం చేసుకోవడంలో ప్రభుత్వంపై పైచేయి సాధించారు. అయితే తాజాగా తీర్పు ప్రకారం రీటెండర్‌ నిర్వహించాలన్న కోర్టు తీర్పు చంద్రబాబు ప్రభుత్వానికి పెద్ద ఎదురు దెబ్బే. రాబోయే రోజుల్లో జరగబోయే వేలంలో ఆర్కే తిరిగి భూములు దక్కించుకున్నా..ఇప్పుడు నిర్ణయించిన బేస్‌ప్రైస్‌ కంటే ఎక్కువ ధరకు సదావర్తి భూములు అమ్ముడయినా చంద్రబాబు నెత్తిన బండరాయి పడినట్టే. బాబు తన అనుయాయులకు కారు చౌక ధరకు భూములను కట్టబెట్టారని ప్రతిపక్ష వైయస్సార్సీపీ ముందు నుంచి చెబుతూనే ఉంది.  ఏదేమైనా చంద్రబాబుకు సదావర్తిలో రోజురోజుకు షాకులు తప్పడం లేదు. రానున్న రోజుల్లో ఓటుకు నోటు కేసులోనూ చంద్రబాబు తిప్పలు తప్పకపోవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా సదావర్తితోపాటు 120 జీవోలు విడుదల చేసి 1400 మందిని కేసుల నుంచి విముక్తులను చేయపడంపైనా ఆర్కే కోర్టును ఆశ్రయించడంతో దానిపైనా మంగళవారం లోపు వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసులు అందాయి. హత్య, హత్యాయత్నం, అత్యాచారయత్నం, గృహనిర్భంధం, లైంగిక వేధింపులు, ఆస్తుల ధ్వసం వంటి ఐపీసీ సెక్షన్ల కింద నమోదైన కేసుల నుంచి ఉపముఖ్యమంత్రి సహా స్పీకర్, మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలను అడ్డగోలు జీవోలు జారీ చేసి తప్పించిన దాంట్లోనూ చంద్రబాబుకు ఎదురుదెబ్బలు తగిలే అవకశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 
Back to Top