షర్మిల వెంట కదిలి వచ్చిన మహిళా లోకం

చిట్టి చిట్టి చిన్నారుల చిరుమోముల స్వాగతం... కొంగు నడుముకు చుట్టిన చెల్లెళ్ళు... పిడికిళ్లు బిగించిన అక్కలు.. పరుగులు తీస్తూ వచ్చిన తల్లులు... కణకణ మండుతున్న ఎండను కూడా లెక్కచేయకుండా మహిళాలోకం మొత్తం శ్రీమతి షర్మిల వెంట కదిలివచ్చింది. మేమున్నామంటూ కదం తొక్కింది. మహానేత వైయస్ కుటుంబానికి జరుగుతున్న అన్యాయంపై ఆవేశం వెళ్లగక్కింది. రాజన్న రాజ్యం తెచ్చేలా జగనన్నకు బాసటగా ఉంటామంటూ బాస చేసింది.‌ కృష్ణాజిల్లాలో శనివారం జరిగిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో అతివల చొరవ ఆశ్చర్యం గొలిపింది.

నూజివీడు (కృష్ణాజిల్లా) : వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు నూజివీడు నియోజకవర్గంలో విశేష ఆదరణ లభించింది. పాదయాత్ర పొడవునా పలువురు మహిళలు శ్రీమతి షర్మిలకు మామిడికాయల గుత్తులిచ్చి స్వాగతం పలికారు. పాదయాత్ర ముందుభాగంలో లంబాడీలు సంప్రదాయ నృత్యాలతో ఆకట్టుకున్నారు. జిల్లాలో 119వ రోజు పాదయాత్ర శనివారం నూజివీడు నుంచి యనమదల, ఈదర క్రాస్‌రోడ్, బత్తులవారిగూడెం మీదుగా మైలవరం నియోజకవర్గంలోని ‌సంద్రాల గ్రామ శివారు వరకూ కొనసాగింది.

ప్రతి ఒక్కరినీ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగిన శ్రీమతి షర్మిల ఆటోలు, బస్సులు, కార్లల్లో వెళుతున్న ప్రయాణికులకు కూడా కరచాలనం చేసి బాగున్నారా.. అంటూ కుశలం అడిగారు. శ్రీమతి షర్మిలను కలిసిన యనమదలకు చెందిన వృద్ధుడు దొప్పలపూడి కొకాలయ్య నూజివీడు-హనుమాన్‌జంక్షన్ రోడ్డును నాలుగు లైన్లుగా విస్తరించేందుకు వందల ఏళ్లనాటి చెట్టు నరికేశారని, వాటి స్థానంలో ప్రభుత్వం మొక్కలు పెంచేలా ఒత్తిడి తేవాలని వినతిపత్రం ‌అందజేశాడు. బత్తులవారిగూడెంలో మహానేత వైయస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళు‌లు అర్పించిన శ్రీమతి షర్మిల ఇద్దరు చిన్నారులను ఎత్తుకుని ముద్దాడారు. భరోతు శివాజీ అనే గిరిజనుడు శ్రీమతి షర్మిలను కలిసి తనకు మహానేత వైయస్ ఇచ్చిన అటవీ హక్కుదారు‌ పత్రాన్ని చూపించి.. మీ నాయన మమ్మల్ని ఆదుకుంటే ఈ ప్రభుత్వం అప్పు కూడా ఇవ్వడం లేదని వాపోయాడు. తనకు అటవీభూమి ఇచ్చిన మహానేత రుణం తీర్చుకునేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా ఉంటున్నందున కక్షగట్టిన కాంగ్రెసోళ్లు బ్యాంకు రుణం కూడా లేకుండా చేశారని కన్నీటిపర్యంతం అయ్యాడు. త్వరలోనే జగనన్న వస్తాడని, రాజన్న రాజ్యం స్థాపించి వైయస్ ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు కొనసాగిస్తా‌కని శ్రీమతి షర్మిల భరోసా ఇచ్చారు.

బొత్సపై మహిళల ఆగ్రహం..:
అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆగలేదంటూనే మహానేత వైయస్ కుటుంబంపై నోరు‌ పారేసుకున్న పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై పలువురు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. యనమదలలో శ్రీమతి షర్మిల నిర్వహించిన రచ్చబండలో వారు మాట్లాడారు. బొత్స తీరుపై మండిపడ్డారు. మంచినీరు రాదని, సాగునీరు లేదని, కరెంటు ఉండదని, పింఛన్లు ఇవ్వడం లేదని, ఇంటి జాగా ఇచ్చే పరిస్థితి లేదని, ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని సమస్యలను ఏకరువు పెట్టారు. మామిడి రైతుకు హెక్టారుకు రూ. 4 వేలు చొప్పున నష్టపరిహారం ఇచ్చి ఆదుకున్న ఘనత మహానేత వైయస్‌దే అని, ప్రస్తుతం మంగుతెగులుతో మామిడి పంట దెబ్బతిన్నా కిరణ్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని‌ వెంకట నాగేశ్వరరావు అనే రైతు మండిపడ్డాడు.

కారుచీకటిని చీల్చుకుంటూ..:
అడవిదారిలో కారుచీకటిని చీల్చుకుంటూ మరో ప్రజాప్రస్థానం పాదయాత్రతో ప్రకాశిస్తూ శ్రీమతి షర్మిల ముందుకు సాగిన తీరు అందరినీ ఆకట్టుకుంది. నూజివీడు - మైలవరం నియోజకవర్గాల పరిధిలోని అటవీభూమిని గతంలో ‌ఎస్సీ, ఎస్టీలకు మహానేత వైయస్ ఇవ్వడంతో హక్కుదారులు అడవిని బాగుచేసుకుని మామిడి సాగు చేస్తున్నారు. చుట్టూ ఎత్తయిన కొండలు.. నడుమ మామిడిచెట్లతో చిట్టడవిలా, నిశ్శబ్దంగా ఉండే ప్రాంతంలో పాదయాత్ర ఉత్సాహభరిత వాతావరణంలో జనజాతరలా సాగింది.

అండగా ఉంటాం: నూజివీడు వాసుల హామీ :
‘మండుటెండలో వందల కిలోమీటర్లు నడుచుకుంటూ మా కోసం వచ్చారు. పేదల సంక్షేమం కోసం మీ నాన్నగారు అమలుచేసిన పథకాలు మేము అనుభవించాం. మీ కుటుంబానికి అండగా ఉంటాం..’ నూజివీడు మండలం యనమదలలో శనివారం జరిగిన రచ్చబండలో పాల్గొన్న మహిళలు, రైతులు, యువకులు అన్న మాటలివి... స్థానిక సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన శ్రీమతి షర్మిలకు అక్కడి వారంతా ఒకే మాట చెప్పారు. ఆ మాట విని చలించిపోయిన శ్రీమతి షర్మిల వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

త్వరలోనే సంక్షేమ రాజ్యం : శ్రీమతి షర్మిల :
స్థానికుల సమస్యలు విన్న షర్మిల మాట్లాడుతూ, ఏడాదిలో రాజన్న రాజ్యం వస్తుందని, కష్టాలన్నీ తొలగిపోతాయని వారికి భరోసా ఇచ్చారు. ప్రస్తుత కిరణ్ పాలనకు, గతంలో చంద్రబాబు పాలనకు తేడా లేదన్నారు. కిర‌ణ్‌కు చంద్రబాబే ఆదర్శమని, ఈ ప్రభుత్వానికి చంద్రబాబే సలహాదారని చెప్పారు. 104, 108, రాజీవ్ ఆరోగ్యశ్రీ, అభయహస్తం, ఫీజు రీయింబ‌ర్సుమెంటు పథకాలన్నింటినీ జగనన్న రాజ్యంలో పటిష్టంగా అమలు జేస్తారని ఆమె హామీ ఇచ్చారు. రైతులకు, మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తారని, రైతుల కోసం రూ.3వేల కోట్లతో రైతు స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తారని చెప్పారు. పేద పిల్లల ఉన్నత చదువులకు ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పారు.
Back to Top