షర్మిల రాకతో పులకిస్తున్న పల్లెలు

వీరులపాడు(కృష్ణా జిల్లా):

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సంధించి విడిచిన  బాణం దూసుకొస్తుంటే పల్లెలు పులకిస్తున్నాయి. నీరు లేక, కరెంట్ రాక పంటలు ఎండిపోయి నిరాశా నిస్పృహల్లో ఉన్న రైతాంగం తమ బాధలు వినడానికి వస్తున్న శ్రీమతి షర్మిలకు స్వాగతం పలికారు. తమ బాధలు తీరాలంటే రాజన్న రాజ్యం రావాల్సిందేనని స్పష్టం చేశారు. నిప్పులు చెరుగుతున్న మండుటెండను సైతం లెక్క చేయకుండా శ్రీమతి షర్మిల పాదయాత్రకు స్వాగతం పలికేందుకు ప్రజలు రహదారుల వెంట వేచి ఉన్నారు. పాదయాత్ర సాగుతున్న ప్రాంతాలు జనసందోహంతో నిండిపోయాయి. ఎండలో కూడా మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధులు రోడ్డుపై తమ ప్రియతమ నేత కుమార్తెను చూసేందుకు ఎదురుచూశారు.

శ్రీమతి షర్మిల పాదయాత్ర ఆద్యంతం ఆత్మీయ పలకరింపులతో ముందుకు సాగింది. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి, అంబేద్కర్, బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తూ ఆమె  ముందుకు సాగారు. నందిగామ నియోజకవర్గం పాదయాత్ర ముగిసి జగ్గయ్యపేట నియోజకవర్గంలో అడుగు పెట్టే కూడలి సంగమేశ్వరం వద్ద ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. త్రివేణీ సంగమం (వైరా, కట్టలేరు, మున్నేరు నదుల కలయిక) సాక్షిగా జనం పోటెత్తారు. వీరులపాడు మండలం జయంతి గ్రామ శివారు నుంచి సాగిన శ్రీమతి షర్మిల పాదయాత్రలో మహిళలు ఆమెను చూసేందుకు అడుగడుగునా పోటీ పడ్డారు. యాత్ర వీరులపాడు, పల్లంపల్లి, దాములూరు, కొణ తమాత్మకూరు మీదుగా జొన్నలగడ్డ వరకు 14.1 కిలోమీటర్లు సాగింది.

శుక్రవారం శ్రీరామనవమిని పురస్కరించుకుని రాముని కల్యాణ వేడుకల్లో ప్రజలు పాల్గొనేందుకు వీలుగా మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు సాయంత్రం వరకు విరామం ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం జొన్నలగడ్డ మీదుగా గుమ్మడిదుర్రు వరకు యాత్ర సాగుతుంది. గురువారం నాటి పాదయాత్రలో శ్రీమతి షర్మిలను తమ ఇంటి ఆడపడుచులా ఆదరిస్తూ పండ్లు ఇచ్చేందుకు జనం పోటీ పడ్డారు. తాగడానికి నీరు అందుబాటులో లేకపోవడంతో బోరుల్లోని ఫ్లోరైడ్ నీటినే తాగాల్సి వస్తోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ధరలు ఆకాశాన్నంటాయి, మరోవైపు కూలి దొరకడం లేదు, ఉపాధి హామీ పనులు కూడా ఎప్పుడూ ఉండటం లేదని తమ వెతలు చెప్పుకున్నారు.

వీరులపాడులో గోళ్లమూడి నాగరత్నం, ఉప్పుటూరి శాంతారత్నం వృద్ధాప్య పింఛన్లు మంజూరు కావటం లేదనీ, ఇచ్చే పింఛన్లు సక్రమంగా ఇవ్వకపోవటంతో ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉందని ఆమె దృష్టికి తీసుకువచ్చారు. త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని, అందరి కష్టాలు తీరతాయని, పింఛను రూ.200 నుంచి రూ.700కు పెరుగుతుందని శ్రీమతి షర్మిల భరోసా ఇచ్చారు. పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తాతగారైన చావా గోపాలకృష్ణ (97) షర్మిలను కలిసి పాదయాత్ర విజయవంతం కావాలని ఆశీర్వదించారు. వీరులపాడు గ్రామ శివారులో ఏర్పాటుచేసిన ప్రత్యేక శిబిరంలో పాస్టర్ ప్రసాదరావు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ఈ పాదయాత్రలో పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ నాగిరెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, రాష్ట్ర కార్యక్రమాల కమిటీ సమన్వయకర్త తలశిల రఘురామ్, పి. గౌతంరెడ్డి, ఉప్పాల రాము, దేవినేని చంద్రశేఖర్, కోవెలమూడి వెంకటనారాయణ, కనికర్ల వెస్లీ, పరసా పురుషోత్తం, వేల్పుల రవికుమార్, మంగునూరి కొండారెడ్డి, కుక్కల సత్యనారాయణ ప్రసాద్, బండి కోటేశ్వరరావు, కోటేరు ముత్తారెడ్డి, కోట బుచ్చయ్య చౌదరి, తాటి రామకృష్ణారావు, దాసరి రాము, కృష్ణా, ఖమ్మం జిల్లాల ప్రచార కమిటీ కన్వీనర్లు సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి, శీలం వెంకటరెడ్డి, దళిత విభాగం నేత గురవయ్య, సామినేని వెంకట కృష్ణప్రసాద్, వట్టికొండ చంద్రమోహన్, కోటేరు సూర్యనారాయణరెడ్డి, వేజెండ్ల శివశంకర్, అబ్దుల్ ఖాదర్, ఎంఎస్ బేగ్ పాల్గొన్నారు.

Back to Top