షర్మిల పిలుపుతో ఉరకలెత్తిన జనచైతన్యం

కడగండ్లు కడతేర్చే జగనన్న సోదరి రాకతో పల్లె జనాల్లో పెరిగిన ఆత్మస్థైర్యం ప్రతిబింబిస్తోంది. ప్రతి హృదయ స్పందనలోనూ అది ప్రతిధ్వనిస్తోంది. వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధినేత‌ శ్రీ జగన్మోహన్‌రెడ్డి వదిలిన బాణం శ్రీమతి షర్మిల అందిస్తున్న సాంత్వన.. కృష్ణా జిల్లాలో జనచేతనగా మారుతోంది. జనం కష్టాలు తీర్చేందుకు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేపట్టిన ఆమెకు ఊరూవాడా అండగా నిలుస్తోంది. జననేత శ్రీ జగన్‌పై జరుగుతున్న కుట్రలు, కుతంత్రాల కుత్తుకలు ఉత్తరించేందుకు జనపదం కదం తొక్కుతోంది.

వీరులపాడు (కృష్ణాజిల్లా) : ‘ప్రజల సంక్షేమం కోసమే నిరంతరం శ్రమించిన మహానేత డాక్టర్ వై‌యస్‌ను ప్రజల హృదయాల నుంచి చెరిపేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనను ప్రజల దృష్టిలో దోషిగా నిలబెట్టేందుకు పాలకపక్షం, విపక్షం కలిసి కుట్రలు పన్నుతున్నాయి. జగనన్నను కూడా ఇబ్బందులపాలు చేస్తున్నాయి. వైయస్ కుటుంబాన్ని వెలివేయడానికి కుట్రలు చేస్తున్నారు.‌ ఈ కుట్రలు ఎంతోకాలం కొనసాగవు. వారి పాపం పండే రోజులు దగ్గరలోనే ఉన్నాయి..’ అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అ‌ధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల కాంగ్రెస్, ‌టిడిపిలపై నిప్పులు చెరిగారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర బుధవారం నందిగామ నియోజకవర్గంలో జరిగింది. దుగ్గిరాలపాడు శివారు నుంచి ప్రారంభమై గూడెంమాధవరం, పెద్దాపురం మీదుగా జయంతి గ్రామం చేరుకుంది. శ్రీమతి షర్మిల పలుచోట్ల మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దారిపొడవునా ఆమెకు మహిళలు ఘన‌ంగా స్వాగతం పలికారు. రైతులు తమ కష్టాలు చెప్పుకొన్నారు.

పొలాలు తడవడం లేదు..
ఇప్పటి వరకూ సాగర్ జలాలు రాకపోవడంతో పొలాలు ఎండిపోతున్నాయని రైతులు‌ శ్రీమతి షర్మిల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఎత్తిపోతల పథకాలకు కూడా విద్యుత్ సరఫరా సక్రమంగా జరగడంలేదని, రోజుకు మూడు, నాలుగు గంటలు కూడా కరెంట్ ఉండకపోవడంతో నేల తడవడం లేదని ఆమె దృష్టికి తీసుకొచ్చారు. వీరులపాడు మండలం జయంతిలో జరిగిన బహిరంగసభలో‌ శ్రీమతి షర్మిల ప్రసంగించారు. పలుచోట్ల మొక్కజొన్న రైతులు ఎండిపోయిన పంట చూపించి ఆవేదన వ్యక్తం చేశారని వివరించారు. నీరు లేదు.. కరెంట్ లేదు... దీంతో పంటలు ఎదగకుండానే ఎండిపోయాయి. మరో వైపు రుణాలు చెల్లించకపోతే జప్తు చేస్తామని బ్యాంకు అధికారులు నోటీసులు ఇస్తున్నారని రైతన్నలు చెబుతుంటే బాధేసిందని శ్రీమతి షర్మిల తెలిపారు. మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి బతికి ఉన్నప్పుడు ఈ పరిస్థితి లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.‌

మహానేత వైయస్ హయాంలో ‌నందిగామ నియోజకవర్గంలో తొమ్మిది లిఫ్టు ఇరిగేషన్ ‌పథకాలు సక్రమంగా పనిచేసేవని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. ఎత్తిపోతల పథకాలకు ఏడు గంటలు కాకుండా 17 గంటల పాటు నిర్విరామంగా కరెంట్ ఇచ్చి మెట్ట‌ ప్రాంత రైతులను మహానేత ఆదుకున్నారని చెప్పారు. స్థానికంగా ఉన్న 13 చెరువులు ఎప్పుడూ నిండుగా ఉండేవని, ప్రస్తుతం చెరువులు ఎండిపోయి తాగునీరు కూడా అందుబాటులో లేకుండా పోయిందని మహిళలు తనతో చెప్పారన్నారు. పొలాలకు మూడు గంటలు కూడా నీరు ఇవ్వకపోగా నిర్వహణ పేరుతో బిల్లులు వసూలు చేస్తున్నారని చెప్పారు. ఈ పరిస్థితి మారాలంటే రాజన్న రాజ్యం రావడమే పరిష్కారమన్నారు. జగనన్న సిఎం అయితే రైతులు, మహిళల కష్టాలు తీరతాయని శ్రీమతి షర్మిల భరోసా ఇచ్చారు.
Back to Top