షర్మిలను చూసి పులకిస్తున్న పల్లెల జనం

నల్గొండ : అభిమాన నాయకుడు, దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి బిడ్డ శ్రీమతి షర్మిలను అతి దగ్గరగా చూస్తున్న నల్గొండ జిల్లా పల్లెల ప్రజలు ఆనందంతో పులకించిపోతున్నారు. ఆమె చేపట్టిన 'మరో ప్రజా ప్రస్థానం' పాదయాత్రకు వారు అడుగడుగునా నీరాజనాలు పడుతున్నారు. అసమర్థ కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు, దానితో అంటకాగి అహరహం పరోక్షంగా మద్దతుగా నిలుస్తున్న స్వార్థపరుడు చంద్రబాబు నాయుడి కుమ్మక్కు రాజకీయాలకు నిరసనగా వైయస్‌ఆర్‌సిపి అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల సుదీర్ఘ, చారిత్రక పాదయాత్రకు అపూర్వ ఆదరణ, అఖండ స్వాగతం లభిస్తోంది.

శ్రీమతి షర్మిల పాదయాత్ర సోమవారంనాడు నల్గొండజిల్లా మర్రిగూడ మండలంలోని లెంకలపల్లి నుంచి చండూరు మండల పరిధిలోని దోనిపాముల, బంగారిగడ్డ, అంగడిపేట మీదుగా ఉడుతలపల్లికి చేరుకుంది. రాజన్న బిడ్డను చూడాలని, తమ సమస్యలు చెప్పుకోవాలని పల్లెల జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. శ్రీమతి షర్మిలను సాదరంగా ఆహ్వానించి, కొండంత అభిమానాన్ని చాటుకున్నారు. పాదయాత్ర నాలుగవ రోజు సోమవారం 14.8 కిలోమీటర్లు సాగింది. చండూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు.

జనజాతరలా సాగిన షర్మిల మరో ప్రజాప్రస్థానం :
శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర సోమవారంనాడు జనజాతరలా కొనసాగింది. పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొన్నదా అనిపించింది. శ్రీమతి షర్మిలతో కరచాలనం చేయడానికి మహిళలు అధిక సంఖ్యలో పోటీలు పడ్డారు. శ్రీమతి షర్మిల అటుగా వస్తున్న విషయం తెలియగానే రోడ్డు పక్కనే ఉన్న పాఠశాల విద్యార్థులు ఆమెను చూసేందుకు బయటకు వచ్చారు. వారి దగ్గరకు శ్రీమతి షర్మిల వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. మధ్యాహ్న భోజనం ఎలా పెడుతున్నారని ఆరా తీశారు. చిన్నారి నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరినీ పకలరిస్తూ ఆమె ముందుకు సాగారు. వృద్ధులను ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు.

పింఛన్లు వస్తున్నాయా? అన్న శ్రీమతి షర్మిల ప్రశ్నకు వారంగా రావడం లేదని చెప్పడంతో ఈ ప్రభుత్వం ఉన్నన్నాళ్లూ ఇంతేనని, త్వరలో అందరికీ మంచి రోజులు వస్తాయని చెప్పారు. తాము పొద్దంతా పనిచేసినా రోజుకు రూ. 70కి మించి కూలి అందడం లేదని ఉపాధి హామీ పథకం కూలీలు ఆవేదన వ్యక్తంచేశారు. గీత కార్మికులు పాదయాత్రకు సంఘీభావం తెలిపి తమ సమస్యలు వినిపించారు. గ్రామాల్లో బెల్టుషాపులు ఎక్కువ అవుతుండటంతో తాము కష్టపడి గీసిన కల్లును ఆదరించే వారు కరువయ్యారని గోడు చెప్పుకున్నారు. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి బతకాల్సిన దుస్థితి నెలకొన్నదని వివరించారు. బంగారిగడ్డ రచ్చబండలో మహిళలతో శ్రీమతి షర్మిల ముచ్చటించారు. మహిళలు, రైతులు తమ సమస్యలను ఆమెకు వివరించారు. జగనన్న ముఖ్యమంత్రి అయితే అందరికీ కష్టాలు తొలగిపోతాయని షర్మిల వారికి ధైర్యం చెప్పారు.

ఈ ప్రభుత్వం ఉందా... చచ్చిందా?:
బంగారుగడ్డ రచ్చబండలో, చండూరు సభలో శ్రీమతి షర్మిల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై విరుచుకుపడ్డారు. కిరణ్ కుమార్‌రెడ్డి ‌ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు ఆమె కళ్ళకు కట్టినట్టు వివరించారు. ఈ ప్రభుత్వం చంద్రబాబు పాలన-2ను తలపిస్తోందని ఎద్దేవా చేశారు. ప్రజలకు తాగునీరు కూడా అందించలేని ప్రభుత్వానికి అధికారంలో ఉండే హక్కు లేదన్నారు. ఏ పల్లెలో చూసినా తాగడానికి గుక్కెడు నీళ్లందని దుస్థితిని చూస్తుంటే ప్రభుత్వం ఉందా... చచ్చిందా? అనే సందేహం వస్తున్నదన్నారు. కాంగ్రెస్, టిడిపి నాయకులకు కుర్చీల కోసం ఆరాటమే గానీ ప్రజలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి మరణాంతరం వచ్చిన ప్రభుత్వాలు ఒక్క గ్రామానికి కూడా తాగునీరు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. మహానేత బతికుంటే మిగిలిన 500 ఫ్లోరైడ్ గ్రామాల‌కూ మంచినీరు సరఫరా అయ్యేదన్నారు. ఎస్ఎ‌ల్‌బిసి పూర్తిచేసి నాలుగు లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసేవారని పేర్కొన్నారు.

చండూరులో జరిగిన బహిరంగ సభకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.‌ 'జై జగన్', 'వైయస్‌ఆర్'‌ నినాదాలతో చండూరు మార్మోగింది. ఈ అసమర్థ, ప్రజా కంటక ప్రభుత్వాన్ని శ్రీమతి షర్మిల తన ప్రసంగంలో విమర్శించిన ప్రతిసారీ ప్రజలు చప్పట్లతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. రాజన్న చేసిన సేవలను ప్రస్తావించినప్పుడల్లా వారు కేరింతలతో శ్రీమతి షర్మిలకు ఆమోదం తెలిపారు.
Back to Top