షర్మిలకు పల్నాట నీరాజనం

గురజాల:

పల్నాటి ప్రజలు పంతాలు, పౌరుషాలు, పట్టింపులకే కాదు.. నమ్మకానికి, విశ్వాసానికి కూడా ప్రతిరూపాలు. అందుకే వెనుకబడిన పల్నాటి సీమను అభివృద్ధిపథంలో నడిపించిన రాజన్న వారికి దేవుడయ్యాడు.  వారి గుండెల్లో కొలువయ్యాడు. రాజనన్ననే కాదు ఆయన ఆశయాలను అమలుచేసేందుకు కార్యదీక్ష బూనిన వారసులు శ్రీ జగన్మోహన్ రెడ్డి, ఆయన వదిలిన బాణమై పల్నాడుకు వచ్చిన శ్రీమతి షర్మిలను ఇక్కడి ప్రజలు కన్నబిడ్డలా ఆదరించారు. అక్కున చేర్చుకున్నారు. హారతులు పట్టారు. జేజేలు కొట్టారు. అఖండ స్వాగతం పలికారు. ఈ నెల 23 నుంచి ఆరు రోజులపాటు పల్నాడులోని గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో సాగిన షర్మిల పాదయాత్ర గురువారం ముగిసింది. శుక్రవారం గురజాల నియోజకవర్గం నుంచి కొండమీడు మీదుగా సత్తెనపల్లి నియోజకవర్గంలో షర్మిల పాదయాత్ర ప్రవేశించనుంది. ఆరు రోజులపాటు షర్మిలమ్మతో నడిచిన జ్ఞాపకాలు, ఆమె ఇచ్చిన భరోసా, జగనన్న ప్రభుత్వం త్వరలోనే వస్తుందంటూ ఇచ్చిన ధీమాను ఇక్కడ ప్రజలు ప్రజలు పదిలపరుచుకున్నారు. మా వెంట నువ్వున్నావు.. మీ వెంట మేమున్నామంటూ భరోసా షర్మిలకు వీడ్కోలు చెప్పారు.

పల్నాటి అభివృద్ధితోనే..
    పల్నాటి అభివృద్ధికి నాడు మహానేత డాక్టర్ వైయస్ వేసిన బాటలే నేడు శ్రీమతి షర్మిలమ్మ పాదయాత్ర విజయానికి దోహదపడ్డాయి. అపర భగీరథుడిగా, జలయజ్ఞ స్ఫూర్తి ప్రదాతగా పేరొందిన వైఎస్ రాజశేఖరరెడ్డి సారధ్యంలో పల్నాటి సీమ అభివృద్ధి చెందింది. తాగు, సాగునీటి పథకాలు, రహదారులు, విద్య, వైద్యం, గృహ నిర్మాణం, విద్యుత్తు, తదితర అన్ని అంశాల్లో పల్నాడు నేడు అభివృద్ధి పథంలో పయనించడం డాక్టర్ వైయస్  చలవే. అభివృద్ధి ఒక ఎత్తైన పల్నాడులో ప్రశాంతత సాధించడం డాక్టర్ వైయస్ఆర్  ప్రభుత్వం సాధించిన మరో గొప్ప విజయం. ఒకప్పుడు ఫ్యాక్షన్, మావోయిస్టులతో ప్రశాంతత కోల్పోయిన పల్లెలు నేడు హాయిగా నిద్దరోతున్నాయంటే కారణం మహానేత విశేష కృషే.

     దివంగత మహానేత డాక్టర్ రాజశేఖరరెడ్డి  హయాంలో గురజాల నియోజకవర్గంలో రూ.500 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. మాచర్ల నియోజకవర్గంపై ప్రత్యేక మమకారం చూపి ఏడుసార్లు పర్యటించారు. సుమారు 898.69 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు.

Back to Top