షర్మిలకు జనం బ్రహ్మరథం

మహానేత పాలనను గుర్తుచేస్తూ.. నేటి ప్రజాకంటక కిరణ్ సర్కార్‌పై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఆదివారం షర్మిల ‘మరో ప్రజా ప్రస్థానం’ ముందుకుసాగింది. వృద్ధుల యోగక్షేమాలు ఆరా తీస్తూ.. చిన్నారులను ముద్దాడుతూ.. సమస్యలు తెలుసుకుంటూ సాగిన ఆమెకు దారిపొడవునా మహిళలు హారతులతో అపూర్వ స్వాగతం పలికారు. తమ కష్టాలు కడతేర్చేందుకు జగనన్న దూతగా ఆమె తరలివస్తున్నదన్న భావన జనం మదిలో మెదిలి హృదిహృదిలో ధైర్యం నింపుతోంది. ఆమె రాకతో జనార్దనపురం జనకెరటమై మెరిసింది.. మురిసింది.

గుడివాడ, 08 ఏప్రిల్ 2013:

‘దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉంది ఐదేళ్లే.  ఆ కాలంలో ఒక్క రూపాయి కూడా పన్నుల భారం మోపలేదు. ఏ ఒక్క చార్జీ పెంచలేదు. అయినా అన్ని రకాల అభివృద్ధి కార్య్రకమాలు విజయవంతంగా నిర్వహించారు. ఒక తండ్రిలా ప్రజలను పాలించారు.. ఆదుకున్నారు. పన్నులు ఒక్క రూపాయి పంచినా పేదలు, రైతులపై ఆ భారం పడుతుందని ఆయన ఆలోచించారు. నా అక్కచెల్లెళ్లు ఇబ్బంది పడుతున్నారని భావించారు. ఆయన రాష్ట్రాన్ని రైతాంధ్రప్రదేశ్ చేయాలని తలిస్తే.. ఇప్పటి సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి రాష్ట్రాన్ని అంధకారాంధ్ర ప్రదేశ్‌గా మార్చేశారు.’ అంటూ శ్రీమతి షర్మిల విమర్శలు  గుప్పించారు.

గుడివాడ శివారు నుంచి మొదలైన పాదయాత్రకు అడుగడుగునా మహిళలు పెద్దసంఖ్యలో హాజరై నీరాజనాలు పట్టారు. మహిళలు ఎదురేగి హారతులు పట్టారు. యాత్ర దారిపొడవునా మహిళలు, వృద్ధులు, చిన్నారులను పలకరిస్తూ శ్రీమతి షర్మిల ముందుకుసాగారు. నందివాడ మండలం జనార్దనపురం(జొన్నపాడు) వద్ద ఆమె అపూర్వ స్వాగతం లభించింది. ఊరుఊరంతా కదలివచ్చింది. జొన్నపాడులో ఆమె రచ్చబండ నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమ సమస్యలు ఏకరువు పెట్టారు.

నూజివీడుకు చెందిన వీరంకి నాగేశ్వరరావు దంపతులు మహానేత తనయను కలిసి తమ తొలిపంటను (మామిడి కాయలు) అందచేశారు. ‘కదం తొక్కి కదులుతోంది వైయస్ఆర్ కేతనం’ పాటల సీడీని తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురానికి చెందిన వైద్యులు డాక్టర్ యనమదల మురళీకృష్ణ దంపతులు ఆమెకు ఇచ్చారు. గుడివాడకు చెందిన పలువురు న్యాయవాదులు ఆమె సమక్షంలో పార్టీలో చేరారు. గుడివాడ పాలిటెక్నిక్ కళాశాల వద్ద మాజీ కౌన్సిలర్ బొజ్జగాని కోటమ్మ బిస్కెట్ల దండతో స్వాగతం పలికారు. జనార్దనపురం శివారు టెలిఫోన్‌నగర్ కాలనీలో ఆమె రైతుకూలీలతో ముచ్చటించి వారి సమస్యలు తెలుసుకున్నారు. టెలిఫోన్‌నగర్‌లో లేడీ కండక్టర్‌ను పలకరించి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు.

జనార్దనపురంలో ఎర్రని ఎండలో పాదయాత్ర చేస్తున్న శ్రీమతి షర్మిలకు ఓ వృద్దురాలు మజ్జిగ అందచేసింది.  అనంతరం జనార్దనపురంలో మహానేత విగ్రహానికి పాలు, ధాన్యం, నీటితో ఆమె అభిషేకం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రేషన్ డీలర్ల సంఘం నాయకులు తిరువీధి శ్రీరాములు వినతిపత్రం అందచేశారు. అనంతరం జనార్దనపురం శివారులో భోజన విరామం కోసం ఆగారు. ఈ సమయంలోనే పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ అమ్మమ్మ కడప జిల్లాలో మృతి చెందిన సమాచారం అందింది. దీంతో పాదయాత్రను తాత్కాలికంగా ఆపి రోడ్డు మార్గంలో కడప జిల్లాకు బయలుదేరి వెళ్లారు. మంగళవారం నుంచి మరోప్రజాప్రస్థానం పాదయాత్ర యథాతథంగా కొనసాగుతుంది.

తాజా వీడియోలు

Back to Top