కోటి గుండెలకు షర్మిల భరోసా!

హైదరాబాద్ :

ప్రజలను, వారి బాధలను గాలికి వదిలేసి ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్న కాంగ్రెస్ పాలకులు ఒకవైపు.. ప్రధాన ప్రతిపక్ష‌ హోదాలో ఉండి అలాంటి పాలకులను నిలదీయకుండా ఆ ప్రభుత్వంతోనే నిస్సిగ్గుగా కుమ్మక్కైన టిడిపి మరోవైపు.. మహానేత రాజన్న మరణం తర్వాత అల్లకల్లోలమైన రాష్ట్రంలో తమకు అండగా ఉంటారనుకున్న శ్రీ జగన్మోహన్‌రెడ్డిని కుమ్మక్కు కుట్రలు జైలుపాలు చేస్తే.. పన్నులు, చార్జీలు, కరెంటు కోతలు, బిల్లు వాతలతో పాలకులు వెన్నుపోటు పొడిచి తమను పట్టించుకోకపోతే.. ఏం చేయాలో దిక్కుతోచక అలమటిస్తున్న ప్రజలు మరోవైపు..

ఈ పరిస్థితుల నేపథ్యంలోనే గత సంవత్సరం అక్టోబర్‌లో మొదలైంది శ్రీమతి షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర. ప్రజాకంటకంగా మారిన ప్రభుత్వాన్ని ఎండగడుతూ, ఆ ప్రభుత్వంతోనే అంటకాగుతున్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబును నిలదీస్తూ వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల ప్రారంభించిన పాదయాత్ర తొమ్మిది నెలలపాటు మహాయజ్ఞంలా కొనసాగింది. ఆదివారం (04-ఆగస్టు-2013) నాటికి చివరి మజిలీకి చేరింది. ‌అటు వైయస్ఆర్ జిల్లా ఇడుపులపాయ నుంచి ఇటు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు ఈ చరిత్రాత్మక పాదయాత్ర  కొనసాగింది.

ఈ తొమ్మిది నెలల్లో 14 జిల్లాల్లో, 116 నియోజకవర్గాల మీదుగా శ్రీమతి షర్మిల పాదయాత్ర చేశారు. దారి పొడవునా లక్షలాది మంది ప్రజలను పలకరించారు. దరికి వచ్చిన ప్రతి ఒక్కరితో కరచాలనం చేశారు. రచ్చబండలు నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. బహిరంగ సభల్లో ప్రజా సమస్యలపై మాట్లాడుతూ ప్రభుత్వం, ప్రతిపక్షాన్ని తూర్పారపట్టారు. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో దారి పొడవునా కలిసిన జనం, రచ్చబండ, బహిరంగ సభలకు హాజరైన వారు కలిపి కోటి మందికిపైగా జనహృదయాలను ఈ పాదయాత్ర ద్వారా శ్రీమతి షర్మిల స్పృశించినట్లు అంచనా.

జగనన్న వదిలిన బాణాన్నంటూ మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభించిన శ్రీమతి షర్మిల నిజంగానే గురి తప్పని బాణంలాగానే ముందుకు సాగారు. కాళ్లు బొబ్బలెక్కినా, మోకాలికి సర్జరీ జరిగినా, ఎండ నిప్పులు కురిపిస్తున్నా, హోరున వర్షం కురుస్తున్నా, చలి వణికిస్తున్నా లెక్కచేయకుండా.. తన కోసం బారులు తీరిన జనసంద్రాన్ని ముద్దాడుతూ, వారి సమస్యలు తెలుసుకొంటూ, రాబోయే రాజన్న రాజ్యంలో కష్టాలన్నీ తీరిపోతాయని భరోసా ఇస్తూ ముందుకు సాగారు.

జనం కష్టాలే.. ప్రేరణ :
‌మహానేత వైయస్ఆర్ మరణం తరువాత రాష్ట్రంలో జల ప్రళయం వచ్చింది. పల్లెలకు పల్లెలు నీళ్లలో కొట్టుకుపోయాయి. జనజీవనం అతలాకుతలమైంది. ఆ తరువాత వర్షాభావ పరిస్థితులతో జలాశయాలు అడుగంటిపోయి, కరెంటు ఉత్పత్తి ఆగిపోయింది. పాలకులకు ముందస్తు ప్రణాళిక లేక కరెంటు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. వ్యవసాయానికి రోజుకు కనీసం మూడు గంటలు కూడా కరెంటు ఇవ్వలేని పరిస్థితిలోకి ప్రభుత్వం వెళ్లిపోయింది. పల్లెల్లో లాంతర్లు, కిరోసిన్ బుడ్డి దీపాలే దిక్కయ్యాయి. దీనికి తోడు కరెంటు చార్జీల భారం. వ్యవసాయం వట్టిపోయింది.. ఉపాధి కూలిపోయి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తలకిందులైపోయింది. రైతాంగం తల్లడిల్లింది.

ఈ పరిస్థితిలో ప్రజలకు అండగా నిలబడి ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అధికారపక్షానికే వంత పాడారు. మరోవైపు జనం కోసం నిలబడిన జననేత శ్రీ జగన్మోహన్‌రెడ్డిని కాంగ్రెస్, టిడిపి కుమ్మక్కు కుట్ర పన్ని అక్రమంగా జైల్లో బంధించేలా చేశాయి. ఎటు చూసినా ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో బతుకు మీద భరోసా కోల్పోతున్న ప్రజల దగ్గరకు వెళ్లమని, రానున్నదంతా రాజన్న రాజ్యమేనని భరోసా ఇవ్వమని చెప్పి శ్రీ జగన్మోహన్‌రెడ్డి వదిలిన బాణం.. ప్రజాస్వామ్య రాజకీయ చరిత్రలో మునుపెన్నడూ లేని రీతిలో ముందుకుసాగి గమ్యానికి చేరువైంది.

3,112 కిలోమీటర్ల యాత్ర :
ఇడుపులపాయలో తొలి అడుగువేసి జనంతో మమేకమైంది మొదలు... చలి, ఎండ, వాన దేన్నీ లెక్క చేయకుండా పాదయాత్ర చేశారు శ్రీమతి షర్మిల. శ్రీమతి షర్మిల 230 రోజులు పూర్తిగా జనం మధ్యే గడిపారు. ఆదివారం ఇచ్ఛాపురంలో వైయస్ఆర్ ‘విజయ వాటిక’కు చేరడంతో‌ శ్రీమతి షర్మిల 3,112 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తవుతుంది. రాష్ట్రంలోనే కాదు, దేశ రాజకీయ చరిత్రలో ఇది ఒక రికార్డు. ఇప్పటి వరకు రాష్ర్టంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా, దేశంలో ఏ మహిళా ఇంత దూరం పాదయాత్ర చేయలేదు.

మరో ప్రజాప్రస్థానం పాదయాత్రను శ్రీమతి షర్మిల ఒక యజ్ఞంలా చేశారు. మారుమూల పల్లెకూ వెళ్లారు. ప్రతి అవ్వనూ పలకరించారు. ముళ్లలో, రాళ్లలో, బురదలో, ఎలా దారి ఉంటే అలా నడిచారు. పొలంగట్టు మీద నడిచివెళ్లి రైతులను, వరి నాట్లు వేసే రైతు కూలీలను పలకరించారు. పేదింటి పచ్చడి మెతుకులు రుచి చూశారు. పాలకుల సాయం లేక, పంటకు మద్దతు ధర లేక అప్పులపాలై ఒంటి మీది నగలను, ఒంట్లో అవయవాలను అమ్ముకున్న రైతుల గుండెను తడిమారు.. మద్యం బారిన పడి మసిబారిన కుటుంబాల కన్నీళ్లు చూశారు. బడికి వెళ్లే వయసులో పిల్లలను పనికి పంపే పేదతల్లి ఎదమాటున దాగున్న బాధను గమనించారు. పొద్దంతా కష్టం చేసి పొద్దుగూకిన వేళ కరెంటు లేకుండానే వండుకుంటున్న, కరెంటు లేకుండానే పండుకుంటున్న మహిళల బాధలు విన్నారు.

ఇచ్ఛాపురంలో భారీ ముగింపు సభ :
2012 అక్టోబర్ 18న ప్రారంభమైన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర సకల జనులను, సహస్ర వృత్తులను అనునయిస్తూ తొమ్మిది నెలల పాటు కొనసాగి ఆదివారంనాడు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలోని వైయస్ఆర్ ‘విజయ వాటిక’ వద్ద ముగియనుంది. ‘ప్రజాప్రస్థానం’ పేరుతో వై‌యస్ఆర్ 68 రోజుల్లో 1,47‌6 కిలో మీటర్లు చేసిన పాదయాత్ర ముగింపునకు చిహ్నంగా నిర్మించిన ‘విజయ వాటిక’కు ఎదురుగా ఏర్పాటు చేసిన ‘మరో ప్రజాప్రస్థానం’ ముగింపు చిహ్నం ‘విజయ ప్రస్థానం’ స్తూపంను ఆమె ఆవిష్కరించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఇచ్ఛాపురంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌరవ‌ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ, పార్టీ ముఖ్య‌ నాయకులు, శాసనసభ్యులు పాల్గొంటా‌రు.

Back to Top