ఇదేం ప్రభుత్వం...సిగ్గు..సిగ్గు

  • – అసెంబ్లీ సాక్షిగా అసత్యాల ప్రచారం
  • – సీఎంతో సహా ఆరితేరిన మంత్రులు, ఎమ్మెల్యేలు
  • – రుణమాఫీపై టీడీపీ తప్పుడు సమాచారం
  • – సమస్యలపై ప్రతిపక్షం ప్రశ్నిస్తే మైక్‌ కట్‌లే..
  • – బాబు భజన కోసం జగన్‌ను ఆడిపోసుకుంటున్న మంత్రులు
  • – చౌకబారు విమర్శలతో సభలో ప్రభుత్వం కాలక్షేపం

ఏపీ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్న తీరు చూసి సభ్యసమాజం తలదించుకుంటోంది.  కొత్త రాష్ట్రం, కొత్త రాజధాని, కొత్త అసెంబ్లీ.. అక్కడేదో కొత్తగా సమావేశాలు జరుగుతాయనీ, ఆ సమావేశాల్లో తమ సమస్యలపై చర్చ జరుగుతుందనీ, ఆ చర్చలు సత్ఫలితాలనిస్తాయనీ, తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందనీ 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకం ఎదురుచూస్తున్నారు. కానీ, ప్రభుత్వం ప్రజాసమస్యలపై ప్రతిపక్షాన్ని మాట్లాడనీయకుండా గొంతు నొక్కుతోంది. 

మైక్‌ కట్‌ల సంస్కృతికి అంతం లేదు
వందల కోట్లు వెచ్చించి, అసెంబ్లీ – శాసన మండలి భవనాల్ని అత్యద్భుతంగా నిర్మించామని గప్పాలు కొట్టుకునే చంద్రబాబు సర్కార్‌ సమావేశాల విషయంలో మాత్రం మైక్‌ కట్‌ల సంస్కృతికి అంతం పలకడం లేదు. ప్రజా సమస్యలపై మాటెత్తితే చాలు వ్యక్తిగత విమర్శలకు దిగుతారు. ఎన్నికల హామీలు నెరవేర్చలేదని అడిగితే మైక్‌ కట్‌ చేస్తారు. కరువుతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. ఇన్‌పుట్‌ సబ్సిడీ గురించి తేల్చమంటే మాట్లాడే ధైర్యం చేయరు. ఏవో తప్పుడు పత్రాలు సృష్టించి మీ పార్టీ నాయకుడు ధర్మశ్రీ రుణమాఫీ పొందాడని సభలో అసత్యాలు ప్రచారం చేస్తారు. తీరా ప్రతిపక్ష నాయకుడు ఆధారాలతో సహా మంత్రి చెప్పింది అసత్యాలని నిరూపిస్తే జీర్ణించుకోలేని నిస్సహాయత. మేం చెప్పిందే వినాలి.. మేం చేస్తుంటే చూడాలి.. మేం ఇచ్చింది పుచ్చుకోవాలి.. మేం చెప్పిందే నిజం.. మేం చేసిందే వేదం. ఇలాగే తయారైంది ప్రభుత్వ వ్యవహారం. నిజం ఎప్పుడూ నిష్టూరమే.
 
ప్రతిపక్ష నేతపై బాత్రూమ్‌ విమర్శలా..
మంత్రిగారు సమాధానమిస్తున్నప్పుడు ప్రతిపక్ష నేత బయటకు వెళ్ళారట. అంతే, బాత్రూమ్‌కే వెళ్ళారో, ఇంకెక్కడికన్నా వెళ్ళారో.. అంటూ మంత్రిగారు దీర్ఘం తీసేశారు. ఇదెక్కడి పద్ధతి.? అంటూ, ప్రతిపక్ష నేత ప్రశ్నిస్తే.. ’బాత్రూంకి వెళితే ఒక్కరే వెళ్ళాలిగానీ, వెనకాల నలుగురైదుగుర్ని తీసుకెళ్ళడమేంటి.?’ అని మంత్రిగారు సెటైర్‌ వేస్తారు. ఎంత ఛండాలంగా వుందో కదా, ఈ డిస్కషన్‌.! వందల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన అసెంబ్లీని ప్రజాసమస్యలపై కాకుండా ’బాత్రూమ్‌పై చర్చ’ కోసం ఉపయోగించేశారు. సిగ్గు సిగ్గు.. ఇంతకన్నా సిగ్గుమాలినతనం ఇంకేమీ వుండదు. ప్రతిపక్ష నేతపై ’బాత్రూమ్‌’ విమర్శలు చేసే స్థాయికి అధికార పార్టీ, అందునా శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల దిగజారిపోవడమంటే ఇది పైత్యానికి పరాకాష్టగా చెప్పుకోవాలి. పాలకుల్ని చూసి జనం సిగ్గుపడ్తున్నారు.  ఇంత అధమ స్థాయికి తామెందుకు దిగజారిపోతున్నామో సదరు మంత్రిగారు మాత్రం ఆలోచించుకోకపోగా.. పైగా అదేదో ఘనకార్యమన్నట్లు మాట్లాడడం సిగ్గుచేటు.

మీడియా పాయింట్‌లోనూ నోరెత్తనీయరు
అసెంబ్లీలో ఎలాగూ మాట్లాడనీయకుండా మైక్‌ కట్‌ చేస్తున్న ప్రభుత్వం మీడియా పాయింట్‌లోనూ ఇదే నిరంకుశ ధోరణి ప్రదర్శిస్తోంది. గత రెండు రోజులుగా మీడియా పాయింట్‌ సాక్షిగా .. తెలుగుదేశం ఎమ్మెల్యేలు ప్రతిపక్షాన్ని మాట్లాడనీయకుండా అక్కడకూ వచ్చి రచ్చరచ్చ  చేసేశారు. మీడియా సాక్షిగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మాట్లాడుతుండగా కనీస సంస్కారం లేకుండా ఎమ్మెల్యేలనే ఇంగితం మరిచి యావదాంధ్ర ప్రజలు నివ్వెరపోయేలా ప్రవర్తించారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, సభా సాంప్రదాయాలను మంటగల్పుతున్న టీడీపీని చూసి ప్రతి ఒక్కరూ ఛీదరించుకుంటున్నారు. 
 
చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకే పాట్లు 
చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు పడరాని పాట్లు పడుతున్నారు. సభలో ప్రతిపక్షంపై అసత్య ఆరోపణలు చేసేవారు కొందరైతే మీడియా పాయింట్‌లోనూ రచ్చ చేయడం ద్వారా బాబును ఆకర్షించే ప్రయత్నం చేసేవారు ఇంకొందరు. ఇదంతా ఎందుకంటే ఉగాది తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉందని ప్రచారం జరగడమే. ఇప్పటికే మంత్రులుగా ఉన్న పల్లె రఘునాథరెడ్డి, పీతల సుజాత వంటి వారు హిట్‌ లిస్టులో ఉన్నారు. తమ పదవులను కాపాడుకునేందుకు వారు తాపత్రయ పడుతుంటే.. అనిత లాంటి వారు మాత్రం పీతలకు మంత్రి పదవి ఊడిపోతే తనకే అవకాశం ఉంటుందని తెగ హడావుడి చేస్తుంది. 

పీతలకు ఊడగొట్టాలని అనిత తాపత్రయం
మంత్రి పీతల సుజాత పదవి పరిస్థితి ప్రస్తుతం డోలాయమానంగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణ జరిగితే.. ఆమెకు వేటు తప్పకపోవచ్చునని చాలా ఊహాగానాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాను పార్టీకోసం తెగ కష్టపడిపోతున్నట్లుగా నిరూపించుకోవడం ఆమెకు అవసరంగా మారింది. ఆ ప్రయత్నంలోనే ఆమె వైయస్సార్సీపీ సభ్యులతో గాదా పెట్టుకోవడానికి సిద్ధపడినట్లుగా పలువురు విశ్లేషిస్తున్నారు. మరోవైపు, పీతలపై ఎప్పుడు వేటు పడుతుందా, తనకు మంత్రి పదవి ఎప్పుడు దక్కుతుందా అని గుంటకాడి నక్కలాగ ఎదురుచూస్తున్న అనిత...మీడియా పాయింట్ వద్ద బాబు ప్రాప్తం కోసం నానా హైరానా చేసింది.  పీతల సుజాతకు పోటీగా తాను కూడా గొడవలోకి దిగి.. పార్టీకోసం ఎంతకైనా తెగించడానికి సిద్ధం అనే బిల్డప్‌ ఇవ్వడానికి అత్యుత్సాహపడ్డారు. ప్రజాసమస్యలు పరిష్కరించండి మొర్రో అని ప్రతిపక్షం అరిచిగీపెడుతుంటే...టీడీపీ నేతలు మాత్రం తమ బాబుగారి భజన కోసం తాపత్రయపడుతుండడం శోచనీయం. 
Back to Top