బాబు కు ’షా’(ఆ)పరేషన్

కొండ నాలిక్కి మందేస్తే ఉన్న నాలిక ఊడిందట. పాపం చంద్రబాబు పరిస్థితి అచ్చం అలాగే ఉందిప్పుడు. ప్రత్యేకహోదా కోసం గట్టిగా పోరాడుతున్నట్టు బిల్డప్ ఇవ్వడం కోసం మిత్రపక్షం బిజెపితో కటీఫ్ అన్నాడు బాబు. అంతా మీరే చేసారంటూ రాష్ట్రానికి హోదా రాకపోవడం నుంచీ, నిధులు రాకపోవడం వరకూ అన్నిటికీ కేంద్రం నిర్లక్ష్యమే కారణమంటూ దొంగ ఏడుపులు ఏడిచాడు. బడాయిగా మంత్రులను రాజీనామా చేయించి, బిజెపిని నోటికొచ్చినట్టు తిట్టడం మొదలెట్టాడు. బాబూ ఏరు దాటి తెప్ప తగలేసే బుద్ధి చూసాక బిజెపి కూడా రివర్స్ లో బాబుకు షాకులివ్వడం మొదలెట్టింది. అందులో భాగమే అమిత్ షా ఘాటు లేఖ. పొరపాట్లన్నీ మీవే అంటూ అమిత్ షా ఈ లేఖలో కుండ బద్దలు కొట్టాడు. ప్రజల్లో సానుభూతి కోసం బిజెపీతో కయ్యానికి దిగితే, అటు మిత్ర పక్షంతో చెడి, ఇటు బాబు బండారం బయట పడి రెండు విధాలా చెడి రెంటికీ చెడ్డ రేవడైంది బాబు సంగతి. 

ఇచ్చిన నిధులు వాడలేదు...  వాడిన నిధులకు లెక్కలు లేవు

కేంద్రం మోసం చేసింది. రాష్ట్రానికి అన్యాయం చేసింది అని బాబు పదే పదే చెబుతుండటంతో బిజెపి అధిష్టానం బాబుపై ఎటాక్ మెదలెట్టింది. తప్పు తమ వైపు లేదని, రాష్ట్ర ప్రభుత్వం తరఫునే బోలెడె పొరపాట్లు జరిగాయని బహిరంగంగా విమర్శించింది. మిత్ర పక్షంగా ఉన్నారు గనుక బాబు తీరును ఇన్నాళ్లూ ప్రశ్నించని బిజెపి, తన అవకాశ వాద రాజకీయాల కోసం బిజెపిని బలిచేయాలనుకుంటున్నందుకు బాబుకు బుద్ధి చెప్పడానికి సిద్ధపడినట్టు కనిపిస్తోంది. ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలంటూ అమిత్ షా ఘాటుగా వ్యాఖ్యానించడం వెనుక బాబు అలా లేడనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఖర్చుల వివరాలను చెప్పాల్సిన అవసరం లేదని బాబు అనడాన్ని కూడా షా తీవ్రంగా తప్పు బట్టారు. ఇది ఖచ్చితంగా బాబు అవకాశవాదం, పాలనా లోపాన్ని తెలియజేస్తోందని మండిపడ్డారు. 
నిధుల విషయానికొస్తే తొలి మూడేళ్లలో ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఇచ్చిన గ్రాంటుల్లో 50 శాతం కూడా ఖర్చు ఎందుకు జరగలేదని సూటిగా ప్రశ్నించారు షా. అలాగే ఉపయోగించిన నిధులకు సంబంధించిన వినియోగ పత్రాలు కూడా సమర్పించలేదని విమర్శించారు. 

బాబు బుర్ర బొప్పి కట్టేలా షా ప్రశ్నలు

తాడిని తలదన్నే వాడుంటే వాడి తలదన్నే వాడూ ఉంటాడని ఊళ్లలో సామెత. బిజెపి తన పాకెట్లో ఉంది కదా..కేంద్రం నుంచికి తనను అడిగేవాడు లేడనుకుంటూ బాబు చేసిన విచ్చలవిడితనానికి అంతే లేదు. తీరా ప్రత్యేక హోదా విషయంలో బాబు అవకాశవాదం చూసి ఒళ్లు మండిన బిజెపి ఇప్పటిదాకా బాబూ చేసిన తప్పుల చిట్టా విప్పుతోంది. స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటు చేయమంటే చంద్రబాబు లెక్క చేయలేదని, అలా చేస్తే ఇష్టం వచ్చినట్టు నిధులు మళ్లించే అవకాశం ఉండదనేగా అంటూ షా సూటిగా ప్రశ్నించారు. ఇదే విషయాన్ని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఎప్పటి నుండో ప్రజలకు చెబుతూనే ఉన్నారు. కేంద్రం నుండి వచ్చిన నిధుల లెక్కలు పంపక పోవడం వల్లే రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రానికి నమ్మకం సన్నగిల్లుతోందని, చంద్రబాబు తీరుతో రాష్ట్రానికి నష్టం జరుగుతోందని ఎన్నోసార్లు ప్రతిపక్షనేత ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అంటూ చంద్రబాబు చెప్పే మాటల్లోని నేతిబీర తత్వాన్ని షా తన లేఖలో క్లియర్ గా బైట పెట్టారు. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్  హైవే గురించి మాట మార్చింది బాబేనని తేల్చి చెప్పారు. ఈఎపి నిధుల కోసం కూడా స్పందిచలేదని అన్నారు. కేంద్రం రెవెన్యూ లోటు ఇస్తానంటే మీరు రుణమాఫీ, పింఛన్లు అందులో ఎలా కలుపుతారని మండిపడ్డారు. ఇదంతా బాబు అసమర్థతే అని షా తన లేఖలో దుయ్యబ్బటారు. ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుని, అదంతా తమ ఘనతే అని చెప్పుకుని ఇప్పుడు మీ రాజకీయ అవసరాల కోసం యు టర్న్ తీసుకుని, తప్పును కేంద్రపైకి ఎలా నెడతారంటూ బాబును ఎడా పెడా ఏకేసారు అమిత్ షా. రాజధాని  కోసం కేంద్రం విడుదల చేసిన నిధుల్లో కనీసం 10% కూడా వినియోగించలేదని, ఇచ్చిన నిధులనే వాడకుండా మరిన్ని నిధులు కావాలనడం ఏ తెలివని బాబును ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా రాష్ట్రంలో చేపట్టే పథకాలను తమవిగా ప్రకటించుకుని టిడిపి రాజకీయ ప్రచారాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు షా.  గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే కు అవసరమైన భూమిని ఉచితంగా ఇస్తామని చంద్రబాబు ఇంతకు ముందు చెప్పి, ఇప్పుడు 50 శాతం భూవ్యయాన్నే భరించగలం అని మాట మార్చారని చెప్పారు అమిత్ షా. రాజకీయ అవసరాల కోసం మాత్రమే బాబు ఎన్డీయే నుంచి విడిపోయారని వాఖ్యానించారు. బిజెపిని కనీసం సంప్రదించకుండా ఏక పక్షంగా నిర్ణయం తీసుకుని ఇప్పుడు కేంద్రాన్ని నిందిచడం మంచిది కాదు అని హెచ్చరించారు. 
Back to Top