రాష్ర్ట విభజన‌పై కదంతొక్కిన కర్షక లోకం

హైదరాబాద్ :

అడ్డగోలుగా జరుగుతున్న రాష్ట్ర విభజనకు నిరసనగా రాష్ట్రంలోని కర్షకలోకం ఊరూవాడా ఒక్కటై వీధుల్లోకి కదలి వచ్చి, కదం తొక్కింది. వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి పిలుపుమేరకు సమైక్యాంధ్ర పరిరక్షణకు అన్నివర్గాలనూ ఏకతాటిపైకి తీసుకువస్తున్న పార్టీ శ్రేణులు బుధవారం సీమాంధ్ర జిల్లాల్లో రైతులతో కలిసి సమైక్య ఉద్యమాన్ని హోరెత్తించాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కర్షకులు, వ్యవసాయ కార్మికులు ఎక్కడికక్కడ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో భారీ ర్యాలీలు నిర్వహించారు. అన్ని పట్టణాలు, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ప్రదర్శనలు చేసి సమైక్య నినాదాలు హోరెత్తించారు. ఇప్పటికే ఎన్నో సమస్యలతో అల్లాడిపోతున్న రైతాంగం రాష్ట్రం ముక్కలైతే మరింత దుర్భర పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందంటూ అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేశారు.

విభజనకు వ్యతిరేకంగా పూర్తిస్థాయిలో ఉద్యమిస్తున్న వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి బాసటగా నిలుస్తామంటూ ప్రతినబూనారు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో పెనుగంచిప్రోలు నుంచి చిల్లకల్లు వరకు 30 కిలోమీటర్ల ‌మేర ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో 100కు పైగా ట్రాక్టర్లతో ర్యాలీ తీసి, మానవహారం నిర్వహించారు. కర్నూలు జిల్లా కల్లూరులోని చెన్నమ్మ సర్కిల్ వద్ద వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ రహదారిపై ట్రాక్టర్లతో గంటల తరబడి రాకపోకలను స్తంభింపజేశారు. డోన్‌లో బుగ్గన రాజారెడ్డి ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించి కర్నూలు-బెంగళూరు రహదారిని దిగ్బంధించారు.

వైయస్ఆర్‌ కాంగ్రెస్ కార్యకర్తల అరెస్టు:
‌ప్రకాశం జిల్లా సంతనూతలపాడు పంచాయతీ కార్యాలయంలో ఎమ్మెల్యే విజయకుమార్ (కాంగ్రెస్) ఉన్నారని తెలుసుకుని అక్కడికి వెళ్లిన ఉద్యమకారులు సమైక్యాంధ్రకు ఎమ్మెల్యే మద్దతు తెలపాలని నినాదాలు చేశారు. దీంతో ఎమ్మెల్యే  వారిని దూషించారు. పోలీసులు జోక్యం చేసుకుని పదిమంది వైయస్ఆర్‌ కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేశారు.

నేడు రహదారుల దిగ్బంధం:
‌సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమంలో భాగంగా వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి పిలుపు మేరకు పార్టీ శ్రేణులు నేడు (గురువారం) సీమాంధ్ర జిల్లాల్లో రహదారుల దిగ్బంధనం చేపట్టాయి. రోడ్లపైనే వంటా వార్పులు చేపట్టనున్నట్టు పార్టీ ప్రకటించింది.

134వ రోజూ నిర్విరామంగా సమైక్య పోరు:
రాష్ట్రం ఒక్కటిగా ఉండటం కంటే మరో ప్రత్యామ్నాయమే లేదన్న నినాదంతో సీమాంధ్రలో ఎగసిన జనోద్యమం వరుసగా 134వ రోజైన బుధవారం విభిన్నరూపాల్లో కొనసాగింది. దేశంలోనే ప్రథమ భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలు చేయకుండా సమైక్యంగానే ఉంచాలంటూ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో స్వచ్ఛందంగా  ప్రజలు రోడ్లపైకి వచ్చి నినాదాలు చేశారు. శ్రీకాకుళం సమీపంలో కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారిపై డెంటల్ కళాశాల విద్యార్థులు బైఠాయించి, రాస్తారోకో జరిపారు. దీంతో చాలాసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కృష్ణాజిల్లా పామర్రులో విద్యార్థులు భారీ మానవహారంగా నిలబడ్డారు. అనంతపురం జిల్లా ఆత్మకూరులో విద్యార్థులు ర్యాలీ నిర్వహించగా,  హిందూపురంలో సమైక్య వాదులు రాస్తారోకో చేశారు.

Back to Top