అదే బడ్టెట్‌.. అంకెలే మార్పు

– గతేడాది బడ్టెట్‌కు అంకెలు మార్చిన మంత్రి పుల్లారావు
– వ్యవసాయ బడ్జెట్‌లో ఉపాధికి దక్కని చోటు
– రెండంకెల వృద్ది రేటని అవే గొప్పలు 
– లెక్కల్లో కనిపించే వృద్ధి.. రాష్ట్రంలో లేదే..?

బడ్జెట్‌లో రైతులకు ఏదో ఒరగబెడతారని కలలు కన్న రైతుల ఆశలకు ప్రత్తిపాటి పుల్లారావు గండికొట్టేశాడు. గతేడాదితో పోలిస్తే 2017–18 వ్యవసాయ బడ్జెట్‌లో పెద్దగా తేడాలేవీ కనిపించకుండా చేశారు. గతేడాది బడ్జెట్‌ను 1900 కోట్ల పెంపుతో ఈ ఏడాది ప్రవేశపెట్టి చేతులు కడిగేసుకున్నారు. వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గత బడ్జెట్‌ కేటాయింపులకు అంకెలు అటూ ఇటూ మార్చేసి మమ అనిపించాడు. వ్యవసాయాన్ని తక్కువ వ్యయంతో లాభసాటిగా మార్చడం, రాష్ట్రాన్ని కరవు రహితంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ప్రచారం చేసుకుంటూనే ఆ స్థాయిలో కేటాయింపులు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారు. రాష్ట్రమంతా వర్షాభావంతో కరువుతో అల్లాడిపోతుంటే కేవలం రూ. 1100 కోట్లు కేటాయించారు. ఉపాధి దొరక్క రైతులు పొట్ట చేతబట్టుకుని పక్క రాష్ట్రాలకు వలస వెళ్లి కూలీలుగా బతుకుంటే చంద్రబాబుకు చీమ కుట్టినట్టయినా అనిపించినట్టుగా లేదు. స్థానికంగా ఉపాధి కల్పించే ఉపాధి హామీ పథకాన్ని మొత్తానికే ఎత్తేశారు. వడ్డీ లేని రుణాలకు గత సంవత్సరం రూ.177 కోట్లు కేటాయిస్తే ఈసారి 5 కోట్లు తగ్గించి కానిచ్చేశారు. శ్రీవెంకటేశ్వర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి గతేడాది 139 కోట్లు కేటాయిస్తే.. ఇప్పుడు 153 కోట్లు కేటాయించారు. అయితే గత బడ్జెట్‌లో కేటాయించిన నిధులు ఎంతవరకు విడుదలయ్యాయి.. ఎంత ఖర్చు చేశారు అంటే మాత్రం... అరకొరే. పంటల బీమాకు 269 కోట్లు కేటాయించారు. ఈ అరకొర నిధులతో ఎంతమందికి లబ్ధి చేకూర్చనున్నారో వారికే తెలియాలి.  దేశంలో తొలిసారిగా బయోమెట్రిక్‌ ద్వారా రైతులకు విత్తనాలు పంపిణీ చేస్తున్నామని బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న సందర్భంగా ప్రతిపాటి పుల్లారావు ప్రకటించారు. వ్యవసాయ దారుల ప్రయోజనాలు కాపాడేందుకు కొత్త విత్తన చట్టం తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. అయితే ఇది చూస్తుంటే దొంగ చేతికే తాళాలు అందించినట్టు కనిపిస్తుంది. ఇప్పటికే ప్రతిపాటి పుల్లారావుకు నకిలీ పత్తి విత్తనాల స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. 

Back to Top