చంద్రబాబుకు మళ్లీ సదావర్తి షాక్‌

– వేలంలో రూ. 60.30 కోట్లు పలికిన సదావర్తి సత్రం భూములు
– గతంతో పోలిస్తే రూ. 37 కోట్లు అదనం
–  ఆర్కే పోరాటంతో బాబు అవినీతి బట్టబయలు

ఏపీ ప్రభుత్వానికి దిమ్మతిరిగిపోయే షాక్‌. సదావర్తి భూముల వ్యవహారంలో ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబును ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించిన ఆర్కే .. సదావర్తి భూములకు తిరిగి వేలంపాట నిర్వహించేలా చేయడం ద్వారా సర్కారుపై పైచేయి సాధించారు. అయితే తాజాగా నిర్వహించిన వేలంలో రూ. 60.30 కోట్లు భారీ ధర పలకడం చంద్రబాబుకు చేదు అనుభవమే. అంటే 37 కోట్లకు పైగా అధిక ధర పలకడం మామూలు విషయం కాదు. చంద్రబాబు మొదట ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అత్యంత విలువైన భూములను కారుచౌకగా తన వారికి కట్టబెట్టిన చంద్రబాబుకు ఆర్కే రూపంలో దెబ్బలు మీద దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తనకు ఎదురులేదని విర్రవీగే చంద్రబాబు ప్రభుత్వానికి నిలువెల్లా కొరడా దెబ్బలే. స్విస్‌ ఛాలెంజ్, పోలవరం, సదావర్తి భూములు.. ఇలా ప్రతి అవినీతి యజ్ఞం కోసం  సర్కారు చేసిన  హోమ గుండంలో ఆర్కే నీళ్లు పోస్తూనే ఉన్నాడు.

చెన్నై నగరంలో సదావర్తి సత్రంకు సంబంధించి ఇప్పుడు 87 ఎకరాల భూములున్నాయి. చెన్నై నడిబొడ్డులో ఉన్న ఆ భూముల విలువ బహిరంగ మార్కెట్‌ ప్రకారం వాటి విలువ దాదాపు వెయ్యి కోట్ల వరకు ఉన్నట్టు అంచనా. అయితే ఆ భూములను కాజేయడానికి చంద్రబాబు సర్కారు పథకం రూపొందించింది. కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ రామానుజయ్య కుటుంబ సభ్యులకు కేవలం రూ.22 కోట్లకు 87 ఎకరాల భూములను కట్టబెట్టింది. అంత విలువైన భూములను వేలం నిర్వహించే ముందు కనీస నియమనిబంధనలు పాటించాల్సిన ప్రభుత్వం అవన్నీ కాదని.. వేలంపాటకు సంబంధించిన పత్రిక ప్రకటనలు కూడా ఏదో మూలన పడేసి ఎక్కడ జరుగుతుందో కూడా తెలియకుండా పనికానిచ్చేశారు. దీనిపై ఆర్కే కోర్టును ఆశ్రయించడంతో మరో ఐదు కోట్లు ఇచ్చి తీసుకోవాలని తీర్పు చెప్పింది. ఇక్కడే చంద్రబాబుకు సదావర్తి భూముల కుంభకోణానికి సంబంధించి మొదటి దెబ్బ తగిలింది. అయితే దానికి బహిరంగ వేలం నిర్వహించాలని మొదట్నుంచి కోర్టులో పోరాడుతున్న ఆర్కేకు కోర్టు నుంచి మరో చల్లని కబురందింది. బహిరంగ వేలం నిర్వహించాలని చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వం సోమవారం వేలం నిర్వహించింది. ఈ వేలంలో 60.30 కోట్ల ధర పలికింది.  

కాపాలా ఉంటానని..
ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రభుత్వ ఆస్తులకు కాపాలగా ఉంటానని.. చివరి రక్తపు బొట్టు వరకు రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమిస్తానని చెప్పిన చంద్రబాబు అవినీతి యజ్ఙం చేస్తున్నాడు. ప్రభుత్వ ఆస్తులను కారుచౌకగా తనవారికి కట్టబెడుతున్నాడు. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ మూడేళ్లలో జరిగిన భూ బాగోతాలు చూస్తుంటే ఎవరికైనా దిమ్మతిరిగిపోవాల్సిందే. అభివృద్ధి పేరుతో చంద్రబాబు కాసుల సేద్యం చేస్తున్నాడు. వారానికో కార్యక్రమం మొదలు పెట్టి జీవో తీసుకొచ్చి సర్కారు సొమ్మును హారతి కర్పూరంలా కరిగించేస్తున్నాడు. వైయస్‌ఆర్‌సీపీ పోరాటంతోనే సర్కారు ఆగడాలకు అడ్డుపడుతుంది తప్ప బలమైన ప్రతిపక్షం లేకపోయుంటే చంద్రబాబు ఈ పాటికే ఆంధ్రాను సింగపూర్‌కు అమ్మేసేవాడే. విభజన చట్టం ప్రకారం ఏపీకి దక్కాల్సిన ఆస్తులను ఓటుకు నోటు కేసులో ఇరుక్కుపోయి కేసీఆర్‌కు తాకట్టు పెట్టిన చంద్రబాబు హైదరాబాద్‌ నుంచి కరకట్టకు పారిపోయాడు. అయితే దానికి అమరావతి నిర్మాణం అంటూ అందమైన అబద్ధాన్ని జతచేశాడు. 
Back to Top