సామాన్యులపై ప్రధాని సంస్క'రణం'

ఆమ్ ఆద్మీ అంటే సామన్య ప్రజల్నిఇక్కట్ల పాలు చేయడానికే ప్రధానమంత్రి పీఠాన్ని మన్మోహన్ సింగ్ దుర్వినియోగం చేస్తున్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అగ్గిమీద గుగ్గిలమయ్యారు.
యూపీఏ ప్రభుత్వంలో కాంగ్రెస్, తృణమూల్ నిన్న, మొన్నటి వరకు రాసుకుని, పూసుకొని తిరిగారు.  రాజకీయాల్లో ఏ క్షణంలో ఏమి జరుగుతుందో ఎవరూ చెప్పలేరు అనే దానికి వీరి బంధమే తాజా ఉదాహరణ. నీకు నేను.. నాకు నువ్వు.. ఒకరికొకరం నువ్వు నేను అంటూ నిన్నటి వరకు రాజకీయ గీతాలు పాడిన ఈ ఒకే గూటికి చెందిన ప్రేమ పక్షులు.. ఇపుడు విడిపోయారు. ప్రస్తుతం వీరి మధ్య నీటిలో ముంచిన పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా.. మాటల్లో మంటలు రేగుతున్నాయి. అసహనంతో గుండెల్లో దాచుకున్న మాటలను.. ఈటెలుగా మార్చి ఒకరిపై ఒకరు విసురుకుంటున్నారు. 16 నెలల హనీమూన్ ముగిసిన వెంటనే ఇద్దరి మధ్య ఉన్నది.. కాంట్రాక్ట్ ప్రేమేనని బట్టబయలైంది. ఇంకేం ఒకరిపై ఒకరు మాటల బాణాలు సంధించుకున్నారు.
సామన్య ప్రజల్ని(ఆమ్ ఆద్మీ)ని ఖతం చేయడానికే ప్రధానమంత్రి పీఠాన్ని మన్మోహన్ సింగ్ దుర్వినియోగం చేస్తున్నారంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఆమ్ ఆద్మీ, ప్రజాస్వామ్య పదాలకు నిర్వచనమేమిటో చెప్పాలని యూపీఏ ప్రభుత్వాన్ని అడుగాలనుకుంటున్నానని.. ఆమ్ ఆద్మీ పేరుతో అధికారాన్ని దుర్వినియోగం చేయడానికి ప్రధాని గేమ్ ప్లాన్ చేశారని.. మన్మోహన్ సింగ్ దూరదర్శన్ టెలివిజన్ లో జాతిని ఉద్దేశించి ప్రసంగించిన కొద్ది సేపటికే సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ ఫెస్ బుక్ లో మమతా తీవ్ర స్థాయిలో మాటల యుద్ధానికి దిగారు. తమ ప్రయోజనాలను పరిరక్షిస్తారనే విశ్వాసంతో సామాన్యులు రెండవసారి ప్రభుత్వానికి పట్టం కట్టారని.. అలాంటి ప్రజలపైనే సంస్కరణల పేరుతో యూపీఏ ప్రభుత్వం నడ్డి విరిచేందుకు సిద్ధమైందని దీదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు 'మమతా పోకడంతా నియంతృత్వమే. పశ్చిమ బెంగాల్ లో లా అండ్ ఆర్డర్ లేనే లేదు. రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉంది' అంటూ దీదీపై కౌంటర్ ప్రారంభించిన బెంగాల్ కాంగ్రెస్ నాయకులు భారీగానే స్పందించారు. బెనర్జీ ప్రభుత్వానికి నరేంద్ర మోడి సర్కార్ కు తేడాలేదని బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రదీప్ భట్టాచార్య విమర్శించారు. మోడి వ్యాఖ్యలే మమతా నోటి నుంచి రాలుతున్నాయన్నారు. లౌకిక బెంగాల్ లో మోడి తరహా మాటలను ఇక సహించేది లేదని భట్టాచార్య మండిపడ్డారు. చిల్లర వర్తక రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించకపోవడం రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసేందుకు మమతా ప్రయత్నిస్తుందన్నారు. అంతేకాక మమతా ప్రభుత్వం నుంచి తాము తప్పకుంటున్నట్టు ప్రకటించారు. బెంగాల్ అసెంబ్లీలో లెఫ్ట్ పార్టీల కంటే రెండు స్థానాలు అధికంగా ఉన్న కాంగ్రెస్ ఇక ప్రతిపక్ష పాత్రను పోషించడానికి సిద్ధమని తెలిపింది. బెంగాల్ అసెంబ్లీలో కమ్యూనిస్టులకు 40 సీట్లు ఉండగా.. కాంగ్రెస్ పార్టీకి 42 స్థానాలున్నాయి.
నిన్నటి వరకు కలిసి మెలిసి పోటి చేసి.. చెట్టాపట్టాలేసుకుని తిరిగిన కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మాటల తీరులో ఎంతో మార్పు కనిపించింది. ఒక్కరోజులో మనసులో ఉన్న అసలు రూపాలను బయటపెట్టుకున్నాయి. స్వప్రయోజనాలకు భంగం కలుగడం.. మాట చెల్లుబాటు కాలేదన్న మనస్పర్థతో దూరమయ్యారే తప్ప.. వీరికి ప్రజా శ్రేయస్సుపైన నిజమైన శ్రద్ధ లేదనే సత్యం అని ప్రజలనకుంటున్న మాట. అంతే మరి రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం, మిత్రుత్వం ఉండదనేది జగమెరిగిన సత్యం. ఇక ఇద్దరి మహిళల మధ్య ఆధిపత్య పోరులో మన్మోహనుడు చితికిపోతూ... నారీ నారీ నడుమన మన్మోహన్ లా కనిపిస్తున్నాడు.. పాపం ప్రధాని!

Back to Top