రైతు బీమా సరే ధీమా ఏది?

శుభం పలకరా చంద్రన్నా అంటే తుమ్మాక చెబుతారా మల్లన్నా అన్నాడట వెనకటికొకడు. చంద్రబాబు వాలకం అచ్చు అలాంటిదే. రైతులకు మేలు చేయవయ్యా చంద్రబాబూ అంటే రైతు మరణిస్తే బీమా ఇస్తా అంటున్నాడు. నేలను నమ్ముకున్న రైతు ఏ కారణంతో అయినా మరణిస్తే, ఆ కుటుంబానికి ఆర్థిక వెసులుబాటు అందివ్వడం తప్పు కాదు. కానీ బతికున్న రైతుకు, వ్యవసాయం చేసే అవకాశమే లేకుండా చేయడం దారుణం. ఇన్నేళ్ల పాలనలో రైతులను నిర్లక్ష్యం చేయడం తప్ప, రైతు సంక్షేమాన్ని చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదు. నేడు ఎన్నికల సమయంలో వరుసగా కొత్త పథకాలంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు చంద్రబాబు. అందులో భాగంగానే చంద్రన్న రైతు బీమా ప్రవేశ పెట్టాడు. రైతుల వ్యవసాయానికి సాయం అందించడానికి బాబుకు ఎప్పుడూ మనసు రాదని చెప్పడానికి ఇంతకంటే రుజువేం కావాలి!!
భూమి పుత్రులను పట్టించుకోని ప్రభుత్వం
అన్నదాతలను ఆదుకోవాలంటే ప్రభుత్వం ఏం చేయాలి? రైతుకు పంటరుణాలు పుష్కలంగా అందేలా చూడాలి. పెట్టుబడులకు సాయం అందించాలి. సాగుసమయానికి నీరందించాలి. నాణ్యమైన విత్తులు, ఎరువులు పంపిణీ చేయగలగాలి. వారి పంటలకు మద్దతు ధర ఇవ్వాలి. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలి. పంట బీమా సొమ్ము అందేలా చేయాలి. కానీ చంద్రబాబు వీటిలో ఏ ఒక్కటీ చేయడు. రెయిన్ గన్లంటాడు. కోట్లు ఖర్చు చేస్తాడు. వాటిలో గాలి తప్ప నీరు రాదు. చంద్రన్న వ్యవసాయ క్షేత్రాలు అంటాడు. పచ్చనేతల క్షేత్రాలు తప్ప బడుగు రైతుల క్షేత్రాలకు ఆ పథకాలు అందవు. చంద్రన్న రైతు రథాలు అన్నాడు. మండలానికి పట్టుమని పది ట్రాక్టర్లు కూడా ఇవ్వలేదు. ఎన్నికలప్పుడు ధర స్థిరీకరణ నిథి అన్నాడు. అది ఏమయ్యిందో ఎవ్వరికీ తెలియదు. నకిలీ విత్తన సంస్థల వల్ల భారీగా నష్టపోయి, రాజధాని నడిబొడ్డున ఆత్మహత్యలకు సిద్ధపడ్డ రైతులకు ముఖ్యమంత్రి కనీసం న్యాయం చేస్తామన్న హామీ అయినా ఇవ్వలేదు. 
పంటపొలాలు కార్పొరేట్లపాలు
మూడు పంటలు పండే మాగాణి భూములను కార్పొరేట్ కంబంధ హస్తాల్లో పెడుతున్న చంద్రబాబు వ్యవసాయానికి, రైతుకు సాయం చేస్తాడంటే ఎవ్వరూ నమ్మలేరు. భూసేకరణ పేరుతో రైతుల పంట పొలాలను బలవంతంగా స్వాధీనం చేసుకుని, పచ్చని చేలను బీళ్లు చేసిన ఘనత బాబుది. వ్యవసాయం ఏం చేస్తారు? వ్యాపారం చేయండి అని రైతులకు పిలుపునిచ్చే ముఖ్యమంత్రిని ఒక్క ఎపిలోనే చూడగలం. 
అన్నదాతలకు అండగా వైఎస్ జగన్
అన్నపూర్ణ ఆంధ్రరాష్ట్రంలో అన్నదాతలకు ఆసరా కరువైన తరుణంలో, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతులకు అండగా ఉంటానని మాటిస్తున్నారు. రైతు రైతుగా బతికేందుకు, ఆ రైతు వ్యవసాయానికి సాయం అందించేందుకు రత్నాల్లాంటి పథకాలను అందిస్తామని హామీ ఇచ్చారు. ఐదెకరాల లోపు ఉన్న రైతులకు 50,000 నగదు, ఏటా మే నెలలో ఎరువులు, విత్తనాల కోసం 12500 అందించడం, రైతులకు వడ్డీలేని, పావలా రుణాలు, 2000 కోట్లతో విపత్తు సహాయక నిథి, 3000 కోట్లతో ధరల స్థిరీకరణ నిథి ఏర్పాటుంఇవీ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత అన్నదాతలకు అందించిన వరాలు. అన్నంపెట్టే రైతన్నను ఆదుకుంటామని, అండగా ఉంటామని ప్రజా సంకల్ప యాత్రలో ప్రతి రైతుకూ భరోసా ఇస్తున్నారు వైఎస్ జగన్. రైతు కంట కన్నీరు రానివ్వనని, రైతు సంక్షేమమే లక్ష్యంగా రైతు రాజ్యాన్ని ఏర్పాటు చేస్తానని వ్యవసాయం సాక్షిగా హామీ ఇచ్చారు. వ్యవసాయానికి పూర్వ వైభవం రావాలంటే, రాష్ట్రం కళకళ లాడాలంటే, రైతు ముఖాన చిరునవ్వులు పూయాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలి అనుకుంటున్నారు అన్నదాతలు. భూమిని నమ్మిన వారి నమ్మిక ఇప్పుడు జగన్ పై ఉంది. అది వమ్ముకాదని వారికి బాగా తెలుసు.  

 
Back to Top