ప్రజా సమస్యల పరిష్కారమే సంకల్పం

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రతిపక్ష నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మహా సంకల్పంతో ముందుకు ఉరుకుతున్నారు. నవంబర్‌ 6 నుంచి 6 నెలల పాటు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఆయన 125 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. మిగిలిన 50 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర ద్వారా ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు నడుం బిగించారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి, మహానేత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి చేసిన ప్రజా ప్రస్థానం స్ఫూర్తితో ముందుకు సాగనున్నారు. పార్టీకి జవసత్వాలు సమకూర్చడంతోపాటు రాబోవు ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ప్రజలకు సేవ చేయాలనే మహాసంకల్పంతో ఆయన ముందడుగు వేస్తున్నారు. 

వైయస్‌ఆర్‌ ప్రజా ప్రస్థానం స్ఫూర్తితో.. 

ఆనాడు మహానేత వైయస్‌ఆర్‌ చేపట్టిన పాదయాత్రలో ఎంతోమందితో నేరుగా కలుసుకుని మాట్లాడారు. వారి కష్టాలను స్వయంగా చూశారు. అతివృష్టి, అనావృష్టితో నష్టపోతున్న అన్నదాత బాధలను చూసి చలించిపోయారు. నీరు లేక ఎండిపోయిన ప్రాజెక్టులను చూశారు. పిచ్చి మొక్కలు మొలిచి పూడు నిండిపోయిన చెరువుల దౌర్భాగ్యాన్ని ప్రత్యక్ష్యంగా చూశారు. రైతుల ఆత్మహత్యలు చూసి కదిలిపోయారు. ఉపాధి లేక పక్క రాష్ట్రాలకు వలసపోతున్న దైన్యాన్ని చూసి చలించిపోయారు. ఒక పూట తింటే మరో పూట పస్తులండే స్థితుల నుంచి.. పిల్లలను సర్కారు బడికి పంపే స్థోమత కూడా లేక కూలీకి పంపే దౌర్భాగ్యం నుంచి నా ఆంధ్రప్రదేశ్‌ను కాపాడు తల్లీ భూదేవిని ప్రార్ధించారు. శక్తులన్నీ కూడదీసుకుని మండుటెండల్లో రోజుకు 22 కిలోమీటర్లు మొత్తం 1470 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. చేవెళ్ల నుంచి మొదలైన పాదయాత్ర ఇచ్ఛాపురం దాకా అప్రతిహతంగా సాగింది. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా చేపట్టిన పాదయాత్ర ఆయన్ను ముఖ్యమంత్రిని చేసింది. 

రుణం తీర్చుకున్న మహానేత..

తనను ముఖ్యమంత్రిని చేసిన ప్రజలకు తన పరిపాలన ద్వారా రుణం తీర్చుకున్నారు మహానేత వైయస్ఆర్. ఇచ్చిన హామీలనే కాదు.. ఎన్నో చెప్పని పనులనూ చేసి చూపించారు. మఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే.. ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం చేశారు. ఆ ఒక్క సంతకంతోనే రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయో.. తాను ఏం చేయబోతున్నానో ప్రజలకు చెప్పకనే చెప్పారు వైయస్‌ఆర్‌. చెప్పడమే కాదు.. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకోవడం ఆయన గొప్పతనం. అన్నం పెట్టే అన్నదాత అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకోవడం భరించలేక రైతు రుణమాఫీని షరతుల్లేకుండా అమలు చేసి యావత్‌ తెలుగు రైతు కుటుంబాల ప్రేమకు దాసుడయ్యారు. ఆకాశం నుంచి జారి పడే ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టేందుకు జలయజ్ఞంతో భగీరథ ప్రయత్నం చేసి రైతులింట సిరులు పండించారు. రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దారు. రైతులు పంటలపై వచ్చిన ఆదాయాన్ని అనారోగ్యాలతోనో, పిల్లల చదువులపై వెచ్చించి అప్పలు కావడం ఇష్టం లేక పేదవాడికి కార్పొరేట్‌ వైద్యం అందించారు. పిల్లల చదువులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని అమల్లోకి తెచ్చి ఎంతోమందిని ఇంజినీర్లుగా తీర్చిదాద్దారు. ఆయన్ను దేవుడిని చేశాయి. వైయస్‌ఆర్‌ కీర్తిని హిమాలయాల ఎత్తుకు చేర్చాయి.

పీకల్లోతు అవినీతిలో బాబు సర్కారు

పేద ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా వైయస్‌ఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు తర్వాత కొలువుదీరిన ప్రభుత్వాలు తూట్లు పొడిచాయి. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలను భ్రష్టుపట్టించారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని మాటిచ్చి రైతులకు వెన్నుపోటు పొడిచారు. నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి యువత, నిరుద్యోగులను వంచించారు. మూడున్నరేళ్లయినా దానికోసం ప్రయత్నించిన పాపాన పోలేదు. రైతు రుణమాఫీ వడ్డీలకే చాలడం లేదు. పేదలకు సంజీవనిగా నిలిచిన ఆరోగ్యశ్రీ పథకంలో ఎన్నో వ్యాధులను తొలగించారు. 104 ఎత్తేశారు. 108 అంబులెన్సులు డీజిల్‌ లేక మూలనపడ్డాయి. అన్ని అర్హతలున్న వికలాంగులు సైతం పింఛన్లు అందక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. జన్మభూమి కమిటీల పేరుతో గ్రామాల్లో టీడీపీ నాయకులు చేస్తున్న ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సరిగా అమలుకాక విద్యార్థులు చదువు మానేస్తున్నారు. ఇసుక మాఫియా, ల్యాండ్‌ మాఫియా, కాల్‌ మనీ సెక్స్‌రాకెట్‌ మాఫియా, ఆస్పత్రుల్లో చిన్నారుల మరణాలు, అమరావతి భూ కుంభకోణం, పోలవరం ప్రాజెక్టులో అవినీతి, అంతర్జాతీయ రాజధాని పేరుతో తాత్కాలిక సంచివాలయం, తాత్కాలిక అసెంబ్లీకి 900 కోట్లు తగలెయ్యడం..  ఏ పనిచేపట్టినా అవినీతి రాజ్యమేలుతోంది. ప్రభుత్వం పీకల్లోతు అవినీతిలో  కూరుకుపోయింది. దేశంలోనే ఏపీని అవినీతిలో నెంబర్‌ వన్‌గా చేసిన ఘనత కూడా చంద్రబాబుదే. చంద్రబాబు పాలనలో సామాన్య ప్రజలకే కాదు ఉద్యోగులకే రక్షణ లేకుండాపోయింది. కార్పొరేట్‌ కళాశాలల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారినా మంత్రి నారాయణపై చర్యలుండవు.. మహిళలకు రక్షణ కావాలంటే బాబు రావాలని ఎన్నికలకు ముందు ప్రచారం చేసుకుని ఇప్పుడు మహిళల మీద దాడులు జరుగుతున్నా ఒక్కచోటా చర్యలు తీసుకుంటున్న పాపానపోవడం లేదు. పైగా కొన్ని కేసుల్లో ముఖ్యమంత్రే స్వయంగా రంగంలోకి దిగి సెటిల్‌మెంట్లు చేశారనే ఆరోపణలు లేకపోలేదు. ముఖ్యమంత్రితో సహా మంత్రులు కేసుల్లో ఇరుక్కుపోయారు. ఏపీకి సంజీవని లాంటి ప్రత్యేక హోదాను తన ఓటుకు నోటు కేసు కోసం పణంగా పెట్టారు. అగ్రిగోల్డ్‌ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న లింగమనేని గెస్ట్‌ హౌస్‌లో స్వయంగా ముఖ్యమంత్రే కాపురం పెట్టేసి అవినీతికి అండదండగా ఉంటానని సందేశం పంపారు. 
ఇలా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఒడ్డున పడేయాలంటే చంద్రబాబు ప్రభుత్వం దిగిపోవాలి. ప్రభుత్వ అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పాదయాత్రను ఆయుధంగా ఉపయోగించుకోనున్నారు. 
Back to Top