రాజధాని మోజులో చంద్రబాబు..!

వెనుకబడిన ప్రాంతాలకు వెన్నుపోటు..!
చంద్రబాబు తీరుపై మండిపడుతున్న ప్రజలు..!

ఆంధ్రప్రదేశ్ః రాష్ట్ర రాజధాని పేరుతో రాష్ట్రంలో చంద్రబాబు సాగిస్తున్న అరాచక పాలనపై  ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు అనుసరిస్తున్న తీరు వెనుకబడిన ప్రాంతాల ప్రజలకు ఏమాత్రం రుచించడం లేదు. రాజధాని మీద ఉన్న యావతో చంద్రబాబు తమ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని  అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. కేంద్రం నుంచే వచ్చే నిధులతో పాటు...ఇతర ప్రాంతాల నిధులను రాజధానికే మళ్లిస్తూ చంద్రబాబు తమకు తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడుతున్నారు. అంతేకాదు ఎన్నికల్లో ఎక్కువ సీట్లు రాని ప్రాంతాలను చంద్రబాబు టార్గెట్ చేశారు . స్వయంగా మంత్రులే తమ ప్రాంతానికి అభివృద్ధిలో ప్రాధాన్యం కల్పించడం లేదంటూ బహిరంగంగా  విమర్శలు గుప్పించిన సందర్భాలున్నాయి.

రాజధాని పేరుతో దుబారా..!
తాజాగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన నిధుల్లోనూ చంద్రబాబు వెనుకబడిన జిల్లాలకు అన్యాయం చేశారని ఆప్రాంత మేధావులు, నిపుణులు అంసతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రాంత ప్రయోజనాలను పణంగా పెట్టి కమీషన్ల కోసం పట్టిసీమను తీసుకొచ్చి రూ.1500 కోట్లను మింగేశారని ఆరోపిస్తున్నారు. రాజధాని పేరిట పెద్ద ఎత్తున సాగుతున్న దుబారా, వెనుకబడి ప్రాంతాల ప్రయోజనాలను దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఖరి అన్ని వర్గాల వారి సంక్షేమాలకు ఆటంకంగా మారిందన్నారు. 

ఇకపై సహించబోం..!
రాజధాని మోజులో తమ ప్రాంతాలను  విస్మరిస్తే ఇకపై సహించబోమని వెనుకబడిన ప్రాంతాల ప్రజలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. రైతులు, కార్మికులు ఇలా అందరి పొట్టగొడుతూ చంద్రబాబు సాగిస్తున్న అవినీతి, అక్రమాలకు హద్దే లేకుండా పోతుందని విమర్శిస్తున్నారు. రాజధాని నిర్మాణం, పెట్టుబడులు అంటూ చంద్రబాబు విదేశాల్లో చేసుకుంటున్న చీకటి ఒప్పందాలపై భగ్గుమంటున్నారు. ఎవరికీ తెలియకుండా రహస్యంగా సాగిస్తున్న గుట్టును బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. 

Back to Top