టెక్స్‌టైల్ ఇండస్ట్రీలో భారత్ బెస్ట్... చైనాను అర్థించడం దేనికి?సోలార్, సిమెంట్ ఇండస్ట్రీలకు స్థానికులు పనికిరారా?ఇక్కడివారికి కేసులు... బైటవారికి బంపర్ ఆఫర్లు..ఎంఓయూలు ఎందుకు బహిర్గత పరచరు?రాయితీలు, పెనాల్టీ క్లాజుల సంగతేమిటి?తొమ్మిదేళ్లలో ఎన్ని పెట్టుబడులు తెచ్చారు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరురోజులపాటు చైనాలో పర్యటించి వచ్చారు. రాష్ట్రాన్ని భూతల స్వర్గంగా మార్చేయడానికి చంద్రబాబు నాయుడు చెమటోడ్చేస్తున్నారని, చైనాతో కుదిరిన అనేక ఒప్పందాలే ఇందుకు నిదర్శనాలని అనుకూల మీడియాలో కథనాలు హోరెత్తుతున్నాయి. నిజానికి చంద్రబాబు చైనా పర్యటనలో జరిగిందేమిటి..? ఒరిగిందేమిటి..? రాజధాని నిర్మాణంపై సింగపూర్, జపాన్‌లను దేబిరించి వచ్చిన చంద్రబాబు అదేపని చైనాలోనూ చేసి వచ్చారు.. సిమెంట్, సోలార్, టెక్స్‌టైల్స్ పరిశ్రమల్లో పెట్టుబడుల కోసం కూడా ఆయన చైనా వారిని చేతులు చాచి అర్థించారు. గత తొమ్మిదేళ్ల పాలన కాలంలోనూ ఇలాంటి నాటకాలు ఆయన చాలా ఆడారు. అయితే ఆ తొమ్మిదేళ్లలో ఎన్ని పెట్టుబడులు వచ్చాయని అడిగితే ఆయన ఎప్పుడూ నోరు విప్పిన పాపాన పోలేదు. గతంలో పర్యటించిన దేశాలలో కుదిరిన ఎంఓయూలను గానీ ఇపుడు చైనాలో కుదిరిన ఒప్పందాలను గానీ ఎందుకు బహిర్గతపరచరన్న ప్రశ్నకు జవాబు లేదు. ఇవే కాదు చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పలేని ప్రశ్నలనేకం ఉన్నాయి... అవేమిటంటే.. సిమెంటు ఇండస్ట్రీలోకి, టెక్స్‌టైల్ ఇండస్ట్రీలోకి, సోలార్ ప్లాంట్లు పెట్టించడానికి చంద్రబాబు బృందం చైనాలో పర్యటించినట్లుగా ఎంవోయూలు చూస్తే అర్థమౌతోంది. సిమెంటు ఇండస్ట్రీలో అందులో ఏపీలో చైనా పెట్టుబడులు అవసరమా? సోలార్ పవర్‌కు సంబంధించి ఇక్కడి పారిశ్రామికవేత్తలు చంద్రబాబుకు పనికిరావడం లేదా? టెక్స్‌టైల్ ఇండస్ట్రీలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంటే.. చైనా వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టాలంటూ బాబుగారు చైనావారిని అర్థించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? చివరికి ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని నిర్మాణంలో చైనా కూడా పాలుపంచుకోవాలని బాబుగారు విజ్ఞప్తి చేశారు. ఇంతకుముందు సింగపూర్ వెళ్ళి ఇదే అడిగారు. జపాన్ వెళ్ళి ఇదే అడిగారు. ఇప్పుడు చైనా వెళ్ళి ఇదే అడిగారు. అంటే చంద్రబాబుకు రాజధాని నిర్మించటం చేతగాక ఇలా అడుగుతున్నారా? లేక వారు ఈ రంగంలో అనుభవజ్ఞులని ఆయన నమ్ముతున్నారా? ప్రపంచంలో ప్రతి దేశమూ సహకరిస్తే తప్ప రాజధాని నిర్మించలేం అని భావిస్తున్నారా? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఏ)తో కలిసిపార్టనర్‌షిప్ సమ్మిట్‌లు పెట్టారు. ప్రతి పార్టనర్‌షిప్ సమ్మిట్‌లోనూ ఏకంగా 50 వేల కోట్ల నుంచి లక్ష కోట్ల వరకు ఏపీలో పరిశ్రమలు పెట్టడానికి పారిశ్రామికవేత్తలతో ఎంవోయూలు కుదుర్చుకున్నారు. పేపర్లలో దానికి సంబంధించి విపరీతమైన ప్రచారం చేయించుకున్నారు. ఏపీకి వస్తున్న పెట్టుబడులు ఓ ప్రవాహంలా ఉన్నాయనే ఇంప్రెషన్ ఇచ్చారు. కానీ, చంద్రబాబు ఆ 9 ఏళ్ళలో కుదుర్చుకున్న ఎంవోయూలు లక్షల కోట్ల మేరకు ఉంటే... వచ్చిన పెట్టుబడులు వందల కోట్లలో కూడా లేవు. ఇది నిజం కాదా? ఆల్‌రెడీ ఇండియాలో ఉన్న కంపెనీలతో ఏవో ప్రాజెక్టులు పెట్టిస్తున్నామని చెప్పేవారు తప్పితే, ఒక్క గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టు అంటే- సంపూర్ణంగా కొత్తగా ఒక కంపెనీ పది వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రారంభించిన ప్రాజెక్టు చంద్రబాబు హయాంలో ఒక్కటైనా ఏపీకి వచ్చిందా? ఇప్పుడూ అదే పరిస్థితి. జపాన్‌లో ఎంవోయూలు కుదిరాయంటారు. సింగపూర్‌తో ఎంవోయూలు కుదుర్చుకున్నామంటారు. ఇప్పుడు చైనాకు వెళ్ళి ఎంవోయూలు కుదుర్చుకున్నామంటారు. ఈ ఎంవోయూలన్నింటినీ చంద్రబాబు ఎందుకు బహిరంగ పరచటం లేదు? ఈ ఎంవోయూలు ఏమైనా రహస్య ఒప్పందాలా? ఇందులో ఏమైనా ఇల్లీగల్ అంశాలు ఉన్నాయా? భారత చట్టాలకు లోబడని అంశాలు ఇందులో ఏమైనా ఉన్నాయా? భారత దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించే అంశాలు ఇందులో ఏమైనా ఉన్నాయా? లేనిపక్షంలో ఎంవోయూల విషయంలో దాపరికం ఏమిటి? చంద్రబాబు ఎంవోయూలకు లీగల్ టినబులిటీ ఉందా? అంటే న్యాయపరంగా అవి సక్రమమైన ఒప్పందాలా? కాదా? ఈ మాట ఎందుకు అడుగుతున్నామంటే- శక్తి, సామర్థ్యం పెట్టుబడి లేని పనికిమాలిన కంపెనీలు అటూ ఇటూ కూర్చుని ఒక పది వేల కోట్లకు ఒప్పందం చేసుకున్నాయంటే- దాన్ని చంద్రబాబు మీడియాలో ప్రొజెక్ట్ చేస్తే చేయవచ్చుగానీ అర్థ అణా కూడా ఆంధ్రప్రదేశ్‌కు రాదు. చంద్రబాబు హయాంలో జరుగుతోంది ఇలాంటి ఒప్పందాలేనా? బాబుగారి ట్రాక్ రికార్డ్‌ను బట్టి ఈ ప్రశ్న అడగాల్సి వస్తుంది. ఏ కంపెనీకి అయినా ప్రభుత్వాలు రాయితీలు ఇచ్చేటప్పుడు ఆ రాయితీలకు ఒక పరమార్థం ఉంటుంది. ఇన్ని వేల ఉద్యోగాలు కల్పిస్తామనో, మనకు కొరతగా ఉన్న వస్తువుల్ని ఉత్పత్తి చేస్తామనో, ఆర్థికంగా రాష్ట్ర ఖజానాకు ఇంత ప్రయోజనం ఉంటుందనో, ఖచ్చితంగా ఒప్పందం ఉంటుంది. ఆమేరకు ప్రయోజనాలను సదరు కంపెనీ అందించటంలో విఫలమైతే భూములు వెనక్కు తీసుకోవటమే కాకుండా పెనాల్టీ ఏమిటో కూడా పెనాల్టీ క్లాజు ఉంటుంది. ఇటు ఏపీలో కంపెనీలకి చంద్రబాబు ఇచ్చిన రాయితీలకు సంబంధించిగానీ, అటు చైనా, జపాన్, సింగపూర్, ఇతర దేశాలతో మీరు కుదుర్చుకున్న ఒప్పందాల్లో గానీ ఉన్న పెనాల్టీ క్లాజు ఏమిటో బయట పెట్టాలి. వస్త్ర పరిశ్రమలోనూ, సిమెంటు పరిశ్రమలోనూ, సోలార్ ప్యానల్స్ విషయంలోనూ, విదేశీ పెట్టుబడులు అందునా చైనా పెట్టుబడులు కావాలంటున్న చంద్రబాబు ఇక్కడి పారిశ్రామిక వేత్తలకు అవే రాయితీలు ఇస్తున్నారా? ఇక్కడి పారిశ్రామికవేత్తల మీద అక్రమ కేసులు పెట్టిస్తున్నారు. వీరికి ఏ రాయితీలు ఉండవు. భారతీయులకు, తెలుగువాళ్ళకు కోర్టు కేసులే చంద్రబాబు ఇస్తున్న రాయితీలు. అదే విదేశీయులకు భూములు, వ్యాట్ మినహాయింపులు, పక్క రాష్ట్రాల్లో పన్ను రీయంబర్స్‌మెంటు వంటివి ఆయన ఇస్తున్న రాయితీలు. అవార్డులు చంద్రబాబుకు.. రివార్డులు విదేశీ కంపెనీలకు... కష్టాలు, నష్టాలు ఏపీ ప్రజలకు... ఇదీ చంద్రబాబు విదేశీ అగ్రిమెంట్లు, పర్యటనల వల్ల తెలుగు వారికి జరిగేది. హీరోహోండా, ఏషియన్ పెయింట్స్ ఎంఓయూలు బైటపెట్టాలిఆంధ్రప్రదేశ్ బార్డర్‌లో తమిళనాడుకు పక్కన మీరు హీరో హోండా కంపెనీకి దాదాపు 600 ఎకరాలు అప్పనంగానో.. నామమాత్రపు ధరకో కట్టబెట్టారని చంద్రబాబే చెప్పారు. ఒక మోటార్ ఫీల్డ్ కంపెనీ తీసుకువస్తున్నప్పుడు ఆ కంపెనీ వల్ల అనుబంధ పరిశ్రమలు వస్తాయని, అంటే యాన్సిలరైజేషన్ జరుగుతుందని ఎవరికైనా తెలుసు, తమిళనాడు బార్డర్‌లో తమిళనాడు ఎయిర్‌పోర్టుకు దగ్గరగా ఉన్నచోట హీరో హోండా కంపెనీ పెడితే అనుబంధ పరిశ్రమ అంతా తమిళనాడులో వస్తుంది తప్ప ఏపీలో రాదు. అదీకాక, హీరో హోండా కంపెనీతో కుదుర్చుకున్న ఎంవోయూను చంద్రబాబు ఎందుకు బయట పెట్టడం లేదు? మీడియాకు ఎందుకు ఇవ్వటం లేదు? హీరో హోండాకు గానీ, ఏషియన్ పెయింట్స్‌కుగానీ చంద్రబాబు ఇచ్చిన రాయితీలు భారతదేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగనివి. రాయితీలు ఇచ్చారంటే దానర్థం బాబుగారి సొమ్మేదో ఇచ్చినట్టు కాదు. జనం సొమ్మును హారతిపళ్ళెంలో పెట్టి వారికి అప్పగించినట్టు. ఒక్క హీరో హోండా కంపెనీకే ఏపీలో 20 ఏళ్ళపాటు వ్యాట్ నుంచి మినహాయింపు ఇచ్చారని సమాచారం. ఇంతటితో ఆగకుండా ఆ కంపెనీ తమిళనాడులో రాబోయే ఇరవై ఏళ్ళలో చెల్లించే వ్యాట్‌ను కూడా ఏపీ ఖజానా నుంచి రీయంబర్స్ చేస్తామని చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారు. నిజానిజాలు ఎంవోయూ ఉంటే బయట పెట్టాలి. అలాగే ఏషియన్ పెయింట్స్‌కు ఇచ్చిన రాయితీల ఎంవోయూలు కూడా బయట పెట్టాలి. గతంలో తెచ్చిన పెట్టుబడులెన్ని బాబూ..? అసలు చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన పెట్టుబడులు ఎన్ని? 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన చేసింది ఏమిటి? దేశంలోకెల్లా అత్యధికంగా పెట్టుబడులు వస్తున్నాయని గతంలో 9 ఏళ్ళ పరిపాలనలో మీడియా ద్వారా ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు. ఏటా దావోస్‌కు వెళ్ళి వచ్చారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో పాల్గొన్నారు. దానివల్ల ఏపీకి ఏం పెట్టుబడులు వచ్చాయంటే మాత్రం చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఆరోజు నుంచి ఈరోజు వరకు ఎప్పుడూ లేకపోయింది. బాబుగారు పెట్టుబడులను భారీగా తీసుకువస్తున్నారని, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నారని గతంలో గట్టిగా ప్రచారం ఉండేది. బెస్ట్ బిజినెస్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అనే అవార్డును కూడా గెలుచుకున్న వ్యక్తి చంద్రబాబు. అప్పట్లో ఒక అంతర్జాతీయ పత్రిక చంద్రబాబును ప్రపంచపు డ్రీమ్ క్యాబినెట్‌లో ఒక మెంబరుగా కూడా ఎంపిక చేసింది. ఇలాంటి ఆర్భాటపు ట్రాక్ రికార్డ్ ఆయనకు కావాల్సినంత ఉంది. ఈ ట్రాక్ రికార్డ్ పెట్టుకుని చంద్రబాబు రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు తెచ్చారు?